TGPSC: టీజీపీఎస్సీ ‘కీ’లక నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల ‘కీ’ (సమాధానాల) సమస్యలకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చెక్‌ పెట్టనుంది. ప్రాథమిక కీ వెలువడినప్పటి నుంచి తుది కీ ఖరారయ్యే నాటికి అభ్యర్థుల్లో తలెత్తుతున్న సందేహాలు, గందరగోళ పరిస్థితులను దూరం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.

Updated : 28 May 2024 07:13 IST

నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమిక కీ వెల్లడి
అభ్యర్థుల్లో గందరగోళం నివారణకు కార్యాచరణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల ‘కీ’ (సమాధానాల) సమస్యలకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చెక్‌ పెట్టనుంది. ప్రాథమిక కీ వెలువడినప్పటి నుంచి తుది కీ ఖరారయ్యే నాటికి అభ్యర్థుల్లో తలెత్తుతున్న సందేహాలు, గందరగోళ పరిస్థితులను దూరం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. అభ్యర్థులకు మానసిక ఆందోళనను దూరం చేసేందుకు గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న విధానంలో సంస్కరణలు చేపట్టింది. ఇక నుంచి ప్రాథమిక కీ విడుదల సమయంలోనే సమాధానాల్లో ప్రాథమిక తప్పులను గుర్తించి వాటిని సరిచేస్తూ సరైన సమాధానాలతో కీ ప్రకటించాలని నిర్ణయించింది. తద్వారా పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రాథమిక కీ సమయంలోనే ఎన్ని మార్కులు వస్తాయి? మెరిట్‌ సాధిస్తామా? లేదా.. వంటి అంశాలపై ముందుగానే స్పష్టత రానుంది. భవిష్యత్తులో నిర్వహించే పోటీపరీక్షలన్నింటిలోనూ  ఇదే విధానాన్ని కమిషన్‌ అనుసరించనుంది.

అభ్యర్థుల్లో గందరగోళం..

పోటీపరీక్షలు నిర్వహించిన తరువాత కమిషన్‌ నిబంధనల ప్రకారం తొలుత అభ్యర్థుల ఓఎంఆర్‌ పత్రాలు స్కానింగ్‌ చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత డిజిటల్‌ ఓఎంఆర్‌ పత్రాలను వెబ్‌సైట్లో పొందుపరిచి ప్రాథమిక కీ ప్రకటిస్తారు. ఇంతవరకు అనుసరించిన విధానం ప్రకారం ప్రాథమిక కీ విడుదల చేసేటప్పుడు ప్రశ్నపత్రం రూపొందించిన నిపుణులు చెప్పిన సమాధానాన్ని అందులో పొందుపరిచేవారు. ఆ తరువాత ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి నిర్ణీత గడువులోగా అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించేవారు. ఈ అభ్యంతరాలకు సరైన ఆధారాలు జతచేయాలి. లేకుంటే వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఈ తరహా విధానంతో అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనేవి. ప్రాథమిక కీ నాటికి వస్తున్న మార్కులకు.. తుది కీ నాటికి వస్తున్న మార్కులకు వ్యత్యాసం కనిపిస్తుండేది. కొన్ని సందర్భాల్లో ఒక్క మార్కు తేడాతో ర్యాంకుల్లో చాలా వెనుకబాటు కనిపిస్తోంది. దీంతో మార్కులు తగ్గాయన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంటోంది. గతంలో కొన్ని సందర్భాల్లో న్యాయ వివాదాలు తలెత్తి నియామక ప్రక్రియ ఆలస్యమైంది. గత ఏడాది కమిషన్‌ నిర్వహించిన 8,180 గ్రూప్‌-4 సర్వీసు ఉద్యోగాల పోటీపరీక్షలోనూ ప్రాథమిక కీ నుంచి తుది కీ నాటికి మొత్తం పది ప్రశ్నలు తొలగించారు. ఈ మేరకు పేపర్‌-1లో 7,  పేపర్‌-2లో 3 ప్రశ్నలు ఉన్నాయి. వీటితో పాటు రెండు పేపర్లలో కలిపి 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు జరిగాయి. 5 ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు సరైనవిగా ప్రకటించాల్సి వచ్చింది. రద్దయిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలోనూ తుది కీ వెలువడే నాటికి 8 ప్రశ్నలు తొలగించారు. రెండు ప్రశ్నలకు ఆప్షన్లు మారాయి. ఇదే తరహాలో ప్రతి పోటీపరీక్షలో ప్రశ్నల తొలగింపు, సమాధానాల మార్పు సాధారణంగా జరుగుతోంది. దీంతో అభ్యర్థుల మార్కుల అంచనాలు మారుతున్నాయి. ఈ మేరకు అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు నివారించేందుకు ప్రాథమిక కీ సమయంలో సబ్జెక్టు నిపుణుల అభిప్రాయాన్ని కమిషన్‌ తీసుకుంటోంది. ప్రాథమిక కీ విడుదల చేసేటప్పుడు ఆ అభిప్రాయం మేరకు సరైన సమాధానాలతో వెలువరిస్తుంది. తద్వారా ప్రాథమిక కీపై వెలువడే అభ్యంతరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ప్రాథమిక కీ.. తుది కీ నాటికి పెద్దగా మార్పులు ఉండకపోవడంతో అభ్యర్థులకు వచ్చే మార్కులపై ముందుగానే అవగాహన వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు