Anganwadi centres: తొలి దశలో 15 వేల ‘అంగన్‌వాడీ’ల ఉన్నతీకరణ!

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో కొనసాగుతున్న దాదాపు 15 వేల అంగన్‌వాడీ కేంద్రాలను తొలిదశలో ఉన్నతీకరించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్య (ప్రీప్రైమరీ) పాఠశాలలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 23 May 2024 05:41 IST

పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలుగా కేంద్రాలు
భవనాలన్నింటికీ ఒకే రంగు, ఒకే డిజైన్‌
కార్యాచరణ రూపొందించిన శిశు సంక్షేమశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో కొనసాగుతున్న దాదాపు 15 వేల అంగన్‌వాడీ కేంద్రాలను తొలిదశలో ఉన్నతీకరించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్య (ప్రీప్రైమరీ) పాఠశాలలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యాసంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కార్యాచరణను రూపొందించింది. మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లోనే చిన్నారులకు అక్షరాలు, పదాలను నేర్పించడం ప్రారంభిస్తే.. పాఠశాలల్లో చదవడం, రాయడం లాంటి ఇబ్బందులను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తూ వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు అంగన్‌వాడీ కేంద్రాల ఉన్నతీకరణ వివరాలను మంత్రికి వివరించారు.

అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ..

అంగన్‌వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యాబోధనపై శిశు సంక్షేమ శాఖ శిక్షణను ప్రారంభించింది. జిల్లాకు 10 మంది చొప్పున 330 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటికే 165 మందికి పూర్తయింది. మరో 105 మంది శిక్షణలో ఉన్నారు. మూడో దశలో మిగిలిన 60 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరంతా జిల్లాల్లోని మిగిలిన టీచర్లకు శిక్షణ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాలను ఆగస్టులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బాలల విద్యపై ఇప్పటికే పనిచేస్తున్న పలు సంఘాలు, ఎన్జీవోలతో కూడిన కమిటీ.. సిలబస్, ప్రత్యేక మాడ్యూళ్లను ఖరారు చేసింది. కొత్త సిలబస్‌ ఆధారంగా పుస్తకాలను కూడా ముద్రిస్తోంది.

వస్తువులు, పుస్తకాల కోసం రూ.30 కోట్లు

పూర్వ ప్రాథమిక విద్యాబోధనలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో కుర్చీలు, ఆట, పాటల వస్తువులు, పుస్తకాల కోసం ప్రభుత్వం రూ.30 కోట్ల వరకు ఖర్చుచేయనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదైన మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు ప్రత్యేక యూనిఫాం ఇవ్వనుంది. ఇందుకోసం డిజైన్లను పరిశీలిస్తోంది. అంగన్‌వాడీ భవనాలన్నీ ఒకే రంగు, ఒకే డిజైన్‌తో ఉండేలా ప్రణాళికలు తయారు చేస్తోంది. పిల్లలను ఆకట్టుకునేలా భవనాలకు పెయింటింగ్‌ వేస్తూ గర్భిణులు, బాలింతలకు సూచనలు ఇచ్చేలా వివరాలను పొందుపరచనుంది. కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం.. శిశు సంక్షేమ శాఖ ద్వారా మొబైల్‌ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుపైనా అధ్యయనం చేయిస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని