EV market: దడ పుట్టిస్తున్న చైనా ఈవీలు

చైనా ఎలెక్ట్రిక్‌ వాహనాలను (ఈవీలను) చూసి అమెరికా, ఐరోపాలు ప్రస్తుతం హడలిపోతున్నాయి. వాటివల్ల తమ ఈవీల విపణి దెబ్బతింటుందని అగ్రరాజ్యం భావిస్తోంది. వ్యక్తిగత గోప్యత, దేశ భద్రతపైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

Published : 05 Jun 2024 01:47 IST

చైనా ఎలెక్ట్రిక్‌ వాహనాలను (ఈవీలను) చూసి అమెరికా, ఐరోపాలు ప్రస్తుతం హడలిపోతున్నాయి. వాటివల్ల తమ ఈవీల విపణి దెబ్బతింటుందని అగ్రరాజ్యం భావిస్తోంది. వ్యక్తిగత గోప్యత, దేశ భద్రతపైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ప్రపంచంలో అతి పెద్ద ఎలెక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తిదారు హోదాను టెస్లా నుంచి చైనా కంపెనీ బీవైడీ ఇప్పటికే లాగేసుకుంది. నేడు ఈవీలకు చైనా అతిపెద్ద మార్కెట్‌ మాత్రమే కాదు- అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారు కూడా. ఈవీలకు కావాల్సిన లిథియం అయాన్‌ బ్యాటరీలు, వాటిలో వాడే నికెల్, కోబాల్ట్‌ వంటి లోహాలు చైనాలోనే అత్యధికంగా ఉత్పత్తి కావడం దీనికి కారణం. అత్యాధునిక సాంకేతికతలతో ఈవీల తయారీలోనూ చైనా తన సత్తా చాటుకుంటోంది. స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తిదారు అయిన ఆపిల్‌ సంస్థ ఈవీ కారును తయారుచేయనున్నట్లు 14 ఏళ్ల క్రితం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం తన వల్ల కాదని చేతులెత్తేసింది. మరోవైపు ఎలెక్ట్రిక్‌ కారును తయారు చేస్తానని చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షావొమీ మూడేళ్ల క్రితం ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో ఎలెక్ట్రిక్‌ కారు తీసుకొచ్చింది. ఏప్రిల్‌ 20కల్లా డెబ్భై వేల ఆర్డర్లు అందాయి. షావొమీ ఈవీ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా చార్జి చేస్తే 800 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

ప్రస్తుతం కృత్రిమ మేధతో స్వయంగా నడిచే ఈవీల తయారీకి చైనా నడుంకట్టింది. దానికి అనుగుణంగా షావొమీ, టెలీకమ్యూనికేషన్‌ సామగ్రి ఉత్పత్తిదారు హువావై ఎలెక్ట్రిక్‌ కార్ల తయారీని చేపట్టాయి. ‘ఆధునిక కారు సంచార డేటా కేంద్రంగా మారింది. అవి మున్ముందు నడిచే స్మార్ట్‌ వేదికలుగా మారతాయి’ అని షావొమీ అధిపతి లీ జున్‌ అభివర్ణించారు. ఈ మాటలు అమెరికాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అందుకే, చైనీస్‌ విద్యుత్‌ కార్లపై 27.5శాతం సుంకం విధించి వాటిని మహా ఖరీదైనవిగా అగ్రరాజ్యం మార్చేసింది. ఇది చాలదన్నట్లు చైనా ఈవీ ఎగుమతులపై 100శాతం సుంకం విధిస్తానని దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే అధిక సుంకాల వల్ల అమెరికాలో చైనీస్‌ ఈవీలు అమ్ముడవడం లేదు. భవిష్యత్తులోనూ వాటిని తమ రోడ్లపై తిరగనివ్వకూడదని అమెరికా భావిస్తోంది. ఇంటర్నెట్‌తో అనుసంధానమై నడిచే ఏఐ ఈవీ కార్లు తమ డ్రైవర్లు, ప్రయాణికులు, వారి ప్రయాణ మార్గాల సమాచారాన్ని చైనాకు అందజేస్తాయని అమెరికాతో పాటు ఐరోపా సమాఖ్య (ఈయూ) సైతం కలవరపడుతోంది. చైనా ఈవీ ‘కదిలే గూఢచార ప్రయోగశాల’ అవుతుందని, చక్రాల మీద నడిచే ఐఫోన్‌ లాంటిదని పాలక, ప్రతిపక్ష సెనెటర్లు ఆరోపిస్తున్నారు. చైనాలో తయారైన ఈవీలు, సంబంధిత సాంకేతికతలపై పూర్తి నిషేధం విధించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం చైనా ఈవీ కన్నా అమెరికా ఈవీ ధర అయిదురెట్లు అధికం. చవక చైనీస్‌ ఈవీలను అనుమతిస్తే తమ మార్కెట్‌ను ముంచెత్తుతాయని బైడెన్‌ సర్కారు భయపడుతోంది.

చైనీస్‌ ఈవీలు డ్రైవర్ల వాయిస్‌ రికార్డింగులను, వ్యక్తిగత వివరాలను చైనాకు అందజేస్తాయని అమెరికా ఆందోళన చెందుతోంది. వాహనం నడుపుతూ డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకుంటే చైనా ఈవీ దాన్ని పసిగట్టి హెచ్చరిస్తుంది. అంటే, ముఖ గుర్తింపు సాంకేతికత దానిలో ఉంటుందన్నమాట. ఇది వ్యక్తిగత డేటా చౌర్యమే అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చైనీస్‌ ఈవీలలో రేపు అమెరికా మంత్రులు, పారిశ్రామికవేత్తలు, రక్షణ అధికారులు ప్రయాణిస్తే వారి రహస్యాలన్నీ బీజింగ్‌కు పొక్కిపోతాయని వాషింగ్టన్‌ భావిస్తోంది. ‘ఇంటర్నెట్, ఏఐల సాయంతో రేపు అమెరికా రోడ్లపై లక్షలాది చైనా ఈవీలను ఒక్క మీట నొక్కి క్షణంలో ఆగిపోయేలా చేయవచ్చు’ అని అమెరికా వాణిజ్య మంత్రి జీనా రెమాండో వ్యాఖ్యానించారు. ఇలాంటిది జరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని, లేదంటే అసలు చైనా ఈవీలను అమెరికాలోకి అనుమతించకూడదని ఆమె అన్నారు. చైనా ఈవీ ఎగుమతులను అమెరికా నిరుత్సాహపరుస్తున్నా ఐరోపా సమాఖ్య (ఈయూ) మాత్రం అనుమతిస్తోంది. ఈయూ ఈవీ దిగుమతుల్లో 37శాతం చైనావే ఉంటున్నాయి. చైనా ప్రభుత్వం భారీ రాయితీలిచ్చి చవక ఈవీ ఎగుమతులను ప్రోత్సహిస్తోందని ఈయూ భావిస్తోంది. అందుకే వీటిపై సుంకాలను 30శాతానికి పెంచాలని యోచిస్తోంది. అలాగే సమాచార భద్రత గురించీ జాగ్రత్త చర్యలు తీసుకోవాలనుకొంటోంది. 

కైజర్‌ అడపా 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు