శరీరాల్లో ప్లాస్టిక్‌ అణు విస్ఫోటం

నీరు లేనిదే మానవ మనుగడ సాధ్యం కాదు. తగినంత మంచినీరు తాగినప్పుడే శరీరంలో అన్ని జీవ క్రియలూ సక్రమంగా జరుగుతాయి. ఇటీవలి కాలంలో ప్లాస్టిక్‌ మంచినీటి బాటిళ్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

Updated : 01 Mar 2024 08:27 IST

నీరు లేనిదే మానవ మనుగడ సాధ్యం కాదు. తగినంత మంచినీరు తాగినప్పుడే శరీరంలో అన్ని జీవ క్రియలూ సక్రమంగా జరుగుతాయి. ఇటీవలి కాలంలో ప్లాస్టిక్‌ మంచినీటి బాటిళ్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇది ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమించింది.

ళ్లు, కార్యాలయాలు, ప్రయాణాలు, వేడుకలు... అన్నిచోట్లా ప్రస్తుతం ప్లాస్టిక్‌ నీళ్ల బాటిళ్ల వాడకం సాధారణంగా మారింది. ప్లాస్టిక్‌ బాటిళ్లలో లభించే మంచినీటిలో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయని, అది సురక్షితమైనదని అంతా భావిస్తారు. అయితే, ప్లాస్టిక్‌ నీటి సీసాలు శరీరంలోకి రోగకారకాలను తీసుకెళ్తున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్లాస్టిక్‌ బాటిళ్లలోని నీటిలో నానో ప్లాస్టిక్‌లు ఉంటాయన్న వాదన చాలా కాలంగా వినిపిస్తోంది. వాటిని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. దానిద్వారా అమెరికాలోని మూడు ప్రముఖ కంపెనీల ప్లాస్టిక్‌ నీళ్ల సీసాలపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు విస్తుపోయే వాస్తవాలను వెల్లడించారు. ఒక లీటరు ప్లాస్టిక్‌ బాటిల్‌ నీటిలో సగటున 2.40 లక్షల ప్లాస్టిక్‌ రేణువులు ఉన్నట్లు కనుగొన్నారు. ఇప్పటి వరకు అంచనా వేసినదానికన్నా ఇది వంద రెట్లు ఎక్కువ. ఇందులో 10శాతం సూక్ష్మ ప్లాస్టిక్‌ కణాలు, మిగతా 90శాతం అతి సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు. అయిదు మిల్లీమీటర్ల నుంచి ఒక మైక్రోమీటర్‌ వరకు ఉన్న రేణువులను మైక్రోప్లాస్టిక్‌లుగా చెబుతారు. ఒక మైక్రోమీటర్‌ కన్నా తక్కువ మందంతో ఉన్నవాటిని నానో ప్లాస్టిక్‌లుగా వర్గీకరించారు. చాలా సూక్ష్మంగా ఉండటం వల్ల ఇవి మనిషి కణాలు, రక్తం, కాలేయం, కిడ్నీ, గుండె తదితర ముఖ్యమైన అవయవాల్లోకి చాలా సులువుగా ప్రవేశించగలవు. గర్భంలో ఉన్న శిశువు శరీరంలోకీ ఇవి చేరే ప్రమాదం ఉంది.

తీవ్ర హానికరం

పౌడర్‌ రూపంలో ఉండే మైక్రోప్లాస్టిక్‌తో నీళ్ల బాటిళ్లను తయారు చేస్తారు. వీటిలో నీటిని నిల్వ చేసినప్పుడు అతి సూక్ష్మ కణాలు కరిగి అందులో కలిసిపోతాయి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నచోట ఇంకా అధిక పరిమాణంలో నానో ప్లాస్టిక్‌లు కరిగి నీటిలో కలుస్తాయి. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం బాటిల్‌ నీటిలో ప్రధానంగా ఏడు రకాల ప్లాస్టిక్‌ అవశేషాలు ఉంటాయి. నీటి శుద్ధికి ఎక్కువగా ఉపయోగించే పాలీఅమైడ్‌, ప్లాస్టిక్‌ బాటిళ్ల తయారీలో వాడే పాలీ ఇథలీన్‌ టెరెఫ్తలేట్‌ (పీఈటీ), పాలీ వినైల్‌ క్లోరైడ్‌, పాలీమిథైల్‌ మెథాక్రిలేట్‌, పాలిస్టరీన్‌ ప్లాస్టిక్‌లను వారు కనుగొన్నారు. వీటితో పాటు అనేక రకాల రేణువులనూ గుర్తించి, వాటి వర్గీకరణపై దృష్టి సారించారు. వీటివల్ల క్యాన్సర్లు, కిడ్నీ, కాలేయ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మధుమేహం, అధిక బరువు వంటివీ పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిస్‌ఫినాల్‌ ఎ (బీపీఏ) అనే రసాయన పదార్థం చాలా ప్రమాదకరమైంది. గతంలో ప్లాస్టిక్‌ బాటిళ్ల తయారీలో దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. దీనివల్ల దుష్ప్రభావాలు అధికంగా ఉన్నాయనే కారణంతో బీపీఏ రహిత ప్లాస్టిక్‌ నీళ్ల బాటిళ్లనే వినియోగిస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి. అయితే, ఏడు రకాల ప్లాస్టిక్‌లతో తయారు చేసిన బాటిళ్లలోనూ బీపీఏ అవశేషాలు కనిపిస్తున్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మానవుల పునరుత్పత్తిపై బీపీఏ తీవ్ర ప్రభావం చూపుతుంది. బీపీఏతో తయారైన ప్లాస్టిక్‌ బాటిళ్లలోని నీటిని తాగిన మహిళలు, పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యతను గుర్తించినట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. గర్భిణులు ఇలాంటి నీరు ఎక్కువగా తాగితే పుట్టబోయే పిల్లల్లో మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని, క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదమూ ఉందని అవి హెచ్చరిస్తున్నాయి. బాలికలు చిన్నవయసులోనే రజస్వల కావడానికి ప్లాస్టిక్‌ బాటిళ్ల నీటి వినియోగమూ ఒక కారణమని పరిశీలనలు చెబుతున్నాయి.

ఇప్పటికైనా మేలుకుంటేనే...

ప్లాస్టిక్‌ బాటిళ్ల ముప్పు గురించి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా, వాటి వినియోగం మాత్రం తగ్గడం లేదు. 2010-20 మధ్యకాలంలో ప్లాస్టిక్‌ నీటి బాటిళ్ల రంగం 73శాతం వృద్ధి చెంది, ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వాటిలో ఒకటిగా నిలిచింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.22 లక్షల కోట్ల ప్లాస్టిక్‌ బాటిళ్ల నీటి వ్యాపారం జరిగింది. 2030 నాటికి ఇది రూ.41 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. అమెరికా, చైనా, ఇండొనేసియాలలో ప్లాస్టిక్‌ బాటిళ్లలో నీటి వినియోగం అధికంగా ఉంది. భారత్‌లోనూ ఇటీవలి కాలంలో ఇది అంతకంతకు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2022లో ఇండియాలో బాటిళ్లలో విక్రయించే నీటి వ్యాపారం విలువ దాదాపు రూ.1.8 లక్షల కోట్లు. 2030 నాటికి ఇది రూ.2.90 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ప్లాస్టిక్‌ ప్రమాదాన్ని అడ్డుకోవాలంటే మట్టి, స్టీలు గ్లాసులను ఉపయోగించాలి. బయటకు వెళ్ళినప్పుడు స్టీల్‌ సీసాల్లో నీరు తీసుకెళ్ళాలి. వెదురు, మట్టితో తయారుచేసిన మంచినీటి సీసాలూ ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. బాటిల్‌ కన్నా నల్లా నీరే సురక్షితమని ఇప్పటికే అనేక అధ్యయనాలు తేల్చి చెప్పాయి. స్టీల్‌ బిందెల్లో నీటిని నిల్వ చేసుకొని తాగవచ్చు. వేడుకలు, ప్రయాణాలు... ఇలా ఎక్కడైనా ప్లాస్టిక్‌ నీళ్ల బాటిళ్ల వినియోగానికి స్వస్తి పలకాలి. తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పర్యావరణానికీ మేలు కలుగుతుంది.


భూగర్భ జలాలపై ప్రభావం

రిశీలనల ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా బాటిల్‌ నీటి పరిశ్రమ దాదాపు 60,000 కోట్ల ప్లాస్టిక్‌ బాటిళ్లను ఉత్పత్తి చేసింది. తద్వారా 2.5 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణంలో పోగుపడ్డాయి. ఇవి తాగునీటి వనరులు, సముద్రాలనూ కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ రేణువులు సముద్ర జీవరాశుల శరీరాల్లోకి చేరి వాటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. భూమి, నదుల్లోనూ విచ్చలవిడిగా పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు జంతువుల కణాల్లోకి చేరుతున్నాయి. వాడిపడేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లను పునర్వినియోగంలోకి తెస్తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నా, అది సమర్థంగా జరగడం లేదన్న విమర్శలున్నాయి. మరోవైపు ప్లాస్టిక్‌ బాటిళ్ల వ్యాపార గిరాకీని తీర్చేందుకు కంపెనీలు ఆధునిక సాంకేతికతతో భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నాయి. దాంతో సమీప ప్రాంతాల్లో ప్రజలకు సాగు, తాగునీటి ఇక్కట్లు ఎదురవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.