Fiscal Deficit: ద్రవ్యలోటు రూ.49 వేల కోట్లు

రాష్ట్ర ద్రవ్యలోటు భారీగా పెరిగింది. 2022-23లో అది రూ.32,119 కోట్లు. తాజాగా 2023-24లో రూ.49,440.92 కోట్లకు చేరింది. ఏడాది వ్యవధిలో రూ.17,321.92 కోట్లు పెరిగింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికలున్నందున అప్పటి ప్రభుత్వం నవంబరు నాటికే భారీగా అప్పులు సేకరించడంతో ద్రవ్యలోటు బాగా విస్తరించింది.

Published : 23 May 2024 05:42 IST

గతేడాది బడ్జెట్‌ ఆదాయ లక్ష్యం రూ.2.59 లక్షల కోట్లు
వచ్చింది రూ.2.18 లక్షల కోట్లు - ఇందులో అప్పులు రూ.49 వేల కోట్లు
లక్ష్యం కంటే 29 శాతం అదనంగా రుణాల సేకరణ 
వ్యయ లక్ష్యం రూ.2.49 లక్షల కోట్లు.. వెచ్చించింది రూ.2.11 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కాగ్‌
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్ర ద్రవ్యలోటు భారీగా పెరిగింది. 2022-23లో అది రూ.32,119 కోట్లు. తాజాగా 2023-24లో రూ.49,440.92 కోట్లకు చేరింది. ఏడాది వ్యవధిలో రూ.17,321.92 కోట్లు పెరిగింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికలున్నందున అప్పటి ప్రభుత్వం నవంబరు నాటికే భారీగా అప్పులు సేకరించడంతో ద్రవ్యలోటు బాగా విస్తరించింది. గతేడాది బడ్జెట్‌లో అప్పుల అంచనా రూ.38,234.94 కోట్లకు అదనంగా మరో రూ.11 వేల కోట్లను ప్రభుత్వం సేకరించింది. మొత్తం అప్పులు రూ.49 వేల కోట్లు దాటాయి. బడ్జెట్‌లో పేర్కొన్న రుణ సేకరణ లక్ష్యంకన్నా 29 శాతం అదనంగా తీసుకోవడం గమనార్హం. అప్పులతో కలిపి రాష్ట్ర ఆదాయాన్ని బడ్జెట్‌లో లక్ష్యంగా ప్రభుత్వం చూపడం ఆనవాయితీ. గతేడాది ఇలా మొత్తం రూ.2.59 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని లక్ష్యంగా పెట్టుకోగా చివరికి రూ.2.18 లక్షల కోట్లే వచ్చింది. వ్యయ లక్ష్యం రూ.2.49 లక్షల కోట్లు కాగా ఖర్చుపెట్టింది రూ.2.11 లక్షల కోట్లు. ఆదాయం అంచనాకన్నా రూ.41 వేల కోట్లు తగ్గగా.. వ్యయం రూ.38 వేల కోట్లు తగ్గింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2023-24)లో తెలంగాణ ఆదాయ, వ్యయాలు, సేకరించిన అప్పులు, జీతభత్యాలు, పింఛన్లు తదితర లెక్కలపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తాజాగా కేంద్రానికి నివేదికను సమర్పించింది. ముఖ్యాంశాలు ఇవీ...

తగ్గిన జీఎస్టీ ఆదాయం

రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీ, మద్యంపై సుంకం, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను(వ్యాట్‌) పద్దు కింద వచ్చేవి కీలకం. జీఎస్టీ కింద రూ.50,942.66 కోట్లు వస్తాయని అంచనా వేయగా రూ.46,500.43 కోట్లు వచ్చాయి.

  • గత నవంబరులో అసెంబ్లీకి ఎన్నికలు జరగడం.. తదుపరి లోక్‌సభ ఎన్నికల హడావిడితో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఆదాయం 32 శాతానికి పైగా తగ్గింది. ఈ పద్దు కింద రూ.18,500 కోట్లు అంచనా వేస్తే రూ.14,295.56 కోట్లు(77.27 శాతం) వచ్చాయి. అంతకుముందు ఏడాది ఏకంగా 91 శాతం ఆదాయం లభించింది. 
  • పెట్రోలు, డీజిల్, మద్యంపై వసూలు చేసే అమ్మకపు పన్ను పద్దు కింద రూ.39,500 కోట్ల అంచనాకు గాను 24.08 శాతం తగ్గి రూ.29,989.55 కోట్లే వచ్చాయి. 
  • మద్యంపై విడిగా వసూలు చేసే ఎక్సైజ్‌ సుంకం ఎక్కువగా వచ్చింది. రూ.19,884.90 కోట్లకు రూ.20,298.89 కోట్లు వసూలయ్యాయి.
  • భూముల అమ్మకాలు, ఔటర్‌ రింగు రోడ్‌ టెండర్లు వంటివాటిపై భారీగా నిధులు సమకూరడంతో పన్నేతర ఆదాయం పద్దు కింద రూ.22,808 కోట్ల లక్ష్యానికి రూ.23,819.50 కోట్లు వచ్చాయి. 
  • కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూ.41,259.17 కోట్లకు గాను 76 శాతానికి పైగా తగ్గి రూ.9,729.91 కోట్లే రావడం వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. దాంతో బడ్జెట్‌ ఆదాయ, వ్యయాల అంచనాలు పట్టాలు తప్పాయి. ద్రవ్యలోటు పెరిగి అంచనాకన్నా 29 శాతం అదనంగా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు ఏడాది గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా రూ.13,179 కోట్లు వచ్చాయి. 

జీతభత్యాలు, పింఛన్లకు రూ.55 వేల కోట్లు...

  • ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లకు వెచ్చించాల్సింది రూ.51,651 కోట్లు అనుకుంటే... ఆ మొత్తం రూ.55,752 కోట్లకు చేరింది. పింఛన్ల భారం లక్ష్యానికన్నా 29% అదనంగాపెరిగింది. 
  • సంక్షేమ పథకాలకు చెల్లించే రాయితీ నిధుల పద్దు లక్ష్యం రూ.12,958.70 కోట్లు కాగా 27.38% తగ్గించి రూ.9,410.51 కోట్లే ఇచ్చారు.
  • గతంలో ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీలు, కిస్తీల కింద రూ.22,407.67 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని భావించగా రూ.23,337.40 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. 
  • నెలవారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ఆదాయం... అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2023 నవంబరులో రూ.9,701 కోట్లు రాగా.... కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రూ.13,703.92 కోట్లు వచ్చాయి. ఆ ఆర్థిక సంవత్సరంలో అదే అత్యధికం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని