Land Market Value: భూముల ధరలపై అధ్యయనం

భూముల మార్కెట్‌ విలువలను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా దస్త్రాలు కదుపుతోంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ధరలున్నాయి, ఏ మేరకు పెంచడానికి వీలుందనే దానిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది.

Updated : 12 Jun 2024 07:07 IST

మార్కెట్‌ విలువ పెంపునకు సన్నాహాలు
కసరత్తు ప్రారంభించిన సబ్‌రిజిస్ట్రార్లు
ఈనాడు - హైదరాబాద్‌

భూముల మార్కెట్‌ విలువలను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా దస్త్రాలు కదుపుతోంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ధరలున్నాయి, ఏ మేరకు పెంచడానికి వీలుందనే దానిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు చేపట్టాలంటూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ మంగళవారం స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ అమలు చేస్తున్న భూముల మార్కెట్‌ ధరలకు, వాస్తవంగా చలామణీలో ఉన్న ధరలకు మధ్య వ్యత్యాసాన్ని క్షేత్రస్థాయి అధికారులు అధ్యయనం చేయనున్నారు. తెలంగాణ భూముల సవరణ మార్గదర్శకాలు-1998లోని నిబంధనల ప్రకారం సెంట్రల్‌ వాల్యుయేషన్‌ అడ్వైజరీ కమిటీ సూచించిన మేరకు కొత్త విలువలను ఖరారు చేయనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా, మండల స్థాయిలో సబ్‌ రిజిస్ట్రార్‌ నేతృత్వంలో ఈ కమిటీలు భూముల విలువలపై తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయనున్నాయి. దీనిపై ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. 

వ్యవసాయ భూములపై దృష్టి 

రాష్ట్రంలో వ్యవసాయ భూముల వాస్తవ విలువకు, ప్రభుత్వం అమలు చేసే మార్కెట్‌ విలువకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 2021, 2022లో మార్కెట్‌ విలువ పెంపు సందర్భంగా వ్యవసాయ భూముల ఎకరం కనిష్ఠ ధర రూ.75 వేలుగా నిర్ధరించారు. తక్కువ ధరలున్న చోట 50 శాతం, మధ్య స్థాయి ధరలున్నచోట 40 శాతం, ఎక్కువగా ఉన్న చోట 30 శాతం మేరకు పెంచారు. ఈసారి వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువను పెంచేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  

  • ఖాళీ స్థలాలకు గతంలో చదరపు గజం రూ.100 ఉన్న చోట రూ.200కు పెంచారు. ధరలు చాలా తక్కువగా ఉన్న చోట 50 శాతం, మధ్య స్థాయిలో ఉన్న చోట 40 శాతం, ధరలు ఎక్కువగా ఉన్న చోట 30 శాతం మేరకు పెంచారు. హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో స్థలాల వాస్తవ ధరలు భారీగా ఉండి, మార్కెట్‌ విలువ చాలా తక్కువగా ఉన్నచోట పెంపు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. 
  • అపార్టుమెంట్ల విలువను గతంలో 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచారు. ఈసారి పెంపు పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని