CP Radhakrishnan: రైతులకు ఆవిష్కరణల ఫలాలందాలి

వ్యవసాయ సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు ఈ రంగ పట్టభద్రులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు సన్నద్ధం కావాలని.. పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా అన్నదాతలకు ఆధునిక వ్యవసాయ ఫలాలు అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ కోరారు.

Published : 11 Jun 2024 04:29 IST

వ్యవసాయ పట్టభద్రులపై గురుతర బాధ్యత
వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆరో స్నాతకోత్సవంలో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌

ఆరు బంగారు పతకాల చొప్పున సాధించిన బజ్జూరి దివ్య, వెలిచాల సాయిప్రత్యూషలకు పట్టాలు ప్రదానం చేస్తున్న గవర్నర్‌ రాధాకృష్ణన్‌. చిత్రంలో ఎస్‌బీఐ ఎండీ శ్రీనివాసులు శెట్టి, వీసీ రఘునందన్‌రావు  

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు ఈ రంగ పట్టభద్రులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు సన్నద్ధం కావాలని.. పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా అన్నదాతలకు ఆధునిక వ్యవసాయ ఫలాలు అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ కోరారు. దేశంలో మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు తగ్గాయని, ఆయన ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన జూన్‌ 9వ తేదీ చరిత్రాత్మక రోజు అని చెప్పారు. సోమవారం రాజేంద్రనగర్‌లో జరిగిన ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆరో స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘అత్యధిక జనాభా కలిగిన భారతదేశం ఆహార ఉత్పత్తిలోనూ అగ్రగామిగా ఉంది. దేశంలో ఏటేటా వ్యవసాయోత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో పలు దేశాల్లో ఆహార కొరత ఏర్పడినా, భారత్‌లో ఆ సమస్య రాలేదు. ఇతర దేశాల్లో ఆహార ధాన్యాల సాగు పద్ధతులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాలి. పరిశోధన, ప్రయోగ ఫలితాలు అన్నదాతలకు చేరువ చేయాలి’’ అని రాధాకృష్ణన్‌ అన్నారు. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన తాను ఈ వ్యవసాయ కళాశాలలోనే చదివి ఉన్నత స్థానంలో ఉన్నందుకు గర్విస్తున్నానన్నారు. విశ్వవిద్యాలయ వీసీ రఘునందన్‌రావు వర్సిటీ ప్రగతిని వివరించారు.

బంగారు పతకాల ప్రదానం

స్నాతకోత్సవంలో 11 మంది పీజీ విద్యార్థులకు 12 బంగారు పతకాలు, 8 మంది డిగ్రీ పట్టభద్రులకు 19 బంగారు పతకాలను గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ అందించారు. డిగ్రీ విద్యార్థులు బజ్జూరి దివ్య, వెలిచాల సాయిప్రత్యూషలు చెరో ఆరు బంగారు పతకాలను పొందగా వారిని గవర్నర్‌ ప్రత్యేకంగా అభినందించారు. బంగారు పతకాలు పొందిన వారిలో మహిళలే ఎక్కువగా ఉండడంపైనా ఆయన హర్షం వ్యక్తం చేశారు. 2021 తర్వాత స్నాతకోత్సవం జరగ్గా పీహెచ్‌డీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన 165 మందికి, డిగ్రీ చేసిన 587 మందికి పట్టాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ రఘురామిరెడ్డి, వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.గోపి, విశ్వవిద్యాలయ సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని