Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యక్తిగత గోప్యతలోకి చొరబాటే..

గత భారాస ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లనూ ట్యాప్‌ చేయడంపై మంగళవారం హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 05 Jun 2024 04:35 IST

తీవ్రంగా పరిగణించాల్సిన అంశమన్న హైకోర్టు
కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
విచారణ జులై 3కు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: గత భారాస ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లనూ ట్యాప్‌ చేయడంపై మంగళవారం హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది సాధారణ అంశం కాదని వ్యక్తిగత గోప్యతలోకి చొరబాటేనని పేర్కొంది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అంతేకాకుండా జాతీయ భదత్రకు చెందిన అంశంగా పేర్కొంది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. సస్పెండ్‌ అయిన ఎస్‌బీఐ అదనపు ఎస్పీ భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నిఘా విభాగం అదనపు డీజీపీ తదితరులకు నోటీసులు జారీచేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరముందంటూ డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ జి.ప్రవీణ్‌కుమార్‌ను ఉద్దేశించి పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ దీంతో ఏకీభవిస్తూ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఈ దశలో సీనియర్‌ న్యాయవాది, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ ఇది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని, టెలిగ్రాఫ్‌ చట్టం కేంద్రం పరిధిలోనిదన్నారు. పీయూసీఎల్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏర్పాటైన కమిటీ దృష్టికి ఈ అంశం వెళ్లాల్సి ఉందన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ దశలో ఎలాంటి సూచనలు అవసరం లేదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తర్వాత కోర్టుకు సహకరించవచ్చని పేర్కొంది. సుమోటోగా తీసుకున్న అంశంపై ఒకే రోజులో ఉత్తర్వులు ఇవ్వలేమంది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని