విద్యుత్‌ దారుల్లో... సరకు రవాణా

సరకులను దేశ నలుమూలలకు చేరవేయడంలో ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో ఇంధనంగా డీజిల్‌ను వినియోగిస్తుండటం వల్ల రవాణా వ్యయం అధికంగా ఉంటోంది. పైగా ఇటువంటి వాహనాల నుంచి కర్బన ఉద్గారాలు భారీగా విడుదల అవుతున్నాయి. ఎలెక్ట్రిక్‌ ట్రక్కుల వినియోగంతో ఈ సమస్యలకు చక్కని పరిష్కారాలు లభించే అవకాశముంది.

Published : 02 Mar 2024 00:24 IST

సరకులను దేశ నలుమూలలకు చేరవేయడంలో ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో ఇంధనంగా డీజిల్‌ను వినియోగిస్తుండటం వల్ల రవాణా వ్యయం అధికంగా ఉంటోంది. పైగా ఇటువంటి వాహనాల నుంచి కర్బన ఉద్గారాలు భారీగా విడుదల అవుతున్నాయి. ఎలెక్ట్రిక్‌ ట్రక్కుల వినియోగంతో ఈ సమస్యలకు చక్కని పరిష్కారాలు లభించే అవకాశముంది.

భారత్‌లోని మొత్తం రవాణా వాహనాల్లో ట్రక్కులు మూడు శాతమే. అయినప్పటికీ, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపడంలో అవి అగ్రస్థానం ఆక్రమిస్తున్నాయి. మోటారు వాహనాలు వెలువరించే కర్బన ఉద్గారాలలో 41 శాతానికి, వాయు కాలుష్య కారక పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ (పీఎం) ఉద్గారాలలో 53 శాతానికి ట్రక్కులే కారణమవుతున్నాయి. వాహన బరువు, అవి తీసుకెళ్ళే సరకుల పరిమాణం ఆధారంగా ట్రక్కులను మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అవి: 3.5 టన్నుల లోపు ఉండే లైట్‌ డ్యూటీ ట్రక్కులు, 3.5-12 టన్నుల మీడియం డ్యూటీ ట్రక్కులు, 12 టన్నులకు పైబడిన హెవీ డ్యూటీ ట్రక్కులు. అన్ని రకాల ట్రక్కులు కలిసి ఏటా ఏడు కోట్ల టన్నులకు పైగా చమురును మండిస్తాయి. తద్వారా 21.3 కోట్ల టన్నుల పరిమాణంలో బొగ్గుపులుసు వాయువును వెదజల్లుతాయి. ట్రక్కులు ప్రధానంగా డీజిల్‌ ఆయిల్‌ను ఉపయోగించుకునే ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌ (ఐసీఈ)తో నడుస్తాయి. 2022లో 40 లక్షలుగా ఉన్న హెవీ, మీడియం డ్యూటీ ట్రక్కుల సంఖ్య 2050కల్లా 1.7 కోట్లకు చేరుతుందని అంచనా.

వినియోగం పెరగాలంటే...

ఇండియా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి అయిదు శాతం వాటా రవాణా రంగం నుంచే సమకూరుతోంది. సుమారు 2.2 కోట్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. అయితే రవాణా, బట్వాడా రంగంపై ఇంధనం తదితరాల వ్యయం జీడీపీలో 14 శాతంగా లెక్కతేలింది. ఇతర ప్రధాన దేశాల్లో మాత్రం ఇది 8-11 శాతం మధ్యే ఉంది. చమురుకు బదులు విద్యుచ్ఛక్తితో నడిచే ఎలెక్ట్రిక్‌ ట్రక్కుల సంఖ్య పెరిగితే ఈ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. కానీ, దేశంలో అందుకు అవసరమైన పునాది మాత్రం ఇంకా పడలేదు. ప్రస్తుతం దేశంలోని మొత్తం రవాణా వాహనాలలో ఎలెక్ట్రిక్‌ ట్రక్కులు ఒక్క శాతమైనా లేకపోవడమే ఇందుకు నిదర్శనం. హెవీ, మీడియం డ్యూటీ ఎలెక్ట్రిక్‌ ట్రక్కులు ఎక్కువ సరకులను మోసుకెళ్తాయి కాబట్టి వాటికి విద్యుచ్ఛక్తి కూడా అధికంగానే అవసరమవుతుంది. డీజిల్‌ ట్రక్కు కన్నా ఎలెక్ట్రిక్‌ ట్రక్కు ధర మూడు నాలుగు రెట్లు ఎక్కువ. ఛార్జింగ్‌ కేంద్రాలు, మరమ్మతు సౌకర్యాలు అరకొరగా ఉండటం, ఆరంభంలో అధికంగా పెట్టుబడి పెట్టాల్సి రావడం, మార్కెట్‌లో తక్కువ మోడళ్లు అందుబాటులో ఉండటం... ఎలెక్ట్రిక్‌ ట్రక్కుల విక్రయాలను వెనక్కిలాగుతున్నాయి.

భారతీయ రవాణా రంగంలో 75శాతం ట్రక్కులను చిన్న యజమానులే నడుపుతున్నారు. వీరు ఎలెక్ట్రిక్‌ వాహనాలకు మళ్ళగలిగే పరిస్థితులను కల్పించాల్సిన అవసరముంది. ఎటువంటి ఉద్గారాలను విడుదల చేయని ఎలెక్ట్రిక్‌ ట్రక్కుల వల్ల పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. అయితే, వీటిని ప్రవేశపెట్టడంలో ఎదురయ్యే సాధక బాధకాలను ప్రభుత్వాలు, కంపెనీలు లోతుగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా భారతీయ పరిస్థితులకు అనువైన సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి. నష్టభయం లేని పెట్టుబడి వాతావరణాన్ని కల్పించడం ముఖ్యం. కర్బన ఉద్గారాల కట్టడి లక్ష్యానికి అనుగుణంగా ఎలెక్ట్రిక్‌ ట్రక్కుల పరిశ్రమ తనను తాను మలచుకోవాలి. రవాణా రద్దీ ఎక్కువగా ఉండే రహదారుల వెంట ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసి, వాటిని సమర్థంగా నిర్వహించాలి. అది ఎలెక్ట్రిక్‌ ట్రక్కుల వినియోగం పెరగడానికి దోహదపడుతుంది. ఎలెక్ట్రిక్‌ ట్రక్కులు నడపడంలో డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడమూ ఎంతో కీలకం. అంతేకాదు, ఈ వాహనాల తయారీ పరిశ్రమను పరిపుష్టం చేసేందుకు అవసరమైన నిపుణ సిబ్బందిని తయారు చేసుకోవాలి. మరమ్మతులు చేయడానికి సర్వీసు సిబ్బందిని సమకూర్చుకోవాలి. బ్యాటరీ ఛార్జింగ్‌, నిర్వహణ నిపుణులకు శిక్షణ ఇవ్వాలి. తద్వారా యువతకు కొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయి. ఎలెక్ట్రిక్‌ ట్రక్కుల విక్రయాలను, వినియోగాన్ని పెంచాలంటే ప్రభుత్వపరంగా, ఆర్థికంగా తగిన ప్రోత్సాహకాలు అందించడం ఎంతో అవసరం. ఎలెక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు ప్రారంభంలో భారీగా పెట్టుబడులు అవసరమవుతాయి. కాబట్టి, ఈ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటూనే కొనుగోలుదారులకు రుణాలు, రాయితీలు అందించాలి.

ప్రధాన కారిడార్లలో...

ప్రస్తుతం భారత్‌లో 50శాతం సరకుల రవాణా- దిల్లీ, ముంబయి, చెన్నై, కాండ్లా, కొచ్చి, కోల్‌కతాలను కలిపే ఏడు ప్రధాన కారిడార్ల ద్వారా జరుగుతోంది. ఈ కారిడార్ల వెంట పుష్కలంగా ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తే ఎలెక్ట్రిక్‌ ట్రక్కుల వినియోగం, ఉత్పత్తి ఊపందుకుంటాయి. దానివల్ల రవాణా వ్యయం తగ్గి దేశ జీడీపీ పుంజుకొంటుంది. డీజిల్‌ నుంచి విద్యుచ్ఛక్తికి మారితే వాహన జీవిత కాలంలో ఇంధన ఖర్చు 46శాతం దాకా ఆదా అవుతుంది. ఎలెక్ట్రిక్‌ రవాణా వాహనాల వల్ల 2030కల్లా బొగ్గుపులుసు వాయు ఉద్గారాలను గణనీయంగా నివారించవచ్చని, రవాణా ఖర్చులు భారీగా తగ్గుతాయని నీతి ఆయోగ్‌ లెక్కగట్టింది. ఎటువంటి ఉద్గారాలను విడుదల చేయని ఎలెక్ట్రిక్‌ ట్రక్కులు పర్యావరణానికి, దేశార్థికానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ తరహా ట్రక్కుల ఉత్పత్తి, వినియోగాలను పెంచడానికి తగిన సాంకేతికతలను దేశీయంగా అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి సారించాలి. ఆ దిశగా పరిశోధన, అభివృద్ధికి తోడ్పాటు అందించడం ముఖ్యం. ఎలెక్ట్రిక్‌ ట్రక్కుల విషయంలో ప్రభుత్వం, పరిశ్రమలు తగిన విధానాలతో ముందుకు రావాలి. అన్నింటినీ మించి, వీటిని వినియోగించే దిశగా అందరి దృక్కోణంలో మార్పు తీసుకురావాలి.


ప్రత్యేక చర్యలతోనే...

శూన్య ఉద్గార ట్రక్కుల (జడ్‌ఈటీ) ఉత్పత్తి, అమ్మకాలను పెంచడానికి అనేక ప్రధాన దేశాలు సముచిత విధానాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. ఆ తరహా ట్రక్కుల తయారీకి అధునాతన సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నాయి. భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జడ్‌ఈటీల కొనుగోలుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా రుణాలివ్వాలి. వాటిపై వడ్డీ రాయితీలను మంజూరు చేయాలి. జడ్‌ఈటీల ఉత్పత్తికి ప్రత్యేక చర్యలు ఆవశ్యకం. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అమలుచేస్తున్న అత్యాధునిక హరిత ట్రక్కుల నిబంధనావళిని పరిశీలించడం సముచితం. దాని ప్రకారం 2024 నుంచి ట్రక్కుల ఉత్పత్తిదారులు ఏటా ఆరు శాతం ఎలెక్ట్రిక్‌ ట్రక్కులను తయారుచేయాలి. 2035కల్లా అది 63శాతానికి, 2045కల్లా 100శాతానికి చేరుకోవాలి. 2040కల్లా రోడ్లపై అయిదు లక్షల ఎలెక్ట్రిక్‌ ట్రక్కులు తిరగాలని కాలిఫోర్నియా సర్కారు లక్షిస్తోంది.


ప్రదీప్‌ కరుటూరి    
(సంప్రదాయేతర ఇంధన రంగ నిపుణులు, ఓఎంఐ ఫౌండేషన్‌లో సీనియర్‌ మేనేజర్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.