పర్యావరణంపై వేటు... భవితకు కాటు!

ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 2001-10 దశకంతో పోలిస్తే 2011-20 మధ్య గ్రీన్‌లాండ్‌, అంటార్కిటికాల్లో 38శాతం అధికంగా మంచు కరిగినట్లు తాజా నివేదికలో పేర్కొంది.

Published : 07 Dec 2023 00:07 IST

ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 2001-10 దశకంతో పోలిస్తే 2011-20 మధ్య గ్రీన్‌లాండ్‌, అంటార్కిటికాల్లో 38శాతం అధికంగా మంచు కరిగినట్లు తాజా నివేదికలో పేర్కొంది. మానవ ప్రేరేపిత వాతావరణ మార్పులవల్ల వడగాలులు, తుపానులు అధికంగా చోటు చేసుకుని తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్లు అది విశ్లేషించింది.

జీవరాశి మనుగడకు సామాజిక-పర్యావరణ వ్యవస్థలు ఎంతో కీలకం. వాటికి ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. లేనిపక్షంలో పర్యావరణం పెను మార్పులకు లోనవుతుంది. ఏదైనా సామాజిక-పర్యావరణ వ్యవస్థ సమస్యలను తట్టుకోలేక తన విధులను సక్రమంగా నిర్వర్తించలేని స్థితికి చేరుకొంటే- దాన్ని ‘రిస్క్‌ టిప్పింగ్‌ పాయింట్‌’గా పేర్కొంటారు. ఇటువంటి స్థితికి చేరుకున్న వ్యవస్థలు విపత్తులకు గురికావడం గణనీయంగా పెరుగుతుంది. రిస్క్‌ టిప్పింగ్‌ పాయింట్‌ ఏదో ఒక వ్యవస్థకు మాత్రమే పరిమితమవ్వదు. ఒక వ్యవస్థ దెబ్బతింటే, దానితో సంబంధమున్న ఇతర వ్యవస్థలూ క్రమంగా ప్రభావితమవుతాయి. అలా ఆవరణ వ్యవస్థతో పాటు శీతోష్ణస్థితి, సమాజం, సాంకేతిక తదితర వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. వ్యవస్థల్లో మొదట గుర్తించలేనంత నెమ్మదిగా మార్పులు చోటుచేసుకుని, క్రమంగా అస్థిరతకు, భరించలేని దశకు చేరుకుంటాయి. ఆ క్రమంలోనే కీలక పరిణామాలు చోటుచేసుకోవడమో, వ్యవస్థ కుప్పకూలిపోవడమో జరుగుతుంది.

తరుగుతున్న నీటి లభ్యత

భూతాపం వల్ల ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు మునుపటి కంటే ఇప్పుడు మరింత వేగంగా కరిగిపోతున్నాయి. హిమానీ నదాలు పెద్దమొత్తంలో నీటిని నిల్వచేస్తాయి. కరిగిన నీరు స్థానిక ఆవరణ వ్యవస్థలకు, తాగునీటి అవసరాలకు, వ్యవసాయానికి, విద్యుదుత్పత్తికి ఉపయోగపడుతుంది. హిమానీ నదాలు రిస్క్‌ టిప్పింగ్‌ పాయింట్‌ను చేరడంవల్ల వాటి నుంచి నీరు పెద్దయెత్తున విడుదల అవుతుంది. ‘పీక్‌ వాటర్‌’ దశగా పేర్కొనే ఆ స్థితికి చేరిన తరవాత తాగునీటి లభ్యత క్రమంగా తగ్గిపోతుంది. మధ్య ఐరోపా, పశ్చిమ కెనడా, దక్షిణ అమెరికాల్లోని అనేక చిన్నస్థాయి హిమానీ నదాలు ఇప్పటికే పీక్‌ వాటర్‌ దశకు చేరాయి. వచ్చే పదేళ్లలో మరిన్ని ఆ స్థితికి చేరతాయంటున్నారు. ప్రస్తుతం హిమాలయాలు, కారకోరం, హిందుకుష్‌ పర్వతాల్లోని 90వేల పైచిలుకు హిమానీ నదాలు టిప్పింగ్‌ పాయింట్‌ను చేరే ముప్పును ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో నివసించే 87కోట్ల మంది ప్రజల జీవనం ప్రమాదంలో పడనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచంలో 200 కోట్ల జనాభా తాగునీటి అవసరాలు తీర్చడానికి భూగర్భ జలధారలే (అక్విఫర్‌లు) ఆధారం. ఉపరితల జలవనరుల లభ్యత తగ్గిపోతుండటంతో భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తున్నారు. ఇందులో 70శాతం వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. ప్రపంచ అక్విఫర్లలో సగానికిపైగా సహజమైన రీతిలో మళ్ళీ భర్తీచేయలేని విధంగా తరిగిపోతున్నాయి. ఇవన్నీ కుప్పకూలే స్థితికి చేరుకుంటున్నాయని ఐరాస విశ్వవిద్యాలయం- పర్యావరణ, మానవ భద్రతా సంస్థల ‘విపత్తు ప్రమాదాల నివేదిక-2023’ హెచ్చరించింది. సౌదీ అరేబియా వంటి దేశాలు భూగర్భ జలాల విషయంలో టిప్పింగ్‌ పాయింట్‌ను చేరుకొన్నాయి. సౌదీ అరేబియా 1990ల మధ్యకాలంలో గోధుమ ఎగుమతుల్లో ప్రపంచంలో ఆరో స్థానాన్ని ఆక్రమించింది. గోధుమలను పండించడం కోసం పెద్దమొత్తంలో నీటిని వెలికితీయడంవల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దాంతో ఆ దేశం మళ్ళీ గోధుమ దిగుమతులకు మళ్ళింది. భారత్‌ సహా మరికొన్ని దేశాలు భూగర్భ జలాల విషయంలో టిప్పింగ్‌ పాయింట్‌కు చేరువవుతున్నాయని ఆ నివేదిక విశ్లేషించింది.సహజ వనరులు, భూ వినియోగంలో మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, గాడి తప్పుతున్న వాతావరణ పరిస్థితులవల్ల అనేక జాతులు త్వరితగతిన అంతరించిపోతున్నాయి. ఒక జాతి అంతరించిపోతే, దానిపై ఆధారపడి ఉండే మిగతా జాతులూ కనుమరుగవుతాయి. ఆగ్నేయ అమెరికాలో నివసించే గోఫర్‌ తాబేళ్లు చేసే బొరియలను 350కి పైగా ఇతర జాతులు సంతానోత్పత్తికి, శత్రు జీవుల నుంచి కాపాడుకోవడానికి, తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి రక్షణ పొందడానికి ఉపయోగించుకుంటాయి. ఒకవేళ గోఫర్‌ తాబేలు జాతి అంతరించిపోతే- అవి ఏర్పరచే బొరియల్లో నివసించే డస్కీ గోఫర్‌ కప్పజాతి సైతం అంతరిస్తుంది. ఆ కప్పలు తినే కీటకాలు వృద్ధిచెంది అక్కడి అడవులను నాశనం చేసే ప్రమాదముంది. అందుకే, గోఫర్‌ తాబేళ్లకు చట్టప్రకారం రక్షణ కల్పించారు.

పెరుగుతున్న వేడిమి

పెరుగుతున్న వేడిమివల్ల గత రెండు దశాబ్దాలలో ఏటా సగటున అయిదు లక్షల మంది అదనంగా మరణించారు. వీరిలో వృద్ధులు, రోగులు, ప్రమాదకరమైన వృత్తిపనులు చేసేవారే ఎక్కువ! ఇక్కడి టిప్పింగ్‌ పాయింట్‌ను ‘వెట్‌-బల్బ్‌ టెంపరేచర్‌’ అని పిలుస్తారు. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్‌ దాటినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. పర్షియన్‌ గల్ఫ్‌, సింధూ నదీ పరీవాహక ప్రాంతాలు వెట్‌-బల్బ్‌ టెంపరేచర్‌ను అధిగమించాయి. 2070నాటికి దక్షిణ, మధ్య ఆసియాల్లోని కొన్ని ప్రాంతాలు టిప్పింగ్‌ పాయింట్‌ను దాటతాయని, 2100 నాటికి 70శాతానికి పైగా ప్రపంచ జనాభా ఏటా కనీసం 20రోజులు భయంకరమైన వేడిమిని ఎదుర్కోవలసి వస్తుందని ఐరాస నివేదిక హెచ్చరించింది. 1970లతో పోలిస్తే ఇప్పుడు వాతావరణ సంబంధ విపత్తులు, వాటివల్ల కలిగే నష్టాలు ఏడు రెట్లు పెరిగాయి. బీమా చెల్లింపులు జరపలేక కొన్ని సంస్థలు మార్కెట్‌ నుంచి వైదొలిగాయి. మరికొన్ని సంస్థలు కొన్నిరకాల నష్టాలకే బీమాను వర్తింపజేస్తున్నాయి. దాంతో ఆపద సమయంలో ప్రజలకు ఆర్థిక భద్రత లేకుండా పోతోంది. మితిమీరిన మానవ చర్యలను కట్టడి చేయడం ద్వారా సామాజిక-పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవచ్చు. అందుకు ప్రభుత్వాలే కాదు, ప్రజలు సైతం పర్యావరణహితకర విధానాలనే అనుసరించాలి!


అడుగంటుతున్న భూగర్భ జలాలు

సామాజిక ఆవిష్కరణ కేంద్రం అధ్యయనం ప్రకారం, భారత్‌లో 70కోట్ల మంది గ్రామీణుల తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తున్నది భూగర్భ జలాలే. పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకూ ఈ నీటిని అధికంగా వినియోగిస్తున్నారు. భూగర్భ జలాల వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న ఇండియా- నీటి నాణ్యత విషయంలో మాత్రం 122 దేశాల జాబితాలో 120వ స్థానంలో నిలుస్తోంది! భారత వాణిజ్య ప్రోత్సాహక మండలి నివేదిక ప్రకారం, భూగర్భ జలాలను వినియోగించే ప్యాకేజ్డ్‌ మంచినీటి మార్కెట్‌ విలువే దాదాపు అయిదు లక్షల కోట్ల రూపాయలు. దేశంలో సీసాల్లో మంచినీటిని నింపే పాంట్లలో సగానికిపైగా దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. చెన్నైలో ఉన్న సుమారు 600 బాట్లింగ్‌ కంపెనీల కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోయి పంటలు పండటంలేదని అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు.


ఎం.రామ్‌మోహన్‌
(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు