సత్వర న్యాయానికి అవరోధాలెన్నో!

ప్రస్తుతం భారత న్యాయవ్యవస్థ అన్ని వైపుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కేసులు కొండల్లా పేరుకుపోతున్నాయని, కోర్టులు సత్వర పరిష్కారం చూపలేకపోతున్నాయనే ఆరోపణలున్నాయి. న్యాయమూర్తుల నియామకం ఏకపక్షంగా సాగుతోందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వెలుపల ఉన్నవారే కాకుండా, సర్కారు వ్యవస్థలోని వారూ విమర్శల బాణాలను ఎక్కుపెడుతున్నారు.

Published : 29 Feb 2024 00:54 IST

ప్రస్తుతం భారత న్యాయవ్యవస్థ అన్ని వైపుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కేసులు కొండల్లా పేరుకుపోతున్నాయని, కోర్టులు సత్వర పరిష్కారం చూపలేకపోతున్నాయనే ఆరోపణలున్నాయి. న్యాయమూర్తుల నియామకం ఏకపక్షంగా సాగుతోందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వెలుపల ఉన్నవారే కాకుండా, సర్కారు వ్యవస్థలోని వారూ విమర్శల బాణాలను ఎక్కుపెడుతున్నారు.

శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు అదుపు తప్పి వ్యవహరించకుండా కట్టడి చేయడానికి రాజ్యాంగ నిర్మాతలు సుప్రీంకోర్టు, హైకోర్టులకు విశిష్ట అధికారాలను కట్టబెట్టారు. నిరంకుశ, విచ్ఛిన్నకర ధోరణులను అరికట్టడానికి డాక్టర్‌ అంబేడ్కర్‌, ఇతర రాజ్యాంగ కర్తలు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. రాజ్యాంగానికి, దేశ చట్టాలకు అంతిమ భాష్యం చెప్పే అధికారాన్ని సర్వోన్నత న్యాయస్థానానికే కట్టబెట్టారు. 141, 142 రాజ్యాంగ అధికరణలు ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నాయి. పౌర, న్యాయవ్యవస్థల అధికారులు సుప్రీంకోర్టుకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని 144వ అధికరణ నిర్దేశిస్తోంది. రాజ్యాంగ మౌలిక చట్రంలో న్యాయవ్యవస్థ విడదీయరాని అంతర్భాగమని, న్యాయవ్యవస్థను మార్చే అధికారం పార్లమెంటుకు లేదని రాజ్యాంగ నిర్మాతలు స్పష్టం చేశారు.

మౌలిక వసతుల కొరత

అపరిష్కృత కేసులు గుట్టలుగా పేరుకుపోవడాన్ని కారణంగా చూపుతూ న్యాయవ్యవస్థను విమర్శించేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే, ఈ పెండింగ్‌ కేసుల్లో అత్యధికం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చలవేనన్న సంగతి మరవకూడదు. కేంద్రం, రాష్ట్రాలు దాఖలు చేసే కేసుల్లో 40శాతం అనవసరమైనవేనని నిరుడు ఆగస్టులో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తికి పొరపాటున నెలకు రూ.700 చొప్పున ఎక్కువ చెల్లించామంటూ దాన్ని తిరిగి రాబట్టడానికి ప్రభుత్వం అపార వ్యయంతో ఏళ్ళ తరబడి వ్యాజ్యం నడపడాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వపరంగా వ్యాజ్యాలను తగ్గించడానికి జాతీయ వ్యాజ్య విధానాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం 2010లోనే హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. తరవాత 2015లో మరోసారి జాతీయ వ్యాజ్య విధానం తీసుకొస్తామని చెప్పినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. 2017లో ప్రభుత్వ వ్యాజ్యాలను తగ్గించే కార్యాచరణ ప్రణాళిక రాబోతోందంటూ వినిపించినా కార్యాచరణ కరవైంది. ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, దేశ ఆర్థిక పురోగమనం, న్యాయ ప్రక్రియపై అవగాహన పెరగడం వంటి కారణాల వల్ల కోర్టు గుమ్మం తొక్కేవారు ఎక్కువయ్యారు. మరోవైపు, సత్వర న్యాయ సాధన ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ వ్యవస్థల నుంచే న్యాయవ్యవస్థకు అవరోధాలు ఎదురవుతున్నాయనే విమర్శలూ ఉన్నాయి. దీనివల్ల న్యాయవ్యవస్థ బలహీనపడే ప్రమాదముంది. కార్యనిర్వహణ సౌలభ్యం పేరుతో సుప్రీంకోర్టు ధర్మాసనాల సంఖ్యను నాలుగుకు పరిమితం చేయాలనే ప్రతిపాదనలున్నాయి. అయితే, న్యాయస్థానాల్లో ఖాళీపోస్టులను నింపకపోవడం, మౌలిక వసతులను కల్పించకపోవడమే అసలు సమస్య అనే సంగతిని విస్మరించకూడదు. మండల స్థాయి నుంచే కోర్టులకు సరైన భవనాలు లేవు, తగినంతమంది సిబ్బందీ లేరు. దిగువ స్థాయిలో కోర్టు భవనాలను తగినంత విస్తీర్ణంలో నిర్మించడం లేదు, కనీస సౌకర్యాలనూ కల్పించడం లేదు. కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి దశాబ్దం క్రితమే అనుమతి ఇచ్చినా అవి ఇంకా ప్రారంభం కాలేదు. కొన్నయితే ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. ముంబయి మహానగరంలోనూ కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయాల్సి వచ్చిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చాలా కోర్టుల ప్రాంగణాల్లో తాగునీరు, మరుగు దొడ్లు వంటి సదుపాయాలు లేవు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కూర్చుని పని చేసుకోవడానికి, కక్షిదారులు వేచి ఉండటానికి గదులు కూడా సక్రమంగా ఉండని పరిస్థితి నెలకొంటోంది.

అంతులేని ప్రక్రియ

న్యాయం చేయడమే కాదు, చేస్తున్నట్లు కనిపించడమూ ముఖ్యమేనని బ్రిటిష్‌ న్యాయమూర్తి లార్డ్‌ హెవార్ట్‌ 1924లో చేసిన వ్యాఖ్య సదా స్మరణీయం. ఇటీవలి కాలంలో 32వ రాజ్యాంగ అధికరణ కింద వేగంగా విచారించాల్సిన కేసుల్లోనూ హైకోర్టులకు వెళ్ళాలంటూ సుప్రీం ధర్మాసనాలు సూచిస్తున్నాయి. హైకోర్టులు కూడా కేసులను శీఘ్రంగా పరిష్కరించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కక్షిదారులకు చెబుతున్నాయి. దీంతో ఉన్నత న్యాయస్థానాలు తమకు న్యాయం చేయడం లేదనే అసంతృప్తి ప్రజల్లో కొంతమేర నెలకొంటోందనే అభిప్రాయాలున్నాయి. 32, 226 రాజ్యాంగ అధికరణలు కట్టబెట్టిన అధికారాలతో సుప్రీంకోర్టు ఆత్యయిక పరిస్థితిలో పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడింది. అందుకే సుప్రీంకోర్టు, హైకోర్టులను పౌర హక్కుల సంరక్షకులుగా పరిగణిస్తారు. కక్షిదారులకు న్యాయం జరగడమనేది అంతూపొంతూలేని ప్రక్రియగా మారుతోంది. ఇదే శిక్షగా పరిణమిస్తోంది. మరోవైపు, ప్రభుత్వం ఈ మధ్య ట్రైబ్యునళ్ల పేరిట న్యాయవ్యవస్థ అధికారాలకు కత్తెర వేయాలని చూస్తోంది. ట్రైబ్యునళ్లలో సభ్యులను నియమించే అధికారం ప్రభుత్వ వ్యవస్థకే ఉంటుందని ఇక్కడ గమనించాలి. చట్టాలు, న్యాయప్రక్రియ గురించి ఏమాత్రం అవగాహన లేనివారిని ఈ పదవుల్లో నియమించే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన భూయాజమాన్య చట్టం ట్రైబ్యునళ్ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తోంది. వాటి సభ్యులు న్యాయమూర్తులు కానవసరం లేదు. మాజీ ప్రభుత్వాధికారులను, రాజకీయ అంతేవాసులను ఈ పదవుల్లో నియమించవచ్చు. న్యాయ సాధన పనిని ఇతర రంగాలకు చెందిన వ్యక్తులకు అప్పగించడమంటే, వైద్యుడు చేయాల్సిన పనిని ఇంజినీరుకు అప్పగించడమే! మరోవైపు, కేసులను విచారించి, తీర్పు చెప్పే ముందు న్యాయమూర్తులు చాలా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. గత తీర్పులను పునఃపరిశీలించాల్సి ఉంటుంది. న్యాయమూర్తులకు కేసుల అధ్యయనానికి విరామం అవసరం. ఏకధాటిగా కేసులు విచారించి పుంఖానుపుంఖంగా తీర్పులు వెలువరించడమనేది అవాంఛనీయం. అది ఆచరణ సాధ్యం కూడా కాదు. ఆదరాబాదరా విచారణతో సక్రమ న్యాయమూ జరగదు. మౌలిక సదుపాయాల కల్పన, ఖాళీల భర్తీ తదితర చర్యల ద్వారా న్యాయప్రక్రియ వేగంగా సాగేలా చూడాల్సిన అవసరం ఉంది.


ఖాళీల భర్తీ

న్యాయస్థానాలలో ఖాళీలు భర్తీ కాకపోవడం పెండింగు కేసులు పెరిగిపోవడానికి కారణమవుతోంది. జిల్లా, సబార్డినేట్‌ కోర్టులకు మంజూరు చేసిన జడ్జీల పదవుల్లో 20శాతం (5,338) ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం 2023 జులై 27న రాజ్యసభకు తెలిపింది. హైకోర్టులకు 1,114 న్యాయమూర్తి పదవులను మంజూరు చేయగా, వాస్తవంలో 767 మందినే నియమించారని నిరుడు నవంబరులో మరో నివేదిక వెల్లడించింది. ఇది సుమారు 25శాతం కొరత. ఇలాంటి పరిస్థితుల్లో పనిభారం పెరిగి కేసులు సత్వర పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయంటే ఆశ్చర్యమేముంది?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.