Schools: సెలవులకు టాటా.. ఇక బడిబాట!

రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలలు బుధవారం తెరచుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు 48 రోజుల అనంతరం బడిబాట పట్టనున్నారు.

Updated : 12 Jun 2024 07:06 IST

నేడు పాఠశాలల పునఃప్రారంభం
విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు
తొలిరోజే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేత

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలలు బుధవారం తెరచుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు 48 రోజుల అనంతరం బడిబాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో అవసరమైన మరమ్మతు పనులను దాదాపు పూర్తిచేశారు. తరగతి గదులను అలంకరించి, ప్రవేశ ద్వారాలకు మామిడి తోరణాలు కట్టి పండగ వాతావరణంలో విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలిరోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వాటిని మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా అందించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం కొన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తారని తొలుత సమాచారం అందినప్పటికీ..అనివార్య కారణాల వల్ల వాయిదాపడిందని విద్యాశాఖ వర్గాల సమాచారం. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ‘బడిబాట’ కార్యక్రమం 19వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో త్వరలోనే ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటిస్తారని ఆ వర్గాలు తెలిపాయి.  

స్వచ్ఛ కార్మికులను నియమిస్తేనే...

పాఠశాల విద్యాశాఖ పరిధిలోని బడుల్లో శౌచాలయాలను శుభ్రం చేయడానికి, ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ కార్మికుల(శానిటరీ వర్కర్లు)ను నియమిస్తామని కొద్ది నెలల క్రితమే సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై ఇప్పటివరకు అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. మరోవైపు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. దానిపై కసరత్తు చేసిన అధికారులు కొత్తగా 203 చోట్ల బడులు అవసరమని విద్యాశాఖకు ప్రతిపాదించారు. వాటిని ప్రారంభించేందుకు ఇప్పటివరకు ఆదేశాలు రాలేదు. అయితే త్వరలోనే సీఎం హామీ అమలవుతుందని, సంబంధిత ఉత్తర్వులు వెలువడుతాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు