Telangana: నియమావళి ముగిసింది.. నియామకాలే తరువాయి..

వైద్య, ఆరోగ్యశాఖలో ఐదు వేలకు పైగా పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ప్రధానంగా వైద్యవిద్య, వైద్యవిధానపరిషత్, ప్రజారోగ్యశాఖలో కీలకమైన పోస్టులను భర్తీ చేయనున్నారు.

Published : 07 Jun 2024 06:14 IST

వైద్య, ఆరోగ్యశాఖలో 5348 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
సమీక్షించిన మంత్రి, ఉన్నతాధికారులు 
అత్యధికంగా వైద్యులు, స్టాఫ్‌నర్సుల పోస్టులు

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్యశాఖలో ఐదు వేలకు పైగా పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ప్రధానంగా వైద్యవిద్య, వైద్యవిధానపరిషత్, ప్రజారోగ్యశాఖలో కీలకమైన పోస్టులను భర్తీ చేయనున్నారు. రెండున్నర నెలల క్రితమే రాష్ట్ర ఆర్థికశాఖ ఈ పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు కోడ్‌ ముగియడంతో ఉద్యోగాల భర్తీ దిశగా వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆ శాఖ మంత్రితో ఉన్నతాధికారులు చర్చించారు. ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా పోస్టులు భర్తీ కానున్నాయి. ఉద్యోగాల భర్తీకి అవసరమైన ప్రక్రియను వెంటనే చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ విభాగాలను ప్రభుత్వం ఆదేశించింది. కొత్త వైద్యకళాశాలలు రావడంతో పాటు వైద్య, ఆరోగ్య సేవలు జాప్యం లేకుండా పూర్తిస్థాయిలో అందించాలని జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) నిబంధనలు కఠినతరం చేయడంతో ఎంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తయితే అంతమేర వెసులుబాటు వస్తుందని వైద్యవిద్య డైరెక్టరేట్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఆర్థికశాఖ అనుమతించిన 5348 పోస్టులు.. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్, వైద్య విధాన పరిషత్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ), ఆయుష్‌తో పాటు ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి ఉన్నాయి. ఒక్క వైద్యవిద్య డైరెక్టరేట్‌ పరిధిలోనే మొత్తం 3235 పోస్టులున్నాయి. 

భారీగా వైద్యుల పోస్టులు ఖాళీ

  • ఇప్పటికే బోధనాసుపత్రులు, వైద్య విధానపరిషత్‌ ఆసుపత్రులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. డాక్టర్ల నియామకం జరుగుతున్నా ఖాళీలు కూడా అదే సంఖ్యలో పెరుగుతున్నాయి. భర్తీకి అనుమతించిన వాటిలో 1610 వైద్యుల పోస్టులున్నాయి. నియామక ప్రక్రియను త్వరగా పూర్తిచేసి వైద్యులను అందుబాటులోకి తీసుకురావాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 
  • బోధనాసుపత్రుల్లో బోధన సిబ్బంది సమస్య పరిష్కారానికి తాత్కాలికంగా నియామకాలను అనుమతించినా అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తేనే సమస్య పరిష్కారమవుతుందని వైద్య, ఆరోగ్యశాఖ విభాగాలు పేర్కొంటున్నాయి. గతంలో కూడా అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేసినా పోస్టులు మిగిలిపోయాయి. దీంతో ఈసారి విధించే నిబంధనలపై కూడా వైద్యవిద్య డైరెక్టరేట్‌ సమీక్షిస్తోంది. నియామక ప్రక్రియలో 596 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులున్నాయి. వీటిలో ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో కీలక విభాగాల్లో 40 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించనున్నారు. 
  • వైద్య విధానపరిషత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల కొరత తీవ్రంగా ఉంది. భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటమే కాకుండా కొత్త పోస్టుల అవసరం పెరిగింది. తాజాగా 1014 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకం చేపట్టనున్నారు. 
  • కొన్ని నెలల క్రితమే సుమారు ఏడువేల మందికి పైగా స్టాఫ్‌నర్సుల నియామక ప్రక్రియ పూర్తికాగా.. తాజాగా మరో 1988 మంది స్టాఫ్‌నర్సుల రిక్రూట్‌మెంట్‌ జరగనుంది. అనుమతించిన పోస్టుల్లో ల్యాబ్‌ టెక్నీషియన్ల పోస్టులు 764 దాకా భర్తీ కానున్నాయి. ఫార్మసిస్టులు 191 మంది, ఏఎన్‌ఎంలు 85 మంది నియమితులు కానున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని