డిజిటల్ రథంపై అభివృద్ధి పథంలో...
ప్రస్తుత డిజిటల్ యుగంలో అన్ని రంగాల్లో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. మానవాళి జీవనాన్ని అది మరింత సులభతరం చేయడంతో పాటు ఆవిష్కరణల పరంగా సరికొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తోంది. సాంకేతిక విప్లవాన్ని మరింత సమర్థంగా అందిపుచ్చుకొని ఆర్థికాభివృద్ధి సాధించడానికి భారత్ కృషి చేయాలి.
ప్రస్తుత డిజిటల్ యుగంలో అన్ని రంగాల్లో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. మానవాళి జీవనాన్ని అది మరింత సులభతరం చేయడంతో పాటు ఆవిష్కరణల పరంగా సరికొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తోంది. సాంకేతిక విప్లవాన్ని మరింత సమర్థంగా అందిపుచ్చుకొని ఆర్థికాభివృద్ధి సాధించడానికి భారత్ కృషి చేయాలి.
భారత ఆర్థికాభివృద్ధిలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. కొన్నేళ్లుగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వేగవంతమైన పురోగతి వల్ల మానవుల జీవితాల్లో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆన్‌లైన్ అభ్యసనం, వర్చువల్ తరగతులు విద్యావకాశాలను విస్తృతం చేశాయి. నాణ్యమైన విద్యను అందుకోవడానికి సాంకేతికత వీలు కల్పిస్తోంది. తద్వారా అందరికీ సమాన అభ్యసన అవకాశాలకు అవసరమైన విద్యా వ్యవస్థకు అది బాటలు పరుస్తోంది. రాబోయే పదేళ్లలో 80శాతం ఉద్యోగాలకు విజ్ఞానశాస్త్రం, ఇంజినీరింగ్, గణితంలో నైపుణ్యాలు అవసరమని జాతీయ సైన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ప్రకారం సైన్స్, ఇంజినీరింగ్, సాంకేతికత విభాగాల్లో గ్రాడ్యుయేట్ల పరంగా విశ్వవ్యాప్తంగా భారత్ మూడో స్థానంలో నిలుస్తోంది. వీరిలో నైపుణ్యాలకు మరింతగా పదును పెట్టేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలి. 2025 నాటికి భారత జీడీపీలో ఐటీ పరిశ్రమ వాటా పది శాతానికి చేరుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ 5.9శాతం మేర వృద్ధి నమోదు చేస్తుందని, ఆ తరవాత అయిదేళ్లలో సగటున అది 6.1శాతం మేర ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది.
ఏఐ కలవరం
భారత్‌లో సాంకేతిక పురోగతికి ఆధార్, ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ), ఇతర వేదికలు చక్కని ఉదాహరణలు. ఇండియాను కాగితపు నగదు నుంచి డిజిటల్ పేమెంట్ల వైపు యూపీఐ తీసుకెళ్ళింది. ప్రస్తుతం కూరగాయల దుకాణాల నుంచి రేషన్ షాపుల దాకా అన్నిచోట్లా డిజిటల్ చెల్లింపులు సర్వసాధారణమయ్యాయి. ప్రజలు తమ విద్యా సంబంధ ధ్రువపత్రాలు, ఆధార్, పాన్ తదితర కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని డిజిటల్ రూపంలో సురక్షితంగా భద్రపరచుకోవడానికి డిజిలాకర్ ఉపయోగపడుతుంది. దీనిద్వారా నకిలీ ధ్రువపత్రాలను కట్టడి చేయవచ్చన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. సాంకేతికత సాయంతో వ్యక్తిగత సమావేశాలు వీడియో కాల్స్ వైపు మళ్ళుతున్నాయి. పెద్దసంఖ్యలో ఐటీ ఉద్యోగులు ఇళ్ల నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ ఇండియా ఆవిష్కరణ కోసం పెద్దయెత్తున పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఇటీవలి నివేదిక ప్రకారం భారత్‌లో 95శాతానికి పైగా ఐటీ విధానకర్తలు 2021తో పోలిస్తే డిజిటల్ సాంకేతికతపై మరింత ఖర్చు చేయాలని భావిస్తున్నారు. ఈ పెట్టుబడులు 2026 నాటికి దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలకు చేరతాయని అంచనా.
భారత అంతరిక్ష కార్యక్రమ చరిత్రలో ‘గగన్‌యాన్’ అత్యంత ప్రధానమైంది. దాని ద్వారా తొలిసారిగా మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించనున్నారు. చంద్రయాన్-3ను ఈ ఏడాదే ప్రయోగించడానికి కసరత్తు జరుగుతోంది. పునర్వినియోగ వాహన నౌకలు వంటి కొత్త సాంకేతికతల అభివృద్ధిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దృష్టి సారించింది. రిమోట్ సెన్సింగ్, నావిగేషన్, వాతావరణ అధ్యయనం తదితరాల్లో ఉపగ్రహ ఆధారిత సేవలను ఇస్రో అందిస్తోంది. భారత్‌లో 5జీ రంగప్రవేశంతోనూ రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీనివల్ల అంతర్జాల వేగం ఎన్నో రెట్లు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇటీవలి కాలంలో మన రోజువారీ జీవితంలో కృత్రిమ మేధ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ఆరోగ్య సేవలు, విద్య, ఆర్థికం తదితర రంగాల్లో రాబోయే రోజుల్లో ఏఐ నూతన అనువర్తనాలతో దూసుకెళ్ళనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఛాట్ జీపీటీ సైతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఐఏ వల్ల అందివచ్చే అవకాశాలు, దానివల్ల తలెత్తే విపరీత పరిణామాలపైనా ఎన్నో చర్చలు సాగుతున్నాయి. గూగుల్‌కు చెందిన ‘డీప్‌మైండ్ ఏఐ’ విభాగం సైన్స్, ఆరోగ్య పరిశోధనల్లో ఎంతగానో అక్కరకొచ్చే ఆవిష్కరణలతో దూసుకుపోతోంది. మనుషుల మాదిరిగా కోడ్‌ను రాసే ఏఐని డీప్‌మైండ్ పరిశోధకులు రూపొందించారు. ఏఐ సొంతంగా కోడ్ రాసుకోవడం, భాషను రూపొందించుకోవడం తలచుకుంటే ఒక వైపు ఆశ్చర్యంతో పాటు మరోవైపు ఆందోళన సైతం కలుగుతాయి. మానవుల పరిమితులు, వేగాన్ని ఏఐ అధిగమిస్తుంది. ఈ క్రమంలో ఏఐ వినియోగం పరంగా కొన్ని పరిమితులు అవసరమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ సైతం భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు తేనుంది.
సమధిక నిధులు
రాబోయే రోజుల్లో ఇప్పటిదాకా కనీవినీ ఎరగని మరెన్నో వినూత్న సాంకేతికతలు అందుబాటులోకి రానున్నాయి. ఇసుక బ్యాటరీలు, ఈ-స్కిన్, త్రీడీ ప్రింటెడ్ ఎముకలు, మెదడును చదివే రోబోలు, స్వేదంతో పనిచేసే స్మార్ట్ వాచ్‌లు, ప్రయోగశాలల్లో పెంచే ఆహారం తదితరాలు వాటిలో కొన్ని. ఇండియాలో సైన్స్, టెక్నాలజీలో రాణించాలనుకునే యువత పెద్ద సంఖ్యలో ఉంది. ఐటీ రంగంలో ఇండియా ఇప్పటికే ప్రపంచ అగ్రగామి. సాంకేతిక రంగంలో భారత్ గణనీయ పురోగతే సాధించింది. అయితే, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. దేశీయంగా నాణ్యమైన సాంకేతిక విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, మౌలిక వసతుల కల్పన, అధ్యాపక శిక్షణపై పాలకులు దృష్టి సారించాలి. అన్ని సాంకేతిక సంస్థలు, విశ్వవిద్యాలయాలకు సమధికంగా నిధులు కేటాయించాలి. పాఠశాల దశ నుంచే పిల్లలు శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు ఆకర్షితులయ్యేలా వారిలో ప్రేరణ కలిగించాలి. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరమూ ఉంది.
కర్బన ఉద్గారాల కట్టడి
కర్బన ఉద్గారాలు పుడమిని పెను ఇక్కట్లలోకి నెడుతున్న తరుణంలో హరిత ఇంధనాల ప్రాధాన్యం తెరపైకి వస్తోంది. ఈ క్రమంలో హరిత సాంకేతికతలు 2030 నాటికి 9.5 లక్షల కోట్ల డాలర్ల విపణిని సృష్టిస్తాయని వాణిజ్యం, అభివృద్ధిపై ఐరాస సదస్సు (యూఎన్‌సీటీఏడీ) ప్రచురించిన సాంకేతికత, ఆవిష్కరణల నివేదిక-2023 వెల్లడించింది. 2020తో పోలిస్తే ఇది 1.5 లక్షల కోట్ల డాలర్లు అదనం. తక్కువ కర్బన ఉద్గారాలతోనే వస్తువులను ఉత్పత్తి చేయడానికి, వాటి సరఫరాకు హరిత సాంకేతికతలు ఉపయోగపడతాయి. విద్యుత్తు వాహనాలు, సౌర, పవన విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్ తదితర హరిత సాంకేతికతల విపణి విలువ రాబోయే రోజుల్లో ఎన్నో రెట్లు పెరగనుంది. హరిత సాంకేతికతలు ప్రపంచ ఆర్థిక అసమానతలను మరింత పెంచే ప్రమాదం ఉందని యూఎన్‌సీటీఏడీ హెచ్చరించింది. దీన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
General News
odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
-
India News
Trains Cancelled: ఒడిశా రైలు ప్రమాదం.. 43కుపైగా రైళ్లు రద్దు..
-
India News
Odisha Train Tragedy: అంతా 20 నిమిషాల వ్యవధిలోనే.. నిద్రలోనే మృత్యుఒడిలోకి..!
-
India News
Ashwini Vaishnaw: రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
-
World News
అడవిలో.. పాపం పసివాళ్లు ఏమయ్యారో!
-
India News
Deemed University Status: డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు కొత్త నిబంధనలు