Urban Ponds: అర్బన్‌ చెరువులకు జల జీవం!

రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతున్నాయి. మురుగు, కాలుష్యం, ప్రమాదకర రసాయనాల కాసారాలుగా తయారయ్యాయి.

Published : 27 May 2024 05:34 IST

నీటిపారుదల, పురపాలక, రెవెన్యూ శాఖలతో కమిటీ
నెల రోజుల్లో సమగ్ర సర్వే చేయాలని నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్‌

కాలుష్య కాసారంగా మారిన హైదరాబాద్‌ మీర్‌పేటలోని చెరువు

రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతున్నాయి. మురుగు, కాలుష్యం, ప్రమాదకర రసాయనాల కాసారాలుగా తయారయ్యాయి. గతంలో నీటి వినియోగానికి ఉపయోగపడిన చెరువులు ఇప్పుడు చాలా ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థలో భాగంగా మారాయి. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలాలను కాపాడుకునేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు పట్టణ చెరువుల(అర్బన్‌ లేక్స్‌) పునరుద్ధరణ బాధ్యతను పురపాలక శాఖకు అప్పగించింది. చెరువుల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థలు, వివిధ రంగాల నిపుణులు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్‌ కమిషనర్లతో పురపాలక శాఖ ఇటీవల కార్యశాల నిర్వహించింది. అందులో దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలపై విస్తృతంగా చర్చ జరిగింది. అనంతరం నీటిపారుదల, పురపాలక, రెవెన్యూ తదితర శాఖలకు చెందిన ఇంజినీర్లు, అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటుచేసి, ముందుకెళ్లాలని నిర్ణయించారు. 

ఏం చేయనున్నారంటే... 

రాష్ట్రంలో 102 నగరాలు, పట్టణాల్లో వెయ్యికి పైగా నీటి వనరులు ఉన్నాయి. వాటిలో 442 చెరువులు.   వీటికి పూర్వ కళ తీసుకొచ్చేందుకు ఐఐటీ, స్వచ్ఛంద సంస్థల నిపుణుల భాగస్వామ్యంతో సమగ్ర సర్వే చేయనున్నారు. నెల రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాల్సిన ఈ బాధ్యతను మున్సిపల్‌ కమిషనర్లకు అప్పగించారు. ప్రతి పురపాలక సంఘంలో ఎన్ని చెరువులున్నాయి? వాటి గరిష్ఠ సామర్థ్యం (ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌-ఎఫ్‌టీఎల్‌) ఎంత? ఆయా చెరువుల బఫర్‌ జోన్‌ ఎంత? ఆక్రమణలు ఉన్నాయా? ప్రస్తుత పరిస్థితి ఏమిటి? చెరువుల్లోకి వ్యర్థజలాలు, కాలుష్య కారకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటికి పూర్వపు శోభ తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన విధానం ఏమిటి? ఎంత వ్యయం అవుతుంది? ఎంతకాలం పడుతుంది? తదితర అంశాలపై సర్వే నిర్వహించాలని పురపాలక శాఖ డైరెక్టర్‌ డి.దివ్య మార్గదర్శకాలను జారీ చేశారు. జూన్‌ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తిచేసి ప్రతి చెరువు స్థితిగతులపై ప్రత్యేక నివేదికను తయారు చేస్తామని ఆమె ‘ఈనాడు’కు తెలిపారు. ఆ తర్వాత అమలు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 

శుద్ధి చేశాకే నీటి మళ్లింపు 

పట్టణాల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి, కాలుష్య జలాలను శుద్ధి చేసిన మీదటే చెరువుల్లోకి నీటిని మళ్లించాలని నిర్ణయించారు. ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం ద్వారా తటాకాలకు తిరిగి జీవం పోయాలనేది వారి ఆలోచన. చెరువులను శుద్ధమైన నీటితో నింపితే వివిధ రకాల పక్షులను ఆకర్షించవచ్చని, స్థానిక ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించవచ్చని అంటున్నారు. చెరువుల పరిరక్షణకు పట్టణాల్లో ఇప్పటికే ఉన్న లేక్‌ కమిటీలను మరింత చైతన్యం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 

మురుగు కమ్మేస్తోంది 

రాష్ట్రంలో 64,055 జల వనరులు ఉన్నాయి. వాటిలో 12,323 చెరువులు, కుంటలు పూర్తిగా పనికిరానంతగా మారాయి. ఇవి మురుగునీటి నిల్వకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. వీటిలో 17 జలాశయాలు, 2,135 చెరువులను కాలుష్య జలాలు పూర్తిగా కమ్మేశాయి. ఈ సమస్య పట్టణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంది. 


కబ్జాలతో కనుమరుగు 

కేంద్ర జలశక్తి శాఖ గతేడాది నిర్వహించిన ఒక అధ్యయనం రాష్ట్రంలో 3,032 జలవనరులు ఆక్రమణకు గురైనట్లు తేల్చింది. వాటిలో 50.8% కుంటలు, 49.2% చెరువులు ఉన్నాయంది. వీటిలో 10.4% వనరులు దాదాపు కనుమరుగు అయ్యేంతలా కబ్జాలకు గురైనట్లు గుర్తించింది. ఎక్కువ శాతం కబ్జాలున్న చెరువులు, కుంటలన్నీ పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని