జీవన పోరాటంలో వలసబాట
ఆధునిక సమాజంలో వలసలు సర్వసాధారణంగా మారాయి. ఉన్నత చదువులు, మెరుగైన ఉపాధి అవకాశాలు, ఆకర్షణీయమైన జీతభత్యాలు ఆశిస్తూ ఎంతోమంది ఇతర రాష్ట్రాలు, విదేశాలకు తరలి వెళ్తున్నారు. అంతర్యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, కరవు బాధితులకూ వలసలు అనివార్యమవుతున్నాయి.
ఆధునిక సమాజంలో వలసలు సర్వసాధారణంగా మారాయి. ఉన్నత చదువులు, మెరుగైన ఉపాధి అవకాశాలు, ఆకర్షణీయమైన జీతభత్యాలు ఆశిస్తూ ఎంతోమంది ఇతర రాష్ట్రాలు, విదేశాలకు తరలి వెళ్తున్నారు. అంతర్యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, కరవు బాధితులకూ వలసలు అనివార్యమవుతున్నాయి.
వలస కార్మికులు, నిపుణులైన ఉద్యోగుల ఆదాయాలు మెరుగుపడిన తీరును తాజాగా ప్రపంచ అభివృద్ధి నివేదిక-2023 వివరించింది. ఈసారి ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఈ నివేదిక వలసలు, శరణార్థులు, సమాజాలపై దృష్టి సారించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్ళిన కార్మికులు సంపాదించిన మొత్తాన్ని తమ సొంత గడ్డ మీద ఉన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు పంపుతున్నారు. మన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత వృద్ధిరేటు ప్రకారం ఈ ఆదాయాలు భారీగానే ఉంటున్నాయి. అయితే, అధిక ఆదాయ ఆర్జన కోసం సంపన్న దేశాలకు వలస వెళ్తున్న తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులు తాము ఆశించిన మొత్తాన్ని సముపార్జించడానికి మరికొంతకాలం పట్టవచ్చని తేలింది.
ఉపాధి కరవై...
విదేశాల్లోని వలస కార్మికుల స్థితిగతులు, ఆదాయ పరిస్థితులపై ప్రపంచ అభివృద్ధి నివేదిక పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. భారత్-అమెరికా, భారత్-గల్ఫ్ సహకార సమాఖ్య, భారత్-బంగ్లాదేశ్ ప్రపంచంలోనే అత్యధికంగా వలసదారులు నివసిస్తున్న వలస కారిడార్లుగా పేరొందాయి. దీన్నిబట్టి ఈ దేశాల మధ్య కార్మికుల వలసలు ఏ స్థాయిలో ఉన్నాయనేది స్పష్టమవుతోంది. అదే సమయంలో అమెరికా-మెక్సికో, అమెరికా-చైనా, అమెరికా-ఫిలిప్పీన్స్, కజాక్‌స్థాన్-రష్యాలనూ అత్యధికంగా వలసలు కొనసాగే కారిడార్లుగా ఈ నివేదిక గుర్తించింది. భారీగా వలసలు నమోదవుతున్న భారత్, మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు చెందిన కార్మికులు విదేశాల్లో ఆర్జించి, తమ సొంత దేశాలకు పంపుతున్న మొత్తాలూ పెరుగుతున్నాయి. యూఏఈలో పని చేస్తున్న భారతీయ వలస కార్మికులు తమ సంపాదనలో దాదాపు 70శాతాన్ని కుటుంబ సభ్యులకు పంపుతున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది. దేశంలోనే ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారిలో 40శాతం ఆదాయ మెరుగుదల ఉండగా, విదేశాలకు వెళ్ళిన వారిలో 120 శాతం వృద్ధి ఉంటున్నట్లు వెల్లడైంది.
భారత్ విషయానికొస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గడం, పోటీ వాతావరణం, విదేశాల్లో భారీ జీతభత్యాలు వలసల్ని ప్రోత్సహిస్తున్నాయి. కరెన్సీ విలువ అధికంగా ఉండటం, సాఫ్ట్‌వేర్ నిపుణులకు అమెరికా వంటి దేశాల్లో భారీగా డిమాండ్ పెరగడంతో మనదేశం నుంచి వలసలు అధికమయ్యాయి. అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ నిపుణుల్లో అత్యధిక శాతం భారత్‌కు చెందినవారే. తెలుగు రాష్ట్రాల్లోని భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల్లో ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. గనులు-క్వారీలు, గ్రానైట్ కోత, పాలిషింగ్ పరిశ్రమల్లో తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ కార్మికులు, హోటళ్లు, రెస్టారెంట్‌లలో ఒడిశా, బిహార్ రాష్ట్రాలకు చెందినవారే అత్యధికంగా పనిచేస్తున్నారు. పెరిగిన వలసలతో పాటే ఆయా ప్రాంతాలకు తరలి వెళ్ళేందుకు అయ్యే వ్యయమూ అంతకంతకూ అధికమవుతోంది. ఒక భారతీయ కార్మికుడు ఖతార్‌కు వెళ్ళాలంటే రెండు నెలల వేతనంతో సమానమైన వ్యయాన్ని భరించాల్సి వస్తోంది. విదేశాలకు కార్మికుల వలసలు అధికంగా ఉన్న దేశాల్లోని కొన్ని ప్రాంతాల నుంచి దేశీయంగానూ అంతర్గత వలసలు భారీగా నమోదవుతున్నాయి. కోల్‌కతాకు చెందిన కార్మికులు ఉపాధి అవకాశాల కోసం కేరళలో స్థిరపడటమే దీనికి ఉదాహరణగా ఈ నివేదిక ప్రత్యేకంగా పేర్కొంది.
విదేశాలకు వలస వెళ్తున్నవారిని ప్రపంచ అభివృద్ధి నివేదిక నాలుగు రకాలుగా విభజించింది. అమెరికాలోని భారతీయ ఐటీ సిబ్బంది, గల్ఫ్ సహకార సమాఖ్య దేశాల్లోని నిర్మాణ రంగ నిపుణులను అత్యధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులుగా ఆ నివేదిక పేర్కొంది. తుర్కియేలోని సిరియన్ శరణార్థులను లక్షిత దేశాల్లో అవసరమైన నైపుణ్యాలు కలిగినవారిగా చెప్పింది. అమెరికా దక్షిణ సరిహద్దుల్లో తక్కువ నైపుణ్యం కలిగినవారిని బాధిత వలస కార్మికులుగా విశ్లేషించింది. బంగ్లాదేశ్‌లోని రోహింగ్యాలు వంటి వారిని శరణార్థులుగా అభివర్ణించింది.
నైపుణ్యాలు కీలకం
నిపుణులైన ఉద్యోగులు, కార్మికులకు ఉపాధి అవకాశాలు దండిగా ఉండటం, ఆదాయార్జనను మెరుగు పరచుకునే పరిస్థితుల వల్ల ఏటా విదేశాలకు వలసలు పెరుగుతున్నాయి. తాజా ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం వివిధ దేశాల్లో వృద్ధాప్యం, అల్పసంతానోత్పత్తి రేటు సమస్యలు వలసలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. వాటిని సరిగ్గా పరిష్కరించుకున్నట్లయితే వలస కార్మికులు, ఔత్సాహిక నిపుణులైన ఉద్యోగార్థులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగార్థులు తాము ఆశిస్తున్న లక్షిత దేశాల్లోని సంబంధిత యాజమాన్యాల అవసరాలకు తగినట్లుగా వృత్తి పరమైన సాంకేతిక, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలి. ఏయే రంగాల్లో స్థిరపడాలని భావిస్తున్నారో, వాటికి సంబంధించిన ప్రతిభా పాటవాలను సముపార్జించుకొని, సంసిద్ధులై ఉండాలి. దానివల్ల అందివచ్చే ప్రతి అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకోవచ్చు. ఈ క్రమంలో యువత రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కన్సల్టెన్సీ కంపెనీల మాయాజాలంలో పడి మోసపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.
భారీగా నిర్వాసితులు
ప్రపంచవ్యాప్తంగా గతేడాది సాయుధ సంఘర్షణలు, ప్రకృతి విపత్తుల మూలంగా ఆయా దేశాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన ప్రజల సంఖ్య సుమారు 7.1 కోట్లుగా తేలింది. ఈ మేరకు నార్వే శరణార్థుల మండలికి చెందిన అంతర్గత నిర్వాసితుల పర్యవేక్షణ కేంద్రం ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. వారిలో సాయుధ సంఘర్షణ వల్ల నిర్వాసితులైనవారే 6.2 కోట్లమంది ఉన్నారు. వరదలు, కరవు బాధితులు 87 లక్షలు. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నిర్వాసితులైన వారి సంఖ్య 2021 కన్నా 2022లో పెరిగింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల 2022 చివరి నాటికి 59 లక్షల మంది నిర్వాసితులై తమ స్వదేశంలోనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అదేవిధంగా గడచిన పదేళ్లుగా కొనసాగుతున్న సిరియా అంతర్యుద్ధం మూలంగా 68 లక్షల మంది నిర్వాసితులయ్యారు.
డాక్టర్ జీవీఎల్ విజయ్‌కుమార్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!
-
Crime News
Crime News: కార్ ట్రావెల్స్ పెట్టాలన్న కోరికే డ్రైవర్ కొంపముంచింది
-
Movies News
ఆ సినిమా చూసి నా భార్య నన్ను తిట్టింది: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ నటుడు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/05/2023)