సహచట్టం... ఎవరికీ పట్టని చుట్టం

ప్రభుత్వ సంస్థల్లో, పాలనలో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే 2005 నాటి సమాచార హక్కు చట్టం ఉద్దేశం.  దేశంలో ఈ చట్టం అమలులోకి వచ్చి 18 ఏళ్లు గడుస్తున్నా, అంతంత మాత్రంగానే అమలవుతోంది.

Published : 31 Mar 2023 00:33 IST

ప్రభుత్వ సంస్థల్లో, పాలనలో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే 2005 నాటి సమాచార హక్కు చట్టం ఉద్దేశం.  దేశంలో ఈ చట్టం అమలులోకి వచ్చి 18 ఏళ్లు గడుస్తున్నా, అంతంత మాత్రంగానే అమలవుతోంది. అన్ని స్థాయుల్లోనూ నిర్దిష్టంగా అమలు జరిగితేనే సామాన్యులకు మేలు కలుగుతుంది.

మాచార హక్కు చట్టం ప్రకారం ప్రజాశ్రేయస్సు దృష్ట్యా భారత పౌరసత్వం కలిగిన వ్యక్తులు అవసరమైన సమాచారాన్ని కోరవచ్చు. నిర్ణీత రుసుము చెల్లించి విశ్వవిద్యాలయాల రికార్డులు పరిశీలించవచ్చు. వైద్యుల పట్టాలపై అనుమానాలుంటే సంబంధిత వివరాలనూ కోరవచ్చు. ఆస్తి పత్రాలకు సంబంధించిన సమాచారం, ఉద్యోగాలకు ఎంపిక, ప్రతిభావంతుల జాబితాలకు సంబంధించిన వివరాలు, వర్సిటీల పరీక్షలు, మార్కుల జాబితాల సమాచారం వంటివన్నీ తనిఖీ చేసుకోవచ్చు. కానీ, దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చే విషయంలో చాలామంది అధికారులు తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. కొంతమంది కలెక్టర్లు తదితర జిల్లాస్థాయి అధికారులు సైతం తాము చట్టానికి అతీతులమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దరఖాస్తులను కిందిస్థాయి అధికారులకు పంపించి చేతులు దులుపుకొంటున్నారు. ఆయా సమాచారం దరఖాస్తుదారులకు అందిందా లేదా అన్న విషయాన్నీ పట్టించుకోవడం లేదు. చట్టం అమలు తీరుపై సమీక్షలూ నిర్వహించడం లేదు.

తీర్పులు పెడచెవిన...

సహ చట్టం ప్రకారం దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని సెక్షన్‌ 7(1) ప్రకారం 30 రోజుల వ్యవధిలో అందించాలి. ఈ నిబంధనను అవకాశంగా తీసుకొని చాలామంది అధికారులు ఒక్కరోజులో ఇవ్వగలిగే సమాచారాన్ని కూడా 29 రోజుల తరవాత ఇచ్చేందుకు యత్నిస్తున్నారు. అది దరఖాస్తుదారుడికి అందేప్పటికి నిర్ణీత గడువూ దాటిపోతోంది. మరోవైపు, అసంపూర్తి సమాచారాన్ని ఇవ్వడం, అప్పిలేట్‌ అథారిటీ చిరునామా ఇవ్వకపోవడం, అప్పీలుకు వ్యవధిని తెలపకపోవడం వంటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. సహచట్టం నిబంధనలను, కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్ల సూచనలను, వివరణలను, న్యాయస్థానాల తీర్పులను సైతం చాలామంది అధికారులు ఖాతరు చేయడం లేదు. సరైన కారణం లేకుండానే, కేవలం విచారణ జరుగుతోందన్న సాకుతో చాలా కేసుల్లో సమాచారాన్ని నిరాకరిస్తున్నారు. సెక్షన్‌ 6(3) ప్రకారం ఇతర శాఖలకు చెందిన సమాచారం గురించి అందిన దరఖాస్తును అయిదు రోజుల్లోగా సంబంధిత విభాగానికి బదిలీ చేసి, ఆ విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియజేయాలి. కానీ, కొందరు అధికారులు గడువుదాటిన చాలారోజులకుగాని దరఖాస్తును బదిలీ చేయడం లేదు. దరఖాస్తుదారులకూ సకాలంలో తెలపడంలేదు. అంతేకాదు- ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్ల నకళ్లు, వార్షిక ఆస్తి నివేదికలు, దస్త్రాల నిర్వహణకు సంబంధించిన కీలకమైన ఫైల్‌ నోటింగులు వంటివన్నీ దరఖాస్తుదారులకు అందించాలని ఎన్నో ఆదేశాలు, న్యాయస్థానాల తీర్పులు ఉన్నా... అధికారులు వాటిని పెడచెవిన పెడుతూ దరఖాస్తుదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కొన్నిసార్లు మొదటి దరఖాస్తుకు సమాచారం ఇవ్వకుండా, అప్పీలుకు వెళ్ళిన తరవాతే స్పందిస్తుండటంతో దరఖాస్తుదారులకు ఖర్చు, కాలయాపన తప్పడం లేదు. సహచట్టం ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థలకే వర్తిస్తుందనడంతో ప్రైవేటు విద్య, వైద్య, మత సంస్థల్లో అక్రమాలు, అవినీతి తాండవిస్తున్నా సమాచారం బయటికి పొక్కడం లేదు. సెక్షన్‌ (8)(1)(జె)లోని ప్రజాప్రయోజనం అనే నిబంధనను ఆసరాగా చేసుకొని చాలామంది అధికారులు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. దొంగ డిగ్రీలతో ఉద్యోగాలు పొందిన విషయంలో సర్టిఫికెట్ల గురించి, అక్రమాస్తుల విషయంలో వార్షిక ఆదాయ నివేదికల వివరాలుకోరే అవకాశమున్నా, సరైన కారణాలు చూపకుండానే కొందరు అధికారులు తోసిపుచ్చుతున్నారు. ఇది ముమ్మాటికీ చట్ట విరుద్ధమే.

జరిమానాలతో మార్పు

చట్టం, దాని ప్రయోజనాలపై ప్రజలు, అధికారులకు సరైన అవగాహన కలిగించాలి. మొదటి దరఖాస్తుకే సరైన సమాచారాన్ని సమగ్రరీతిలో నిర్దిష్ట గడువులోగా అందించని ప్రజాసమాచార అధికారులపై జరిమానాలు విధించాలి. అవసరమైతే సెక్షన్‌ 20(2) ప్రకారం శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. మొదటి అప్పిలేట్‌ అధికారి విషయంలోనూ సకాలంలో సరైన సమాచారం ఇవ్వకపోతే జరిమానా విధించాలి. రెండో అప్పిలేట్‌ అధికారి అయిన రాష్ట్ర సమాచార కమిషన్‌కూ దరఖాస్తుల పరిష్కరణలో గడువు నిర్ణయించాలి. సమాచారం ఇవ్వడంలో విఫలమైన ప్రజా సమాచార అధికారి స్థాయిలో జరిమానా విధించడం లేదు. గడువులోగా కోరిన సమాచారం అందించకపోయినా, అరకొర వివరాలు ఇచ్చినా రోజుకు రూ.250 చొప్పున (గరిష్ఠంగా రూ.25,000) జరిమానా అనేది అరుదుగా, కొన్ని కేసుల్లో రెండో అప్పిలేట్‌ అధికారి (సమాచార కమిషనర్‌) వద్దకు విషయం వెళ్ళిన తరవాత విధిస్తున్నారు. ప్రజా సమాచార అధికారి వైఫల్యానికి జరిమానాలు విధించడం లేదు. చట్టం వైఫల్యానికి ప్రధాన కారణాల్లో ఇదీ కీలకమే. ప్రజా సమాచార అధికారి వైఫల్యానికి మొదటి అప్పిలేట్‌ అధికారే జరిమానా విధించేలా నిబంధనలు తీసుకురావాలి. మొదటి, రెండో అప్పీళ్ల విషయంలో విచారణకు హాజరయ్యే దరఖాస్తుదారులకు భత్యాలను చెల్లించాలి. ఆ మొత్తాన్ని బాధ్యులైన అధికారుల జీతాల నుంచి మినహాయించేలా చట్టాన్ని సవరించాలి. దీంతో చాలా దరఖాస్తులు ప్రాథమిక స్థాయిలోనే పరిష్కారమవుతాయి. సహచట్టం అమలులో సమర్థులైన అధికారులను పురస్కారాలతో సత్కరించాలి. ఇలాంటి కనీస చర్యలు తీసుకుంటేనే చట్టం ఫలాలు సామాన్యులకు దక్కుతాయి. పాలనలో పారదర్శకత సాధ్యమవుతుంది. లేనిపక్షంలో సమాచార హక్కు చట్టం నిర్వీర్యమైపోతుంది.


నీరుగారుతున్న నిబంధనలు

ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందకపోతే, అప్పీలు చేసుకోవాల్సిన అధికారుల పూర్తి చిరునామా, కాలవ్యవధి వంటి వివరాలూ అందించాలి. చాలామంది అధికారులు ఈ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ప్రజా సమాచార అధికారి, మొదటి అప్పిలేట్‌ అధికారి సకాలంలో లేదా సరైన సమాచారం ఇవ్వనప్పుడు, లేదా తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు రెండో అప్పిలేట్‌ అధికారికి ఫిర్యాదు చేయడం, విచారణకు పిలిస్తే హాజరుకావడం దరఖాస్తుదారులకు వ్యయప్రయాసలతో కూడిన పని. దీనివల్ల చాలామంది వ్యాజ్య విచారణలకు హాజరు కాలేకపోతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం ప్రభుత్వ ఖర్చుతో హాజరవుతారు. గడువు ముగిసిన తరవాత జరిగే ఆలస్యానికి జరిమానా విధించాలనే నిబంధన సైతం సక్రమంగా అమలు జరగడం లేదు. అయిదు శాతం కేసుల్లోనూ బాధ్యులైన అధికారులకు జరిమానాలు విధించిన దాఖలాలు ఉండటం లేదు. రెండో అప్పిలేట్‌ అధికారి నుంచి కూడా కోరిన సమాచారం అందకపోతే హైకోర్టులో రిట్‌ వేయాలి. దరఖాస్తుదారులు ఖర్చుకు వెనకాడి హైకోర్టుకు వెళ్ళడంలేదు.

డాక్టర్‌ వి.రాజేంద్రప్రసాద్‌ (విశ్రాంత ప్రాంతీయ సంచాలకులు, ఏపీ పురపాలక శాఖ)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.