Heavy Rains: ముందస్తు వానాకాలం

రాష్ట్రంలో జూన్‌ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి.

Updated : 19 May 2024 07:19 IST

మే రెండో వారం నుంచే వర్షాలు
మరో ఏడు రోజులు కురిసే అవకాశం
రుతుపవనాల రాకకు సానుకూలత 
శనివారం కుండపోతతో హైదరాబాద్‌ వాసుల అవస్థలు

శనివారం కురిసిన వర్షానికి  హైదరాబాద్‌లోని వనస్థలిపురం వద్ద జాతీయ రహదారిపై నిలిచిన నీరు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జూన్‌ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో వారం రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉంటాయని సూచించింది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 22వ తేదీ వరకు ‘పసుపు ’రంగు హెచ్చరికలు జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి ఒక్కసారిగా కుండపోత వర్షాలు సంభవిస్తుంటాయి. ప్రస్తుతం తీవ్రమైన ఎండలు లేనప్పటికీ ఏప్రిల్‌లో నమోదైన రికార్డుస్థాయి ఎండలు ఇప్పుడు ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది గరిష్ఠంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు నైరుతి రుతుపవనాల ఆగమనానికి సానుకూల పరిస్థితులు ఏర్పడటంతో ఒకదాని వెంట ఒకటి ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. మే 31న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది. 

పడిపోతున్న సాధారణ ఉష్ణోగ్రతలు 

ఈ నెల రెండో వారం నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వీటి కారణంగా హనుమకొండలో 41.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా 11.3 డిగ్రీలు తగ్గి 30 డిగ్రీలకు పడిపోయింది. ఇదే తీరులో రామగుండంలో సాధారణం కన్నా 9.2, హైదరాబాద్‌లో 7.9, మెదక్‌లో 7.3, నిజామాబాద్‌ 6.8, ఖమ్మం 5.1, మహబూబ్‌నగర్‌ 5, ఆదిలాబాద్‌ 4.9 డిగ్రీలు తగ్గాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోనూ భారీగా తగ్గుదల కనిపిస్తోంది. మార్చి నుంచి మే 18 వరకు రాష్ట్రంలో 51.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 66.4 మిల్లీమీటర్లు నమోదైంది. 23 జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువగా వానలు కురిశాయి. అయితే ఈ నెలాఖరులో నాలుగైదు రోజులు ఎండలు కొంతమేర పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ భావిస్తోంది. 

హైదరాబాద్‌ హైరానా..

రాజధాని నగరం శనివారం మరోమారు జలమయమైంది. సాయంత్రం ముంచెత్తిన వర్షానికి ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లిలో 6.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హయత్‌నగర్‌లో 5.6, ఉప్పల్‌ 4.7, రామంతాపూర్‌ 4.7 సెం.మీ. పడింది. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోకి వచ్చే అనేక ప్రాంతాల్లో గంటపాటు భారీగా వాన కురిసింది. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులు వాగులను తలపించాయి. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిలో పలు చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. వనపర్తి, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఓ మోస్తరుగా పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని