America: అగ్రరాజ్యం... మారుతున్న వ్యూహం!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలను పరిశీలిస్తే, పశ్చిమాసియా పట్ల అగ్రరాజ్య వ్యూహం మారుతున్నట్లే కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస భద్రతా మండలిలో తీర్మానాలను వీటో చేస్తున్న అగ్రరాజ్యం

Published : 05 Jun 2024 01:50 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలను పరిశీలిస్తే, పశ్చిమాసియా పట్ల అగ్రరాజ్య వ్యూహం మారుతున్నట్లే కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస భద్రతా మండలిలో తీర్మానాలను వీటో చేస్తున్న అగ్రరాజ్యం- తన గడ్డపై మాత్రం యూదు వ్యతిరేకతకు ప్రాధాన్యమిస్తోంది.

శ్చిమాసియా విషయంలో అమెరికా వైఖరి మారుతోందని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ మొదట చెప్పుకోవాల్సింది బైడెన్‌ ప్రత్యేక సలహాదారుగా మెహర్‌ బిటార్‌ నియామకం గురించి. మెహర్‌ గతంలో బరాక్‌ ఒబామా ప్రభుత్వంలో ఇజ్రాయెల్‌-పాలస్తీనా వ్యవహారాలను పర్యవేక్షించేవారు. విద్యార్థి దశలో పాలస్తీనాలో న్యాయం కోసం పోరాడే ‘స్టూడెంట్స్‌ ఫర్‌ జస్టిస్‌ ఇన్‌ పాలస్తీనా’ సంస్థ అధ్యక్షుడిగా పనిచేశారు. యూదు వ్యతిరేకతతో ఈ సంస్థ కళాశాల ప్రాంగణాల్లో ఇజ్రాయెల్‌ ప్రాయోజకత్వం వహించే కార్యక్రమాలను అడ్డుకొనేది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్‌కు అమెరికా వంతపాడటం ఆపాలంటూ అగ్రరాజ్య విశ్వవిద్యాలయాల్లో నిరసనలు చేపడుతోంది. బైడెన్‌ సర్కారు ఇటువంటి ప్రదర్శనలను భగ్నం చేస్తూనే... పచ్చి యూదు వ్యతిరేకి అయిన మెహర్‌ను దేశాధ్యక్షుడి ప్రత్యేక సలహాదారుగా నియమించింది! నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న క్రమంలో ముస్లిం ఓట్లను ఒడిసిపట్టేందుకే బైడెన్‌ యూదు వ్యతిరేకతకు ప్రాధాన్యమిస్తున్నట్లు భావిస్తున్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో పాగా వేసేందుకే...

రఫా మీద విరుచుకుపడిన ఇజ్రాయెల్‌కు అక్కడ పైచేయి సాధించడానికి ఉపకరించే ఆయుధాలు, మందుగుండును సరఫరా చేయబోమని బైడెన్‌ ప్రభుత్వం ప్రకటించింది. సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్‌ ఈ విషయాన్ని తెగేసి చెప్పారు. రఫాలోని పౌరులపై దాడులు చేయడానికి తమ మద్దతు లభించదని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, ఆయన మంత్రులకు ఖండితంగా చెప్పినట్లు వెల్లడించారు. ఇది ఇరాన్‌ లోపాయికారీ అండతో ఇజ్రాయెల్‌పై పోరాడుతున్న ఇస్లామిక్‌ సంస్థల చెవులకు ఎంతో ఇంపుగా ఉంటుంది. లెబనాన్‌లో హెజ్బొల్లా ఇరాన్‌ మద్దతుతోనే ఇజ్రాయెల్‌పై కయ్యానికి కాలు దువ్వుతోంది. అయినా లెబనాన్‌తోపాటు ఖతార్‌కూ అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తోంది. అదే సమయంలో ఇరాన్‌పై ఆంక్షలు కొనసాగిస్తోంది. ఇరాన్‌ నుంచి విద్యుత్‌ దిగుమతి చేసుకోవడానికి ఇరాక్‌కు మూడు నెలలకు ఒకసారి ఆంక్షలు సడలిస్తోంది. ఇరాక్‌ దీనికి చెల్లింపులను ఒమన్‌లోని బ్యాంకులో జమ చేస్తోంది. ఆ మొత్తాలను ఇరాన్‌ యూరోల రూపంలో తీసుకుంటోంది. ఇజ్రాయెల్‌ తమ ఆయుధాలను అంతర్జాతీయ మానవ హక్కులకు భంగకరంగా వినియోగించి ఉండవచ్చని అమెరికా అభిప్రాయపడింది. పౌరులకు నష్టం వాటిల్లకుండా సైనిక కార్యకలాపాలు చేపట్టడమెలాగో ఇజ్రాయెల్‌కు బాగా తెలుసు. అయితే, గాజాలోని పౌరులకు అపార నష్టం కలుగుతుండటంవల్ల తాము ఇచ్చిన ఆయుధాలను ఇజ్రాయెల్‌ బాధ్యతగా ఉపయోగిస్తోందా అనే సందేహాన్ని అమెరికా వెలిబుచ్చింది. గతంలో అమెరికా ఆందోళనలు, సూచనలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌ తాను చేయదలచుకున్నది చేసేసేది. ఇకపై అలా కుదరదని బైడెన్‌ సర్కారు హెచ్చరిస్తోంది. అధ్యక్ష ఎన్నికలో గెలవడం కోసం ఇజ్రాయెల్‌కు మద్దతు తగ్గించి, ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవాలని బైడెన్‌ నిశ్చయించారని స్పష్టంగా కనిపిస్తోంది. 

ఇప్పటికే అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఇజ్రాయెల్‌ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. తాజాగా రఫాలో దండయాత్ర వల్ల పెద్దసంఖ్యలో పౌరులు చనిపోతే ముస్లిం అమెరికన్‌ ఓటు బ్యాంకు డొనాల్డ్‌ ట్రంప్‌ వైపు మళ్ళవచ్చని బైడెన్‌ సర్కారు ఆందోళన చెందుతోంది. అలాగని ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తే యూదు అమెరికన్‌ ఓటర్లు దూరమవుతారు. దీన్ని నివారించడానికి శత్రు క్షిపణులను అడ్డుకునే పరిజ్ఞానాన్ని ఇజ్రాయెల్‌కు అందిస్తూనే ఉంటామని బైడెన్‌ ప్రకటించారు. ఎన్నికలవల్ల ఆయన ఇలా ఉభయులనూ సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టే తీర్మానాలను అమెరికా వీటో చేస్తోంది. కానీ, గాజా విషయంలో నెతన్యాహు దూకుడు ప్రదర్శించడం మాత్రం అగ్రరాజ్యానికి రుచించడం లేదని స్పష్టమవుతోంది. రఫాపై ఇజ్రాయెల్‌ తీవ్రస్థాయిలో దాడి జరిపితే అది హమాస్‌కే ఉపకరించవచ్చని అమెరికా చెబుతోంది. ఇజ్రాయెల్‌ దాష్టీకంవల్ల గాజాలో శాంతి సాధనకు ఈజిప్ట్, ఖతార్, యూఏఈలు చేస్తున్న ప్రయత్నాలు వమ్మయ్యే ప్రమాదముంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో పౌర నష్టం అధికంగా ఉంటే, ఆ దేశంతో దౌత్య సంబంధాలున్న పశ్చిమాసియా దేశాల్లోని ప్రభుత్వాలపై స్థానిక ప్రజానీకం నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌ యుద్ధం, చైనా దూకుడువల్ల సమస్యలు ఎదుర్కొంటున్న అమెరికాకు పశ్చిమాసియా సంక్షోభం గోరుచుట్టుపై రోకటి పోటులా పరిణమించింది.

బైడెన్‌ ప్రయత్నాలు ఫలిస్తాయా?

ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌లో మధ్యంతర ఎన్నికలు జరిగితే, నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌ పార్టీ ఓటమి చవిచూడవచ్చు. అసలు హమాస్‌ ఇజ్రాయెల్‌పై ఎలా దాడి చేయగలిగిందో తేలాల్సి ఉంది. ఈ అంశంలో భద్రతా వైఫల్యాలపై దర్యాప్తునకు నెతన్యాహు ఇప్పటికీ ఆదేశాలు జారీచేయలేదు. హమాస్‌ను నిర్మూలించి బందీలను వెనక్కు తీసుకువస్తేనే ఆయన రాజకీయంగా గడ్డు పరిస్థితి నుంచి బయటపడతారు. రఫాపై దాడికి కావలసిన ఆయుధ సంపత్తి తమకుందని, అమెరికాతో విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని ఇజ్రాయెల్‌ నౌకాదళాధికారి రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగారి వెల్లడించారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా సౌదీ-ఇజ్రాయెల్‌ మధ్య శాంతిని కుదర్చడానికి బైడెన్‌ ప్రయత్నిస్తున్నారు. తీరా ఇప్పుడు రఫాలో ఇజ్రాయెల్‌ హింసాకాండ పెచ్చరిల్లితే అరబ్‌ దేశాలు వాషింగ్టన్‌కు దూరమవుతాయి. దీన్ని నివారించడానికే రఫాపై పోరుకు ఆయుధాలిచ్చేది లేదని అమెరికా ప్రకటించింది. ఇప్పటికే పౌరుల ప్రాణ నష్టాలకు ఇజ్రాయెల్‌ను జవాబుదారీ చేయాలని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం పట్టుదలగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నెతన్యాహు తన మాట వినకపోవడం బైడెన్‌ సర్కారుకు ఆగ్రహం తెప్పిస్తోంది. రేపు తాను అధ్యక్ష ఎన్నికలో గెలవడం కోసం నెతన్యాహును బలిపశువును చేయడానికి బైడెన్‌ వెనకాడకపోవచ్చు!


ముందు నుయ్యి... వెనక గొయ్యి...

జ్రాయెల్‌లో నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వం రాజకీయ మనుగడ కోసం కిందుమీదులవుతోంది. హమాస్‌ అపహరించుకుపోయిన ఇజ్రాయెలీ పౌరుల కుటుంబ సభ్యులు శాంతి కోసం నెతన్యాహుపై ఒత్తిడి తెస్తున్నారు. హమాస్‌తో సయోధ్య కుదుర్చుకుని తమవాళ్లను క్షేమంగా ఇంటికి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు మంత్రివర్గంలోని అతివాదులు రఫా మీద పూర్తిస్థాయి దాడి జరపాలని ఒత్తిడి తెస్తున్నారు. నెతన్యాహు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి మాదిరిగా తయారైంది. అందుకే రఫా నుంచి ఇస్లామిక్‌ ఉగ్రవాదులను తుడిచిపెట్టనిదే హమాస్‌ కోరలు పీకడం సాధ్యంకాదని ఆయన అంటున్నారు. నెతన్యాహుపై అవినీతి కేసుల విచారణా పెండింగులో ఉంది. అమెరికా ఆయుధ సరఫరాను ఆపినా వెనక్కు తగ్గేదే లేదంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.