Telangana State Song: రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ గీతం 2.30 నిమిషాల నిడివితో ఒకటి.. 13.30 నిమిషాల నిడివితో మరోటి రెండు వర్షన్లుగా ఉంటుంది.

Updated : 31 May 2024 05:47 IST

యథాతథంగా ఆమోదించిన ప్రభుత్వం  
2న జాతికి అంకితం చేస్తాం  
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తెజస నేతలతో భేటీ
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్ర గీతంపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దీపా దాస్‌మున్షీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు

ఉద్యమకాలంలో అన్ని వర్గాల ప్రజలను ఉర్రూతలూగించిన, తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా, అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా నిర్ణయించాం. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ ఇరవై ఏళ్ల క్రితం రాసిన గీతాన్ని యథాతథంగా అమోదించాం.

-సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ గీతం 2.30 నిమిషాల నిడివితో ఒకటి.. 13.30 నిమిషాల నిడివితో మరోటి రెండు వర్షన్లుగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలోని మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గీతం రూపొందించారు. రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మంత్రులు, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తెజస నేతలతో పాటు తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు ఎంపీలుగా ఉన్నవారు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో సమావేశమై.. రాష్ట్ర గీతంపై చర్చించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన బృందం ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపించింది. గీతం గురించి అందెశ్రీ వివరించారు.‘‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్‌ 2 నాటికి పదేళ్లు పూర్తవుతాయి. దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ వేడుకల సందర్భంగా ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని జాతికి అంకితం చేస్తాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్‌ను టీజీగా మార్చినట్లు తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లతో పాటు ప్రభుత్వ సంస్థల పేర్లలో సంక్షిప్త నామాన్ని టీజీగా మార్చామన్నారు. క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించినట్లు స్పష్టం చేశారు.

సమావేశంలో శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, సీనియర్‌ నేత కె.జానారెడ్డి, తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర నాయకులు పాల్గొన్నారు. ‘జయ జయహే తెలంగాణ’ను ప్రభుత్వం రాష్ట్ర అధికార గీతంగా ఆమోదించడంపై కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం తెజస అధ్యక్షుడు కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ- తాము కోరుకున్న రాష్ట్ర గీతం, చిహ్నాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తోందని అన్నారు. ‘తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో తొలిసారిగా భాగస్వామ్యం అవుతున్నాం. గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ఆహ్వానం అందలేదు. జయ జయహే తెలంగాణ కొత్తగా రాసిన పాట కాదు. రాసింది ఎవరనేదే ముఖ్యం.. పాడింది ఎవరన్నది కాదు. చిహ్నంపై గత ప్రభుత్వం చర్చ జరిపి ఉంటే బాగుండేది. దానిపై అభ్యంతరాలున్నా ఏమీ చేయలేని పరిస్థితులు అప్పుడున్నాయి. కొత్త లోగోలోనూ కట్టడాలు ఉంటాయని అనుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు.


ఆవిర్భావ వేడుకలకు రండి

చుక్కా రామయ్యను ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి 

చుక్కా రామయ్యను శాలువాతో సన్మానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో మహేశ్‌కుమార్‌గౌడ్, మోత రోహిత్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని విద్యావేత్త చుక్కా రామయ్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌ విద్యానగర్‌ పరిధి విజ్ఞాన్‌పురి కాలనీలోని చుక్కా రామయ్య నివాసానికి సీఎం వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలకు తప్పకుండా హాజరు కావాలని కోరారు. అనంతరం రామయ్యను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, యువజన కాంగ్రెస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు మోత రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని