Tummala Nageswara Rao: సన్నరకాల సాగుకు ప్రోత్సాహం

తెలంగాణలో వరి సన్నరకాల సాగును ప్రోత్సహించడం తమ ప్రభుత్వ ఉద్దేశమని... దానికనుగుణంగా రూ.500 బోనస్‌ ప్రకటించామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Published : 25 May 2024 04:16 IST

రైతుల అవసరాల మేరకు విత్తనాలు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కోదండరెడ్డితో మంత్రి తుమ్మల చర్చలు

ఈనాడు,హైదరాబాద్‌: తెలంగాణలో వరి సన్నరకాల సాగును ప్రోత్సహించడం తమ ప్రభుత్వ ఉద్దేశమని... దానికనుగుణంగా రూ.500 బోనస్‌ ప్రకటించామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అధికారులు దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వానాకాలం సీజన్‌లో రైతుల అవసరాల మేరకు విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పచ్చిరొట్ట విత్తనాలకు కొన్ని ప్రాంతాల్లో అధిక డిమాండ్‌ ఏర్పడిందని, దానికి అనుగుణంగా పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. విత్తనాల పంపిణీపై శుక్రవారం మంత్రి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత సంవత్సరం కంటే అదనంగా విత్తనాలు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ‘‘వరి సన్నరకాలు 13,32,827 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. 50,942 క్వింటాళ్ల జీలుగు, 11,616 క్వింటాళ్ల జనుము, 236 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలను అందుబాటులోకి తీసుకురాగా 20,518.40 క్వింటాళ్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. 56 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులోకి తెస్తే 7.22 లక్షల ప్యాకెట్ల విక్రయాలు జరిగాయి. అన్నిరకాల బీటీ2 పత్తి విత్తనాలు ఒకే రకంగా దిగుబడినిస్తాయి. ఇప్పటికే 6.26 లక్షల టన్నుల యూరియా, 0.76 లక్షల టన్నుల డీఏపీ, 3.84 లక్షల టన్నుల కాంప్లెక్సు, 0.29 లక్షల టన్నుల ఎంవోపీ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అధికారులు అన్ని స్టాక్‌ పాయింట్లను తనిఖీ చేస్తూ ఎరువుల సరఫరాకు ఎక్కడా ఆటంకం రాకుండా చూడాల’’ని మంత్రి ఆదేశించారు. 

రైతు ప్రయోజనకారిగా ప్రభుత్వ పథకాలు

తెలంగాణ రైతాంగానికి అధిక ప్రయోజనం చేకూర్చేలా  రైతు భరోసా, పంటల బీమా పథకాలను అమలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. రైతు సంఘాలు, ఆదర్శ రైతుల అభిప్రాయాలను సేకరించి అర్హులైన వారందరికీ సాయం అందేలా విధివిధానాలుంటాయని... దీనిపై మంత్రి మండలిలోనూ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. వానాకాలం సీజన్‌ నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, పంటల బీమా విధివిధానాలపై శుక్రవారం సచివాలయంలో అఖిల భారత కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, సభ్యుడు నల్లమల వెంకటేశ్వర్లుతో మంత్రి తుమ్మల చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,  ఇప్పటికే ఉమ్మడి జిల్లాల పరిధిలో వ్యవసాయశాఖ, అనుబంధశాఖ అధికారులతో సదస్సులు నిర్వహించామని... అక్కడ రైతులు వెలిబుచ్చిన సందేహాలను, అభిప్రాయాలను క్రోడీకరించి నివేదిక రూపొందిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని