TG Inter Board: మరోసారి రీవెరిఫికేషన్‌కు అనుమతివ్వండి

ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకనంలో నిర్లక్ష్యం కారణంగా నష్టపోతున్న విద్యార్థులకు న్యాయం చేసేందుకు రీ రీవెరిఫికేషన్‌కు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటర్‌బోర్డు కోరనుంది.

Updated : 26 May 2024 09:49 IST

ప్రభుత్వాన్ని కోరనున్న ఇంటర్‌బోర్డు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకనంలో నిర్లక్ష్యం కారణంగా నష్టపోతున్న విద్యార్థులకు న్యాయం చేసేందుకు రీ రీవెరిఫికేషన్‌కు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటర్‌బోర్డు కోరనుంది. గతంలో ఇలాంటి పరిస్థితి తలెత్తగా.. ప్రభుత్వ అనుమతితో రీ రీవెరిఫికేషన్‌ చేసి కొంతమందికి న్యాయంగా రావాల్సిన మార్కులు ఇచ్చామని పలువురు పేర్కొంటున్నారు. ఈసారి కూడా అనేకమందికి సమస్యలు వచ్చినందున ప్రభుత్వ అనుమతి కోరనున్నామని ఇంటర్‌బోర్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ‘దిద్దుకోలేని నిర్లక్ష్యం’ శీర్షికన శనివారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఎంఈసీ విద్యార్థి సంహితకు 97కు బదులు 77 మార్కులు వేసిన అధ్యాపకుడిని శనివారం ఇంటర్‌బోర్డుకు పిలిపించారు. ఆయన కామారెడ్డి జిల్లాలోని ఓ సంక్షేమ గురుకులంలో అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు రెండేళ్లు మూల్యాంకనంలో పాల్గొన్నారు. ఎందుకు 97 మార్కులు వేసి.. దాన్ని కొట్టివేసి 77గా దిద్దారని ఇంటర్‌బోర్డు కంట్రోలర్‌ జయప్రదబాయి ప్రశ్నించగా.. తనకు గుర్తులేదని, ఇప్పుడు మళ్లీ దిద్ది 97 మార్కులు వేస్తానని చెప్పినట్లు సమాచారం. మళ్లీ మూల్యాంకనం చేసే విధానం లేదు కదా? అని అడుగగా ఆ విషయం తనకు తెలియదని, ఇంత పెద్ద సమస్య అవుతుందని తాను అనుకోలేదని చెప్పినట్లు తెలిసింది. అనంతరం ఆయన నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారు. సెలవులో ఉన్న ఇంటర్‌బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఈ నెల 27న విధులకు హాజరుకానున్నారని, సోమవారం ఆమెను కూడా కలిసి వివరణ ఇవ్వాలని జయప్రద బాయి ఆ అధ్యాపకుడిని ఆదేశించినట్లు తెలిసింది. 

పలువురు విద్యార్థుల ఫిర్యాదు 

మరోవైపు తమకు మార్కుల కేటాయింపులో అన్యాయం జరిగిందని బోర్డు వద్దకు శుక్రవారం 13 మంది విద్యార్థులు, శనివారం మధ్యాహ్నం వరకు మరో 10 మంది వచ్చి ఫిర్యాదు చేశారు. ‘ఒక అధ్యాపకుడు విద్యార్థి రాసిన సమాధానాన్ని అడ్డంగా కొట్టివేశారు. మళ్లీ మూడు మార్కులు వేశారు. కొన్ని ప్రశ్నలకు మార్కులు వేయకుండా వదిలి వేస్తున్నారు’ అని ఇంటర్‌బోర్డు అధికారి ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు. ‘పాఠ్యపుస్తకాలు, గైడ్‌లు పట్టుకొని తల్లిదండ్రులు ఇంటర్‌బోర్డుకు వస్తున్నారు. వాటిల్లో ఉన్నది ఉన్నట్లు రాసినా కొన్ని జవాబులకు మార్కులు వేయలేదని చూపిస్తున్నారు. నిజంగా కొందరు విద్యార్థుల జవాబుపత్రాల్లో అలాగే ఉంది’ అని మరో అధికారి పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని