TS DOST 2024: కామర్స్‌తోనే ‘దోస్త్‌’

డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) మొదటి విడతలో 76,290 మందికి డిగ్రీ సీట్లు దక్కాయి. వారిలో అత్యధికంగా 28,655(37.56 శాతం) మంది బీకాంలో సీట్లు పొందారు.

Updated : 07 Jun 2024 06:27 IST

37.56 శాతం మంది బీకాం కోర్సులో ప్రవేశం
ఆ తర్వాత బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌ వైపు మొగ్గు
తొలి విడతలో 76,290 మందికి సీట్లు

దోస్త్‌ వివరాలను విడుదల చేస్తున్న కళాశాల విద్యాశాఖ జేడీ యాదగిరి,
దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి
ఉపాధ్యక్షుడు మహమూద్, కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేష్‌

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) మొదటి విడతలో 76,290 మందికి డిగ్రీ సీట్లు దక్కాయి. వారిలో అత్యధికంగా 28,655(37.56 శాతం) మంది బీకాంలో సీట్లు పొందారు. తర్వాత స్థానం ఫిజికల్‌ సైన్స్‌దే. తొలి విడత సీట్లను గురువారం కేటాయించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్, దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘మొత్తం సీట్లు పొందిన వారిలో అమ్మాయిలు 47,867 మంది(62.74 శాతం) ఉండగా, అబ్బాయిలు 28,423 మంది(37.26 శాతం). రాష్ట్రంలోని 155 ప్రభుత్వ, యూనివర్సిటీ కళాశాలల్లో 88,058 సీట్లుండగా...అందులో 34,170 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 731 ప్రైవేట్‌ కళాశాలల్లో 2,96,690 సీట్లకుగాను 42,120 మాత్రమే భర్తీ అయ్యాయి’ అని బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 70 కళాశాలల్లో ఒక్కరూ చేరలేదన్నారు. అత్యధికంగా 99.40 శాతం మార్కులతో దోస్త్‌లో మొదటి ర్యాంకు సాధించిన తమ్మా అలేఖ్య బీఎస్‌సీ జీవశాస్త్రం కోర్సు ఎంచుకుని మహిళా వర్సిటీలో సీటు పొందిందని, రెండో ర్యాంకర్‌ కె.అనిత నిజాం కళాశాలలో బీఎస్‌సీ భౌతికశాస్త్రం, నాలుగో ర్యాంకర్‌ నూకల శివశంకర్‌ సికింద్రాబాద్‌ ఓయూ కళాశాలలో బీఏలో ప్రవేశం పొందినట్టు చెప్పారు. టాప్‌ ర్యాంకర్లలో కొందరు ఇంజినీరింగ్, తదితర కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉందన్నారు.

12లోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి

సీట్లు పొందిన వారు 12వ తేదీలోపు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసి సీటు రిజర్వ్‌ చేసుకోవాలని కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. లేని పక్షంలో సీటు,  రిజిస్ట్రేషన్‌ రద్దవుతుందన్నారు. రెండో విడత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ గురువారమే మొదలైందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని