అటవీ నేరాలకేదీ అడ్డుకట్ట?
ఛత్తీస్‌గఢ్ నుంచి వలసవచ్చి తెలంగాణ అడవుల్లో స్థిరపడిన గొత్తికోయలు అరణ్యాలను నిర్మూలించి పోడు వ్యవసాయం చేస్తున్నారు. దాన్ని అడ్డుకొన్నందుకు ఇటీవల అటవీ రేంజి అధికారి (ఎఫ్‌ఆర్‌ఓ) శ్రీనివాసరావును పాశవికంగా హత్యచేశారు. ఈ ఘటన అటవీ రక్షణను, ఫారెస్టు సిబ్బంది భద్రతను ప్రశ్నార్థకం చేసింది.
ఛత్తీస్‌గఢ్ నుంచి వలసవచ్చి తెలంగాణ అడవుల్లో స్థిరపడిన గొత్తికోయలు అరణ్యాలను నిర్మూలించి పోడు వ్యవసాయం చేస్తున్నారు. దాన్ని అడ్డుకొన్నందుకు ఇటీవల అటవీ రేంజి అధికారి (ఎఫ్‌ఆర్‌ఓ) శ్రీనివాసరావును పాశవికంగా హత్యచేశారు. ఈ ఘటన అటవీ రక్షణను, ఫారెస్టు సిబ్బంది భద్రతను ప్రశ్నార్థకం చేసింది.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మురియా జాతి గిరిజనులైన గొత్తి కోయలు రెండు మూడు దశాబ్దాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోకి వలస వస్తున్నారు. తెలంగాణలో గోదావరి పరీవాహక ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్‌తో ఉన్న సరిహద్దు అడవుల్లోకి వారు వలస వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. నాగరిక మానవ ఆవాసాలకు దూరంగా చెలమలు, వాగులు, వంకలు వంటి నీటి సదుపాయం ఉన్న దట్టమైన అటవీప్రాంతాన్ని వారు ఎంచుకుంటారు. అక్కడ ఎకరాలకొద్దీ అడవులను నిర్మూలించి తమ ఆవాసాలను నెలకొల్పి, పోడు వ్యవసాయం చేయడం ప్రారంభిస్తారు. వారు చాలా వేగంగా అడవులను నరికివేస్తారు. కొంతమంది స్థానికులు సైతం పోడు వ్యవసాయం కోసం అడవులను నరకడానికి వారిని వినియోగించుకుంటున్నారు. విలువిద్యలో మేటి అయిన గొత్తికోయలు అడవి జంతువులను వేటాడతారు. గతేడాది ములుగు జిల్లాలో వారు వన్యప్రాణుల కోసం వేసిన ఉచ్చులో పడి పెద్దపులి మరణించింది. అడవి మధ్యలో పోడు వ్యవసాయం చేస్తున్న వారిని సాకుగా చూపి స్థానికులు కొందరు తామూ పోడు చేయడానికి ఉపక్రమిస్తుంటారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, సల్వాజుడుం మధ్య ఉన్న వైరం కారణంగా గొత్తికోయలు తెలంగాణ అడవుల్లోకి వలస వచ్చినట్లు చెబుతారు.
మానవ హక్కుల సమస్యగా...
కేంద్రం తెచ్చిన అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం, 2005 డిసెంబరు 13 నాటికి అటవీభూమి అనుభవంలో ఉన్న వారిని హక్కుదారులుగా గుర్తించారు. జీవనోపాధికోసం భూమిని సాగుచేసుకునే హక్కును షెడ్యూల్డ్ తెగల వారికి కొన్ని షరతులతో కల్పించారు. ఈ చట్టం ప్రకారం భూమిపై యాజమాన్య హక్కు అటవీ శాఖకే చెందుతుంది. తదనంతర కాలంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు అటవీ భూములపై హక్కులు కల్పిస్తాయనే అపోహ ప్రజల్లో నెలకొంది. ఫలితంగా 2005 తరవాతా అడవుల నరికివేత, పోడు వ్యవసాయం కొనసాగాయి. కొందరు రాజకీయ నాయకులు తాము అధికారంలోకి వస్తే పోడుదారులకు పట్టాలిస్తామని లేదా హక్కులు కల్పిస్తామని ఎన్నికల వాగ్దానాలు చేశారు. ఇది పోడు వ్యవసాయానికి, అడవుల నరికివేతకు ఊతమిచ్చింది. అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 తరవాత పోడు చేసిన వారికి హక్కులు ఇవ్వరన్నది నిర్వివాదాంశం. పోడు ఎప్పుడు చేశారనేది ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తేటతెల్లమవుతుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖలు తీసుకుంటున్న చర్యల వల్ల కొత్తగా సాగుకోసం అడవిని నరకడం ఈ మధ్య కాలంలో చాలావరకు తగ్గింది. అన్యాక్రాంతమైన అటవీ భూములను వెనక్కి తీసుకొని చెట్లను పెంచి అడవిని అభివృద్ధి చేస్తున్నారు. అయితే, పోడుభూములకు పట్టాలిస్తామనే ప్రభుత్వ ప్రకటనతో వెనక్కి తీసుకున్న అటవీభూములను పోడుదారులు తిరిగి ఆక్రమిస్తున్నారు. ఆ భూముల్లో పెంచిన మొక్కలను నరికేస్తున్నారు. ఈ క్రమంలో పోడుదారులకు, అటవీశాఖకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. సంఖ్యాబలం అధికంగా ఉండే పోడుదారులు, నిరాయుధంగా ఉండే అటవీ అధికారులపై భౌతికదాడులకు పాల్పడుతున్నారు. వనాలు, వన్యప్రాణుల రక్షణలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా నలభై మందికి పైగా అటవీ అధికారులు ప్రాణాలు వదిలారు.
గొత్తికోయల ఆదిమమైన జీవనం జాలిగొలిపేలా ఉంటుంది. రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వారికి మద్దతుగా నిలుస్తాయి. వారి గూడేల్లో సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తాయి. అడవిని నాశనం చేసినందుకు గొత్తికోయలపై చర్యలు తీసుకోవడం, వారిని అడవి నుంచి ఖాళీ చేయించడం వంటి సందర్భాల్లో మానవ/ఆదివాసీ హక్కులకు భంగం కలిగిస్తోందన్న ఆరోపణలను అటవీ శాఖ ఎదుర్కొంటోంది. ఈ విషయంలో అటవీ శాఖకు నోటీసులు సైతం అందాయి. హైకోర్టులో అటవీ అధికారులపై వ్యాజ్యాలు, పిటిషన్లు దాఖలయ్యాయి. అడవుల నుంచి వారిని ఖాళీ చేయించవద్దని హైకోర్టు సూచించింది.
సరైన చర్యలు కీలకం
అడవి క్షీణతకు కారణమవుతున్న గొత్తికోయల విషయంలో అటవీశాఖ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి చందంగా తయారైంది. క్షేత్రస్థాయి అటవీ అధికారుల విధి నిర్వహణ కత్తిమీద సాములా మారింది. అరణ్యాన్ని, అడవి జంతువులను కాపాడుతూ తమ భద్రతను సైతం కాచుకోవడం వారికి పెను సవాలుగా పరిణమించింది. గొత్తికోయల వలసలో నక్సల్ కోణం ఉందని భావిస్తున్నందువల్ల శాంతిభద్రతల సమస్యగా మారుతుందని జిల్లా యంత్రాంగం, పోలీసులు వారి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. వారి సమస్యలకు పరిష్కారం లభించాలంటే గొత్తికోయలను అటవీప్రాంతం నుంచి బయటకు వెళ్ళడానికి ఒప్పించాలి. దగ్గరి గ్రామాల్లో వారికి పునరావాసం కల్పించాలి. లేదంటే వారిని తమ సొంత రాష్ట్రానికి తిరిగి పంపించే అంశాన్నీ ప్రభుత్వాలు ఆలోచించాలి. లేదా సామరస్యపూర్వకంగా మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాలి. పర్యావరణ పరిరక్షణలో కీలకంగా నిలిచే అడవులు, వాటిలోని వన్యప్రాణుల ప్రాధాన్యం, అటవీ చట్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అటవీ నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాన్ని సవరించాలి. అటవీ అధికారుల రక్షణే ప్రమాదంలో పడినప్పుడు అరణ్యాల భద్రత గాలిలో దీపమవుతుంది. వారి రక్షణకు పూర్తి భరోసా కల్పించడం అత్యావశ్యకం.
దాడులు నిత్యకృత్యం
ఒక్క అటవీ విభాగం తప్ప ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని శాఖలు గొత్తికోయల బాగోగులకు ఎంతోకొంత సహాయపడతాయి. రేషన్, ఆధార్, ఓటరు కార్డులు సైతం వారికి ఉన్నాయి. గొత్తికోయలు అడవులను విచ్చలవిడిగా నరకడం, వన్యప్రాణులను వధిస్తుండటం వల్ల వారి వలసలను, ఆవాసాలను అడవులకు ముప్పుగా అటవీశాఖ పరిగణిస్తోంది. అడవులను నరకడం, పోడు చేయడం, జంతువుల వేట వంటి వాటిపై కేసులు నమోదు చేస్తున్నా గొత్తికోయలు తమ జీవనం కోసం భూమి కావాలంటూ- ఆక్రమించిన అటవీ భూమిని వదిలి వెళ్ళడం లేదు. ఖాళీ చేయించినా తిరిగి దాన్ని ఆక్రమిస్తున్నారు. పోడు ప్రాంతాల్లో అటవీశాఖ నాటిన మొక్కలను ఎన్నో సందర్భాల్లో వారు నాశనం చేశారు. అటవీ అధికారులపై దాడులకు సైతం పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇది నిత్యకృత్యమైపోయింది. ఈ క్రమంలో అటవీ క్షేత్రాధికారి శ్రీనివాసరావు హత్యను వాటన్నింటికీ పరాకాష్ఠగా భావించాలి.
- ఎం.రామ్‌మోహన్
(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: తిరుమలలో ఆటోమేటిక్ యంత్రాలతో లడ్డూ తయారీ!
-
India News
SC: ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
Politics News
TS Assembly: ‘ఎందుకు రావట్లేదు’- కేటీఆర్... ‘పిలిస్తే కదా వచ్చేది’- ఈటల
-
Movies News
Thunivu: ఓటీటీలో ‘తునివు’ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే..?
-
World News
North Korea: రూ.13.9వేల కోట్లు కొల్లగొట్టిన కిమ్ ‘జాతిరత్నాలు’..!
-
Latestnews News
IND vs AUS: అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ ‘డూప్లికేట్’ వ్యూహం!