Puttamgandi: ‘పుట్టంగండి’ నుంచి జంటనగరాలకు మరో 125 క్యూసెక్కులు

హైదరాబాద్‌ జంటనగరాల తాగునీటి సరఫరాకు అవాంతరాలు కలగకుండా నాగార్జున సాగర్‌ జలాశయం పుట్టంగండి పంపింగ్‌ స్టేషన్‌ నుంచి అదనంగా మరో 125 క్యూసెక్కులు తరలించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది.

Updated : 07 Jun 2024 06:28 IST

పుట్టంగండి జీరో పాయింట్‌ వద్ద సిద్ధం చేస్తున్న సబ్‌మెర్సిబుల్‌ మోటార్లు

పెద్దఅడిశర్లపల్లి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ జంటనగరాల తాగునీటి సరఫరాకు అవాంతరాలు కలగకుండా నాగార్జున సాగర్‌ జలాశయం పుట్టంగండి పంపింగ్‌ స్టేషన్‌ నుంచి అదనంగా మరో 125 క్యూసెక్కులు తరలించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. వేసవిలో ‘సాగర్‌’ నీటిమట్టం కనిష్ఠస్థాయి నుంచి దిగువకు చేరడంతో జంటనగరాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఏప్రిల్‌లో నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి వద్ద ఉన్న ‘పుట్టంగండి’ జీరో పాయింట్‌ వద్ద ఏర్పాటు చేసిన అత్యవసర మోటార్లతో 900 క్యూసెక్కుల నీటిని ఏఎమ్మార్పీ అప్రోచ్‌ కెనాల్‌కు అందిస్తున్నారు. ప్రస్తుతం అత్యవసర పంపింగ్‌ స్టేషన్‌ నుంచి 60 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన 5 మోటార్లతో 300 క్యూసెక్కులు, 120 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన 5 మోటార్లతో 600 క్యూసెక్కులు కలిపి.. మొత్తం 900 క్యూసెక్కులు తీసుకుంటున్నారు. ఈ పది మోటార్లలో ఏదైనా ఒక దాంట్లో సాంకేతిక లోపం తలెత్తి సరఫరా నిలిచిపోతే నీటిని తీసుకోవడంలో ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా 25 క్యూసెక్కుల సామర్థ్యం గల మరో 5 సబ్‌మెర్సిబుల్‌ మోటార్లు అమర్చుతున్నారు. వీటితోనూ 125 క్యూసెక్కులు తీసుకోనున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అప్రోచ్‌ కెనాల్‌లో నీటిమట్టం 510 అడుగులకు తగ్గకుండా ఉండేలా పుట్టంగండి నుంచి సరిపడా నీటిని తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. పుట్టంగండి అప్రోచ్‌ కెనాల్‌లో నీటిమట్టం అనుకూలంగా ఉన్న సమయాల్లో 800 క్యూసెక్కులు అక్కంపల్లి జలాశయానికి విడుదల చేస్తున్నారు. ఇక్కడి నుంచి కోదండాపురం ప్లాంట్‌కు 525 క్యూసెక్కులు తీసుకుని.. వాటిని శుద్ధి చేసి జంటనగరాలకు 270 ఎంజీడీలు సరఫరా చేస్తున్నారు. అదనపు మోటార్ల ఏర్పాటు పనులు రెండు రోజుల్లో పూర్తి కానున్నాయని జలమండలి డీజీఎం వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని