Land Rates: భూముల ధరలపై అధ్యయనం

వ్యవసాయ భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ల ఫీజు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాబడులు పెంచుకునే క్రమంలో సర్కారు రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖపై దృష్టి సారించింది.

Updated : 18 May 2024 08:04 IST

క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్న రిజిస్ట్రేషన్లు - స్టాంపుల శాఖ 
సాగు భూములు.. స్థలాల రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంపునకు కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ల ఫీజు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాబడులు పెంచుకునే క్రమంలో సర్కారు రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖపై దృష్టి సారించింది. ప్రభుత్వ ఖజానాకు కీలకమైన ఆదాయ వనరుల్లో ఒకటి భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే రాబడి. రాష్ట్రంలో 2021 జులై తరువాత ఛార్జీలను సవరించలేదు. 2022లో స్టాంపు డ్యూటీని మాత్రమే సవరించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో భూముల మార్కెట్‌ ధరల పెంపు, రాబడిపై ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రభుత్వం అంచనా వేస్తున్న రాబడిని శాఖ చేరుకోవడం లేదని, ఈ ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించేలా కృష్టి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మార్కెట్‌ పరిస్థితులపై అధ్యయనం చేపట్టాలని ఆదేశించడంతో క్షేత్రస్థాయి పరిశీలనకు ఆ శాఖ సిద్ధమవుతోంది.

77 శాతమే రాబడి రావడంతో...   

2023-24 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా ఖజానాకు రూ.18,500 కోట్ల రాబడి సాధించాలనేది లక్ష్యం. భూ లావాదేవీలతో రూ.14,295 కోట్లు మాత్రమే (77 శాతం) సమకూరాయి. దానిపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మార్కెట్‌లో భూముల ధరలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ఫీజుల పెంపుపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో సాగు, సాగేతర భూములకు ప్రస్తుతం వాస్తవంగా ఉన్న విలువ, ఎంత మేరకు పెంచడానికి వీలున్నదనే విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేయనున్నారు. అపార్టుమెంట్లు, నివాస గృహాలకు సంబంధించి ఇప్పుడు వసూలు చేస్తున్న ధరలు, మార్కెట్లో వాస్తవంగా ఉన్న విలువను కూడా పరిశీలించనున్నారు. వీటన్నింటిపై అధ్యయనం పూర్తి చేసిన తరువాత రిజిస్ట్రేషన్లు- స్టాంపుల శాఖ ఒక ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేయనుంది. స్టాంపు డ్యూటీ సవరణపైనా ప్రభుత్వం దృష్టిసారించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయనున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులు ఇలా 

ఉమ్మడి ఏపీలో 2013లో చివరి సారి ఫీజుల పెంపు జరిగింది. దాని ప్రకారం మార్కెట్‌ విలువపై రిజిస్ట్రేషన్‌ ఫీజు 6 శాతంగా ఉండేది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఫీజులను 2021లో సవరించారు. స్టాంపు డ్యూటీ 5.5 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 0.5, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు 1.5 శాతం కలిపి రిజిస్ట్రేషన్‌ ఫీజు మార్కెట్‌ విలువలో 7.5 శాతంగా ఉంది. వ్యవసాయ భూములకు ఎకరాకు కనీస ధర రూ.75 వేలు, ఖాళీ స్థలాలకు చ.గజం చొప్పున, నివాసాలకు చ.అడుగు చొప్పున కనీస ధర నిర్ణయించి మార్కెట్‌ విలువ పెంచారు. 

రూ.5 వేల కోట్లకు పైగా.. రాబడి అంచనాలు! 

2020-21లో భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5,260 కోట్ల రాబడి లభించింది. 2021 జులైలో మార్కెట్‌ ధరల సవరణతో 2021-22లో రూ.12,370 కోట్లకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాల్లో బహిరంగ మార్కెట్లో భూముల ధరలు రూ.కోట్లలో పలుకుతున్నాయి. ప్రభుత్వ మార్కెట్‌ ధర మాత్రం ఆ స్థాయిలో ఉండటం లేదు. దీంతో పెద్ద ఎత్తున ప్రభుత్వం రాబడి కోల్పోతున్నదన్న చర్చ వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం మార్కెట్‌ విలువ సవరించడం ద్వారా ఖజానాకు రూ.5 వేల కోట్లకు పైగా రాబడి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.


రైతుల రుణమాఫీ.. రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలు..
నేడు పలు కీలక అంశాలపై చర్చించనున్న క్యాబినెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం శనివారం భేటీ కానుంది. చివరగా మార్చి 12న రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశమైంది. శనివారం నాటి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. కోడ్‌ అమల్లో ఉండడంతో మంత్రివర్గ భేటీ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు లేఖ రాసింది. ఆయన దానిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. అనుమతి వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్ర పునర్విభజన జరిగి వచ్చే జూన్‌ 2 నాటికి పదేళ్లు పూర్తవుతుంది. పునర్విభజన చట్టానికి సంబంధించి ఇంకా పెండింగ్‌లో ఉన్నవి, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఆగస్టు 15లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించడంతో.. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చిస్తారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతి, వచ్చే ఖరీఫ్‌ పంటల ప్రణాళిక, రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలు కూడా చర్చకు వస్తాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫార్సులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో సమీక్షించాలని సీఎం నిర్ణయించారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ల పంపిణీ తదితర అంశాలపైనా చర్చించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని