నవీకరణతో ఆత్మనిర్భరత

కేంద్రం 2024-25 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.6,21,540 కోట్లు కేటాయించింది. అంటే ఈసారి పద్దులో 13.04శాతాన్ని దేశ రక్షణ కోసం వెచ్చించనున్నట్లు చెబుతున్నారు.

Published : 12 Feb 2024 00:44 IST

కేంద్రం 2024-25 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.6,21,540 కోట్లు కేటాయించింది. అంటే ఈసారి పద్దులో 13.04శాతాన్ని దేశ రక్షణ కోసం వెచ్చించనున్నట్లు చెబుతున్నారు. చైనా నుంచి ముప్పు పెరుగుతున్న తరుణంలో రక్షణ దళాల ఆధునికీకరణతో పాటు స్వావలంబన సాధించడానికి, ఆయుధ ఎగుమతులను పెంచడానికి ఈ నిధులను ఉద్దేశించామంటున్నారు.

రిహద్దుల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశ రక్షణను పటిష్ఠం చేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ రంగానికి బడ్జెట్‌లో అధిక కేటాయింపు చూపింది. 2024-25 రక్షణ కేటాయింపులు 2023-24 కన్నా 4.72శాతం, 2022-23 కన్నా 18.35 శాతం అధికం. ఈ డిఫెన్స్‌ కేటాయింపులను నాలుగు విభాగాల్లో ఖర్చు చేస్తామంటున్నారు. రక్షణశాఖ పరిధిలోని పౌర సంస్థలకు 4.11శాతం, ఆయుధాలు, మందుగుండు నిల్వల నిర్వహణకు 14.82శాతం, కొత్త ఆయుధాల సేకరణకు 27.67శాతం... రక్షణ సిబ్బంది జీతభత్యాలకు 30.68 శాతం, పింఛన్లకు 22.72 శాతం వెచ్చిస్తామంటున్నారు. 2023-24 బడ్జెట్‌తో పోలిస్తే తాజా పద్దులో సాయుధ దళాల ఆధునికీకరణకు పెట్టుబడి వ్యయాన్ని పెంచారు. 2023-24 రక్షణ బడ్జెట్‌లో ఇందుకు రూ.1.62లక్షల కోట్లు కేటాయించారు. 2024-25లో దీన్ని 6.2శాతం పెంచి రూ.1.72 లక్షల కోట్లు ప్రత్యేకించారు. యుద్ధ విమానాలు, విమాన ఇంజిన్ల సేకరణకు రూ.40,772 కోట్లు, ఇతర సామగ్రి కొనుగోలుకు రూ.62,343 కోట్లు కేటాయింపులు చూపారు. నౌకా దళానికి రూ.23,800 కోట్లు, నౌకా నిర్మాణ, మరమ్మతు కేంద్రాలకు రూ.6,830 కోట్లు ప్రకటించారు. 2024-25 బడ్జెట్‌లో కొత్త విమానాలు, నౌకలు, ఆయుధాల సేకరణకు దీర్ఘకాలిక ప్రణాళిక కింద కేటాయింపులు చేపట్టారు. జలాంతర్గాములు, 4.5వ తరానికి చెందిన యుద్ధ విమానాలు, ప్రెడేటర్‌ డ్రోన్ల సేకరణకు ఈ నిధులను వెచ్చిస్తామంటున్నారు.

ఉద్రిక్తతల నేపథ్యంలో...

తాజా రక్షణ బడ్జెట్‌లో మొత్తం రెవిన్యూ వ్యయం రూ.4,39,300 కోట్లుగా లెక్కతేలింది. అందులో రూ.1,41,205 కోట్లను పింఛన్ల కోసం, రూ.2,82,772 కోట్లను సాయుధ దళాల జీతభత్యాలకు, రూ.15,322 కోట్లను రక్షణ శాఖ కిందనున్న పౌర సంస్థలకు కేటాయిస్తారని చెబుతున్నారు. భారత సైన్య రెవిన్యూ వ్యయం రూ.1,92,680 కోట్లు. నౌకా దళానిది రూ.32,778 కోట్లు, వాయుసేనది రూ.46,223 కోట్లు. విమానాలు, నౌకలు, సైన్య ఆయుధ నిల్వల నిర్వహణ, విడిభాగాలు, మరమ్మతులపై ఖర్చు కూడా రెవిన్యూ వ్యయం కిందకే వస్తాయి. సరిహద్దుల్లో సాయుధ దళాల నియోగానికి అయ్యే ఖర్చు సైతం ఇందులోనే కలిసి ఉంటుంది. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ రెవిన్యూ వ్యయం నిరుటి బడ్జెట్‌ కన్నా పెరిగింది.

చైనాతో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నందువల్ల- ఒకవేళ యుద్ధం వస్తే సర్వసన్నద్ధంగా ఉండటానికి వీలుగా రహదారులు, వంతెనల వంటి మౌలిక వసతులు ఆవశ్యకం. అందుకే సరిహద్దు రహదారి నిర్మాణ సంస్థకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.6,500 కోట్ల కేటాయింపులు చూపారు. ఇది 2021-22కన్నా 160శాతం, 2023-24కన్నా 30శాతం అధికం. లద్దాఖ్‌లో 13,700 అడుగుల ఎత్తున విమానాలు దిగడానికి న్యోమా ఎయిర్‌ ఫీల్డ్‌ను, అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో దక్షిణాగ్రాన ఉన్న పంచాయతీకి వంతెనను నిర్మించదలచారు. వీటితో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌లో షింకు లా సొరంగం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో నెచిఫు సొరంగ నిర్మాణానికి నిధులు వెచ్చించనున్నట్లు చెబుతున్నారు. భారతీయ తీర రక్షక దళానికి (కోస్ట్‌ గార్డ్‌కు) తాజాగా రూ.7,651 కోట్లు కేటాయింపులు చూపారు. ఇది 2023-24 బడ్జెట్‌లో ఇచ్చిన మొత్తం కంటే 6.31శాతం ఎక్కువ. ఈ నిధుల్లో అత్యధిక భాగాన్ని అత్యంత వేగవంతమైన పహరా బోట్లు, ఆధునిక ఎలెక్ట్రానిక్‌ నిఘా వ్యవస్థలను సమకూర్చుకోవడానికి, ఆయుధాల కొనుగోలుకు ఖర్చు చేస్తామంటున్నారు. సముద్రంలో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి, ఇతర దేశాలకు మానవతా దృష్టితో చేసే సహాయానికి కోస్ట్‌గార్డ్‌ను సన్నద్ధం చేయాలని లక్షించారు.

పెరుగుతున్న వ్యయం

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కు 2023-24లో రూ.23,263 కోట్లు కేటాయించారు. 2024-25లో దాన్ని రూ.23,855 కోట్లకు పెంచి చూపారు. ఇందులో రూ.13,208 కోట్లను డీఆర్‌డీఓ కొత్త సాంకేతికతల అభివృద్ధికి, ప్రైవేటు సంస్థలతో కలిసి అభివృద్ధి-ఉత్పత్తి కార్యక్రమాలు చేపట్టడానికి వెచ్చిస్తామని చెబుతున్నారు. డీఆర్‌డీఓతో కలిసి కొత్త అంకురాలు, చిన్న తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లు, విద్యాసంస్థలు రక్షణ రంగంలో నవీకరణ సాధించడానికి వీలుగా రూ.60 కోట్ల సాంకేతిక అభివృద్ధి నిధిని (టీడీఎఫ్‌ను) ఏర్పరచారు. 2020 నుంచి అమెరికా, చైనాల తరవాత రక్షణపై అత్యధిక వ్యయం చేస్తున్నది భారతదేశమే. ఇండియా రక్షణ వ్యయం 2018 నుంచే పెరుగుతోందని స్టాక్‌ హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) వెల్లడించింది. 2030కల్లా రక్షణ రంగంపై అమెరికా వ్యయం 97,700 కోట్ల డాలర్లకు, చైనా వ్యయం 53,100 కోట్ల డాలర్లకు, భారత్‌ వ్యయం 18,300 కోట్ల డాలర్లకు చేరుతుందన్నది లోలీ ఇన్‌స్టిట్యూట్‌ ఆసియా శాఖ అంచనా. భారత రక్షణ వ్యయంతో పోలిస్తే చైనా ఇందుకు ఖర్చు చేస్తున్న మొత్తం చాలా ఎక్కువనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ తన రక్షణ వ్యయాన్ని మరింతగా పెంచి సాయుధ బలగాలను వేగంగా ఆధునికీకరించాలి. కొత్త సాంకేతికతలతో స్వావలంబన సాధించి చైనా దూకుడును సమర్థంగా ఎదుర్కోవాలి. 2024-25 బడ్జెట్‌ ఈ దిశగా ముఖ్యమైన అడుగులు వేసింది. ప్రైవేటు సంస్థలకు ఆయుధ ఉత్పత్తిలో భాగస్వామ్యం కల్పించడంతో పాటు విదేశీ ఆయుధ ఎగుమతిదారులు భారత గడ్డపైనే ఉత్పత్తి చేపట్టేలా చర్యలు తీసుకోవడంవల్ల స్వదేశంలో రక్షణ పరిశ్రమలు పురోగమించనున్నాయి. ‘అగ్నిపథ్‌’ పథకంవల్ల పింఛన్ల భారం తగ్గుతుంది. అలా ఆదా అయ్యే నిధులను ఆధునికీకరణకు వెచ్చించవచ్చు.


పన్ను రాయితీలతో దన్ను

భారత సాయుధ బలగాలు 2020 నుంచి ఆత్మనిర్భర పథంలో పురోగమిస్తున్నాయి. తదనుగుణంగా రక్షణపరంగా పెట్టుబడి వ్యయాన్ని పెంచుతూ వస్తున్నారు. కృత్రిమ మేధ, ఏరోస్పేస్‌ వంటి అధునాతన సాంకేతికతల అభివృద్ధి కోసం టెక్‌ కంపెనీలకు దీర్ఘకాల రుణాలివ్వడానికి, ఈ రంగాల్లో అంకుర సంస్థలకు పన్ను రాయితీలు కల్పించడానికి తాజా బడ్జెట్‌లో లక్ష కోట్ల రూపాయలను కేటాయించడం విశేషం. దీనివల్ల హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, అశోక్‌ లేలాండ్‌, జెన్‌ టెక్నాలజీస్‌, మజగావ్‌ డాక్‌ నౌకా నిర్మాణ సంస్థల వంటివాటికి గొప్ప ఊతం లభిస్తుంది. తద్వారా అత్యాధునిక రక్షణ సాంకేతికతలను ఇండియా సమకూర్చుకోవడమే కాకుండా, ఆయా విభాగాల్లో కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.