TS News: మంత్రి మండలి సమావేశం వాయిదా

తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు.

Published : 19 May 2024 06:23 IST

 మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సీఎం, మంత్రుల నిరీక్షణ
ఈసీ నుంచి లభించని అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. దీంతో రాత్రి 7 గంటలకు సమావేశం వాయిదా వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్‌ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు, 

జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుండగా.. పునర్విభజన చట్టంలో ఇప్పటివరకు ఏపీ, తెలంగాణల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలను మంత్రిమండలి భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు ఎజెండాను కూడా తయారు చేశారు. అటు సార్వత్రిక ఎన్నికల కోడ్, వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో మంత్రిమండలి సమావేశానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని అభ్యర్థించింది. ఈసీ నుంచి తప్పక అనుమతి వస్తుందనే నమ్మకంతో సీఎం, మంత్రులు సచివాలయానికి వచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు చేరుకున్నారు. ఏ క్షణమైనా అనుమతి వస్తుందని.. ఆ  వెంటనే సమావేశం జరపాలని భావించారు. రాత్రి 7 గంటల వరకు వేచి చూసి మంత్రిమండలి సమావేశం వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన ఇతర అంశాలపై చర్చించలేకపోయామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. 

రేపటిలోగా అనుమతి రాకపోతే దిల్లీకి...

ఈసీ నుంచి ఎప్పుడు అనుమతి వస్తే.. అప్పుడే మంత్రిమండలి భేటీ జరపాలని సీఎం నిర్ణయించారు. సోమవారంలోపు ఈసీ స్పందించని పక్షంలో అవసరమైతే మంత్రులతో కలిసి దిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరతామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు