Gurukula Postings: కోడ్‌ ముగిసిన వెంటనే పోస్టింగులు

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలకు కొత్త ఉపాధ్యాయులు, లెక్చరర్లు రానున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల వారీగా ఎంపికైన వారికి పోస్టింగులు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Updated : 27 May 2024 05:49 IST

కార్యాచరణ సిద్ధం చేస్తున్న గురుకుల సొసైటీలు

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలకు కొత్త ఉపాధ్యాయులు, లెక్చరర్లు రానున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల వారీగా ఎంపికైన వారికి పోస్టింగులు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా పూర్వ మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వచ్చే అభ్యర్థుల ఫలితాలు ప్రకటించలేదు. కోడ్‌ ముగిసిన వెంటనే వాటిని వెంటనే ప్రకటించేందుకు బోర్డు సమాయత్తమైంది. గురుకులాల్లో మొత్తం 9,210 పోస్టుల ఫలితాలన్నీ వెల్లడించిన తరువాత ఆయా సొసైటీల వారీగా నియామకాలు మొదలవుతాయి. పూర్తి ఫలితాలు ప్రకటించకుండా ప్రస్తుతం నియామక పత్రాలు తీసుకున్నవారికి పోస్టింగులు ఇస్తే సీనియారిటీ, ఇతర సాంకేతిక సమస్యలు వస్తాయని భావిస్తున్న సొసైటీలు... జులై రెండో వారంలోగా ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాయి. 

వేగంగా ఫలితాల వెల్లడి...

రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 9,210 పోస్టులకు గతేడాది ఆగస్టులో పరీక్షలు జరిగితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల్లో ఎన్నికల కోడ్‌ పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు చెందిన వారు మినహా మిగతా అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. గురుకుల పోస్టుల్లో అత్యధికంగా 4,006 టీజీటీ పోస్టులు ఉంటే.. ఆ తరువాత పీజీటీ, జూనియర్, డిగ్రీ లెక్చరర్‌ పోస్టులున్నాయి. వీటికి కొత్త ప్రభుత్వం వేగంగా ఫలితాలు ప్రకటించడంతో పాటు, పత్రాలూ మంజూరు చేసింది. దీంతో వీరి నియామక ప్రక్రియ పూర్తిచేసేందుకు సొసైటీలు కసరత్తు ప్రారంభించాయి. కొత్తగా ఎంపికైన వారికి పోస్టింగులు ఇచ్చేలోగా అప్పటికే పనిచేస్తున్న టీజీటీ, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్లకు పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే బీసీ గురుకుల సొసైటీలో పదోన్నతుల ప్రక్రియ దాదాపు ముగియగా... ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల్లో కూడా పూర్తయిన వెంటనే నియామకాలు జరుగుతాయి. 


కౌన్సెలింగ్‌కు సాఫ్ట్‌వేర్‌ సిద్ధం..

డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల సంఖ్య తక్కువగా.. పీజీటీ, టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. గురుకులాల్లో పోస్టులు జోన్, మల్టీజోన్‌ పరిధిలోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు నేరుగా పోస్టింగులు ఇవ్వడమా? లేదా కౌన్సెలింగ్‌ ద్వారా ఆప్షన్లు ఇవ్వడమా? అనే విషయమై సమాలోచనలు జరుగుతున్నాయి. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారా పోస్టింగులు ఇచ్చేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను సొసైటీలు సిద్ధం చేస్తున్నాయి. ముందుగా గురుకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మరోసారి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసిన తరువాతే సొసైటీలు నియామకాలు జరుపుతాయి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని