Tourism: పర్యటక స్వర్గధామాలు... జలాశయాలు

నదులు, జలాశయాలు, నీటి ప్రాజెక్టులను విద్యుదుత్పత్తి కేంద్రాలుగా, సాగు తాగునీటి వనరులుగా అభివృద్ధి చేయడానికే ప్రభుత్వాలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. వాటిని పర్యటకంగా తీర్చిదిద్దితే ఆదాయంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చు.

Published : 07 Jun 2024 01:23 IST

నదులు, జలాశయాలు, నీటి ప్రాజెక్టులను విద్యుదుత్పత్తి కేంద్రాలుగా, సాగు తాగునీటి వనరులుగా అభివృద్ధి చేయడానికే ప్రభుత్వాలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. వాటిని పర్యటకంగా తీర్చిదిద్దితే ఆదాయంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చు. చుట్టుపక్కల గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయి.

గంగానదిలో విలాసవంతమైన పడవలపై సుదీర్ఘ యాత్రలతో కొత్తపుంతలు తొక్కుతున్న దేశీయ పర్యటకం- జలాశయాల్లోని బ్యాక్‌ వాటర్స్‌పై దృష్టి పెడితే మరింతగా వికసిస్తుంది. దేశంలో చిన్నాపెద్దా జలాశయాలు కలిపి ఏడు వేలకు పైనే ఉన్నాయి. కానీ, వాటి చుట్టుపక్కల మండలాల్లోని భూముల్లో పచ్చదనం అంతగా కానరావడం లేదు. అవన్నీ అటవీ భూముల పరిధిలోకి రావడంతో పెద్దగా వ్యవసాయమూ కనిపించదు. జలాశయాలకు కాస్త దూరంలో ఉన్న భూములు సాగునీటి కాలువలకు చివరన ఉండటంతో ఆశించినమేర నీరందడం లేదు. అక్కడి కొండల నడుమ ఉండే గిరిజన గూడేలు, తండాలు, ఆవాస సముదాయాలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నాయి. అయితే, జలాశయాలతో పాటు   చుట్టుపక్కల ఉండే ఆహ్లాదకర వాతావరణం, పచ్చటి కొండలు, గిరిజన సంస్కృతి, జీవవైవిధ్యం, వృక్ష జాతులు పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కాస్త వసతులు కల్పిస్తే స్థానికులకు, ప్రభుత్వాలకు అవి కల్పతరువుగా మారతాయి.

పుష్కల అవకాశాలు

జలాశయాల బ్యాక్‌ వాటర్స్‌ పర్యటకానికి ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ డ్యాం మొదలు కేరళ వరకు ఎన్నో అవకాశాలున్నాయి. కేరళ ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇందిరాసాగర్, ఓంకారేశ్వర డ్యాం జలాల్లోని దీవులను పర్యటక స్వర్గధామాలుగా మార్చారు. నర్మదా నదీ తీరంలో పర్యటకం జోరందుకొంది. జలాశయాల చుట్టూ పర్యావరణ, జీవవైవిధ్య రక్షిత ప్రాంతాలు ఉంటాయి. వాటిలో శాశ్వత నిర్మాణాలు, పర్యావరణానికి హాని కలిగించే చర్యలు చేపట్టడం నిషిద్ధం. ఈ నిబంధన కోయ్‌నా ఆనకట్ట బ్యాక్‌ వాటర్స్‌లో పర్యటకాభివృద్ధికి ప్రయత్నిస్తున్న మహారాష్ట్రకు అడ్డంకిగా మారింది. దాంతో అక్కడి ప్రభుత్వం పర్యావరణ, అటవీశాఖల సమన్వయంతో చర్యలు చేపట్టింది. నీటి నిల్వ చుట్టూ భారీ కరకట్టను నిర్మించి, అక్కడి నుంచి అయిదు కిలోమీటర్ల మేర రక్షిత ప్రాంతంగా వదిలేసింది. ఆ తరవాతి భూముల్లో పర్యటకులను ఆకట్టుకోవడానికి అనేక ఏర్పాట్లు చేస్తోంది. స్థానికులకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఇళ్లు కట్టించింది. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన మేర ప్రగతి కనిపించడం లేదు. ఇక్కడి పొడవైన, పురాతనమైన డ్యాములు ఇంజినీరింగ్‌ పర్యటకానికి దోహదపడే అవకాశముంది.

తెలుగు రాష్ట్రాల్లో పర్యటక ఏర్పాట్లు తిరోగమన దిశలో ఉన్నాయి. అటవీ ప్రాంతంలో ఉన్న కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద ఏళ్ల కిందటే ఏర్పాట్లు చేసినా నిరాదరణకు గురవుతున్నాయి. నాగార్జునసాగర్‌లో ఏలేశ్వరం కొండపై మహాశివరాత్రి వంటి ప్రత్యేక దినాల్లో తప్ప ప్రభుత్వపరంగా ఎటువంటి ఏర్పాట్లూ ఉండటం లేదు. ఒక్క శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో... కర్నూలు జిల్లాకు చెందిన 30 గ్రామాలు, నది ఒడ్డున ఉన్న మరో 30 పల్లెలు మాత్రమే పర్యటకులను కొంతవరకు ఆకర్షిస్తున్నాయి. వసతులు కల్పిస్తే నాగార్జునసాగర్‌ పరిధిలోని నల్లమల ఒడిలో నేరేడుగొమ్ము మండలంలోని ఎన్నో గ్రామాలు పర్యటకులను మరింతగా ఆకట్టుకుంటాయి. ఇక్కడి దేవరచర్ల గ్రామం తెలంగాణ అరకుగా పేరొందింది. ద్వీపకల్పంలా ఉండే వైజాగ్‌ కాలని, ఆ పక్కనే పొగిళ్ల జలపాతం, ఏలేశ్వరం గుట్ట వంటి ఆకర్షణలెన్నో సాగర్‌కు హారంలా మెరిసిపోతున్నాయి. నిజాంసాగర్, సింగూరు, త్రివేణి సంగమం (గోదావరి, హరిద్ర, మంజీర నదులు కలిసేచోటు)తోపాటు ఎన్నో ఆలయాలను కలిపే పర్యటక ప్రణాళికకు రూ.66 కోట్లతో సమగ్ర నివేదిక సిద్ధమైంది. ఈ మార్గంలోని గ్రామాలను అభివృద్ధి చేయడంపైనా దృష్టి సారించాల్సిన అవసరముంది. 

ప్రోత్సహిస్తే అభివృద్ధి, ఆహ్లాదం...

జలాశయాల చుట్టుపక్కల పల్లెలను పర్యటకులకు పరిచయం చేయాలి. మహారాష్ట్రలోని మేల్ఘాట్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలోని ఖత్కలిలో గిరిజన కుటుంబాలు తమ ఇళ్లను ‘హోం స్టే’గా మార్చుకోవడానికి కేంద్రం ప్రోత్సహించింది. దాంతో ఆ గ్రామానికి ఆర్థికంగా ఆసరా లభించింది. కేంద్రం, రాష్ట్రాలు ఇదే మాదిరిగా చొరవ చూపితే జలాశయ ప్రాంతాలన్నీ పర్యటకంగా వెలుగొందుతాయి. ముఖ్యంగా పర్యటక, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలి. అక్కడి గ్రామాల్లో ‘హోం స్టే’లను ఏర్పాటు చేయాలి. జల, సాహస క్రీడలను అందుబాటులోకి తీసుకురావాలి. ఇటువంటి చర్యల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని గూడేలు, తండాలకు ఆర్థిక జవసత్వాలు కల్పించవచ్చు.

బండపల్లి స్టాలిన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.