Land Rates: గ్రామీణంలో ఒకలా.. పట్టణాల్లో మరోలా

రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువ పెంపు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏ ప్రాంతంలో ఏ ధర ఉండాలనే అంశంపై స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రంలో అమలులో ఉన్న ధరల సమాచారం సేకరిస్తోంది.

Updated : 23 May 2024 06:09 IST

భూముల మార్కెట్‌ విలువ పెంపుపై రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు
సబ్‌ రిజిస్ట్రార్ల నుంచి సమాచారం సేకరణ
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువ పెంపు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏ ప్రాంతంలో ఏ ధర ఉండాలనే అంశంపై స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రంలో అమలులో ఉన్న ధరల సమాచారం సేకరిస్తోంది. భూముల బహిరంగ ధరలకు, ప్రభుత్వ మార్కెట్‌ విలువకు భారీగా అంతరం ఉందని సర్కారు గుర్తించింది. గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్, అర్బన్‌ ప్రాంతాల్లో ధరల్లో చాలా వ్యత్యాసం ఉందని, దీనివల్ల ప్రభుత్వానికి మార్కెట్‌ ఫీజు చాలా తక్కువగా వస్తోందని అంచనా వేసింది. భూముల మార్కెట్‌ విలువలను సవరించాలన్న నిర్ణయం వెనుక ఇదొక కారణం కాగా.. రాబడి పెంపు మరో కారణమని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం చేపట్టే పెంపు.. గ్రామీణ ప్రాంతాల్లో ఒకలా, పట్టణ, నగర ప్రాంతాల్లో మరో రకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూముల బహిరంగ ధరలు భారీగా ఉండే ప్రాంతాలపై అధికారులు నిశిత దృష్టి సారిస్తున్నారు. 

ఫాం ల్యాండ్స్‌ విక్రయాలపై దృష్టి..

స్థలాల కన్నా వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. నెలకు 37 వేల నుంచి 40 వేల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ శివారు జిల్లాల్లో ఫాం ల్యాండ్స్‌ విక్రయాలు భారీగా పెరిగాయి. లేఅవుట్లు లేకుండానే గుంట, రెండు గుంటల చొప్పున ఫాం ల్యాండ్స్‌ విక్రయిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రాబడి పడిపోతోందన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. భవిష్యత్తులో నివాస స్థలంగా మార్చుకోవాలనుకునేవారు ఫాం ల్యాండ్స్‌ కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు, విక్రయదారులు లేఅవుట్‌ లేకుండా, వ్యవసాయేతర భూమిగా మార్పిడి పన్ను(నాలా) చెల్లించకుండా విక్రయిస్తున్నారు. ఇలాంటి లావాదేవీల నుంచి రాబడి పెంచుకోవాలన్న ఆలోచనలో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నట్లు తెలిసింది. మార్కెట్‌ జోరు కొనసాగుతున్న, మైదాన ప్రాంతాల్లో వ్యవసాయ భూముల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌తో పాటు మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో బహిరంగ ధరల్లో పది శాతం కూడా ప్రభుత్వ మార్కెట్‌ విలువ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యత్యాసం పెద్దగా లేనట్లు అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి పట్టణ, నగరప్రాంతాల్లో మార్కెట్‌ విలువను భారీగా పెంచే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి.


గ్రామం యూనిట్‌గా..

ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న భూముల మార్కెట్‌ విలువ సమాచారాన్ని స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ సేకరించింది. 143 సబ్‌ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న మార్కెట్‌ విలువ సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయానికి సబ్‌ రిజిస్ట్రార్లు అందజేశారు. రాష్ట్రంలో గ్రామం యూనిట్‌గా మార్కెట్‌ విలువలను అంచనా వేస్తున్నారు. దీని ప్రకారమే ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అత్యధికంగా ఫీజు వసూలవుతున్న ప్రాంతాలు ఎక్కడున్నాయి? దస్తావేజుల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటున్నాయి? స్థిరాస్తి, భూముల లావాదేవీలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయనే సమాచారం సేకరిస్తున్నారు. రెవెన్యూశాఖ నుంచి కూడా వ్యవసాయ భూముల ధరల సమాచారాన్ని రిజిస్ట్రేషన్ల శాఖ సేకరించినట్లు తెలిసింది. గ్రామం యూనిట్‌గా మార్కెట్‌ విలువ పెంపు ఉండొచ్చని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు