Telangana: వేలానికి 15 గనులు సిద్ధం

రాష్ట్రంలో మేజర్, మైనర్‌ మినరల్‌ బ్లాకులను వేలం పద్ధతిలో కేటాయించేందుకు గనులశాఖ సిద్ధమైంది. ఖనిజాల వారీగా ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించింది.

Published : 09 Jun 2024 04:29 IST

వాటిలో 3 సున్నపురాయి బ్లాకులు.. 12 చిన్న ఖనిజాలు
ప్రభుత్వ ఆమోదమే తరువాయి
మరో 16 బ్లాకుల అనుమతులకూ ప్రయత్నాలు 
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో మేజర్, మైనర్‌ మినరల్‌ బ్లాకులను వేలం పద్ధతిలో కేటాయించేందుకు గనులశాఖ సిద్ధమైంది. ఖనిజాల వారీగా ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించింది. ఇందులో మూడు సున్నపురాయి (లైమ్‌స్టోన్‌) బ్లాకులు కాగా, మరో 12 చిన్నతరహా ఖనిజాలు (మైనర్‌ మినరల్స్‌). ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం రాగానే వేలం ప్రక్రియను ప్రారంభించాలని గనుల శాఖ భావిస్తోంది. వేలంలో అర్హత సాధించిన వారికి ఆయా గనుల్ని 20 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నట్లు సమాచారం.

ముందస్తుగా పర్యావరణ అనుమతులు

సాధారణంగా మైనింగ్‌ లీజు పొందిన తర్వాత పర్యావరణ అనుమతులు, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అనుమతులు తీసుకున్నాకే ఖనిజాల తవ్వకాలకు ఆమోదం లభిస్తుంది. ఈ ప్రక్రియలో లీజుదారులకు వ్యయప్రయాసలు లేకుండా వేలం వేసే బ్లాకులకు పర్యావరణ, పీసీబీ అనుమతులను గనులశాఖే తీసుకుంది. పాత విధానంలో.. ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికి గనుల్ని కేటాయించేవారు. వేలం పద్ధతిలో ఎవరు ఎక్కువ మొత్తం కోట్‌ చేస్తే వారికి లీజు లభిస్తుంది. దీనివల్ల పోటీ పెరిగి.. గనులశాఖకు అధిక ఆదాయం రానుంది.

2,681 మైనింగ్‌ లీజులు

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు అన్ని రకాల ఖనిజాలకు కలిపి 2,681 మైనింగ్‌ లీజులను గనులశాఖ జారీ చేసింది. వీటి మొత్తం విస్తీర్ణం 79,751 హెక్టార్లు. ఇందులో ఇప్పుడు ఖనిజాల తవ్వకాలు జరుగుతున్న వాటి సంఖ్య 1798. బొగ్గు, సున్నపురాయి, ముడి ఇనుము వంటి ఆరు రకాల పెద్ద ఖనిజాలకు ఇప్పటివరకు 122 లీజులు మంజూరు చేయగా, వీటిలో 87 చోట్ల ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. తాజాగా మూడు సున్నపురాయి బ్లాకులు, 12 చిన్న ఖనిజాల గనులను వేలానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవికాక.. రాష్ట్రవ్యాప్తంగా 16 బ్లాకులకు పర్యావరణ, పీసీబీ అనుమతుల కోసం గనులశాఖ దరఖాస్తు చేసింది. అవి రాగానే వాటినీ వేలం వేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని