Telangana Emblem: అసెంబ్లీలో చర్చించాకే అధికార చిహ్నంపై నిర్ణయం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా విస్తృతంగా చర్చలు జరపాల్సి ఉందని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.

Published : 31 May 2024 05:39 IST

ఈనాడు హైదరాబాద్‌: తెలంగాణ అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా విస్తృతంగా చర్చలు జరపాల్సి ఉందని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్‌ 2న రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనున్నారు. సీఎం సూచన మేరకు చిత్రకారుడు రుద్ర రాజేశం అధికార చిహ్నంపై కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఆయనతో చర్చించారు. సీపీఐ, సీపీఎం నేతలతోపాటు కోదండరాం, తెలంగాణ జేఏసీ నేతలు పరిశీలించారు. కొత్త చిహ్నంలో రాచరిక గుర్తులు లేకుండా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా ప్రచారంలో ఉంది. కాకతీయ తోరణం, చార్మినార్‌లు కొత్త చిహ్నంలో లేకుండా రూపొందిస్తున్నారనే ప్రచారం జరిగింది. గురువారం సెక్రటేరియట్‌లో మంత్రులు, వివిధ పార్టీల నాయకులు తదితరులతో సమావేశమైనప్పుడు కూడా అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై అనేక సూచనలు వచ్చాయని, దీనిపై ఇంకా విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకొంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందినట్లు ఆయన వెల్లడించారు. నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించి తుది రూపమేమీ ఇంకా ఖరారు కాలేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం జరగలేదని, నమూనాలు తయారు చేస్తున్నారన్నారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠ ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని సీఎం వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని