సంస్కరణలతోనే మెరుగైన విద్య

విద్యారంగంలో సంస్కరణలు, ప్రక్షాళన ద్వారానే అందరికీ మెరుగైన చదువులు దక్కుతాయి. ఉన్నత విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అసమర్థ నియంత్రణ ఒకటని జాతీయ విద్యావిధానం గుర్తించింది. విద్యాసంస్థల గుర్తింపు ప్రక్రియ కూడా కీలకమే.  

Updated : 28 Mar 2024 04:08 IST

విద్యారంగంలో సంస్కరణలు, ప్రక్షాళన ద్వారానే అందరికీ మెరుగైన చదువులు దక్కుతాయి. ఉన్నత విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అసమర్థ నియంత్రణ ఒకటని జాతీయ విద్యావిధానం గుర్తించింది. విద్యాసంస్థల గుర్తింపు ప్రక్రియ కూడా కీలకమే.

ఉన్నత విద్యాసంస్థలను విశ్వవిద్యాలయాలుగా ప్రకటించడానికి, విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయడానికి అధికారిక గుర్తింపు తప్పనిసరి. జాతీయ మదింపు, గుర్తింపు మండలి (న్యాక్‌) విద్యాసంస్థలకు అధికారిక గుర్తింపును ప్రకటిస్తుంది. వివిధ సంస్థల నుంచి, ప్రభుత్వ ప్రత్యేక పథకాల ద్వారా నిధులు, గ్రాంట్లు అందుకోవడానికి, అంతర్జాతీయ విద్యాసంస్థలతో భాగస్వామ్యానికి, సంయుక్తంగా పరిశోధనలు చేపట్టడానికి ఇది అత్యంత అవసరం. నాణ్యమైన విద్యాసంస్థలను ఎంపిక చేసుకోవడానికి, విద్యార్థుల క్రెడిట్‌ బదిలీ ప్రక్రియను సులభతరం చేయడానికి, విదేశాలలో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల   కల్పనకు ఈ అధికారిక గుర్తింపు తోడ్పడుతుంది.

గుర్తింపు ప్రక్రియ....

న్యాక్‌ సంస్థ ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యా ప్రమాణాలను, నాణ్యతను మదింపు వేసి ఎనిమిది గ్రేడుల్లో ఒకదాన్ని ధ్రువీకరిస్తుంది. ఈ సంస్థ 2023 జూన్‌ నాటికి దేశంలోని 820 విశ్వవిద్యాలయాలకు, 15,501 కళాశాలలకు గుర్తింపును ప్రకటించింది. ఒకసారి జారీ చేసిన గుర్తింపే శాశ్వతం కాదు. విద్యా సంస్థలు తమ పనితీరును మెరుగుపరచుకుంటూ కాలక్రమేణా సమీక్షించుకుని తిరిగి మెరుగైన గ్రేడుతో గుర్తింపు పొందే అవకాశముంది. ప్రస్తుతం న్యాక్‌ సంస్థ ఆచరిస్తున్న మదింపు, గుర్తింపు పద్ధతులపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. గుర్తింపు ప్రక్రియలో భాగంగా విద్యాసంస్థలను కోరే సమాచారం సేకరించడానికి అధిక సమయం పడుతోంది. మదింపు, గుర్తింపు జారీ హేతుబద్ధంగా జరగడం లేదని, పక్షపాత ధోరణికి వీలు కల్పిస్తున్నదనే విమర్శలున్నాయి. ఒక విద్యాసంస్థకు ఒక గ్రేడ్‌ ఇచ్చిన తరవాత అసంతృప్తితో ఆ సంస్థ పునస్సమీక్షకు దరఖాస్తు చేసుకుంటే, ప్రకటించిన గ్రేడును మార్చడంవల్ల న్యాక్‌ సంస్థ విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. గుర్తింపు ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో ఉన్నత విద్యాసంస్థలు ముందుకు రావడం లేదు. అయితే, జాతీయ విద్యావిధానాన్ని విజయవంతంగా అమలు చేయడానికి దేశంలోని విద్యాసంస్థలన్నీ గుర్తింపు ప్రక్రియలో పాల్గొని ర్యాంకులు పొందాలి.

ప్రస్తుత మదింపు, గుర్తింపు ప్రక్రియలో నెలకొన్న లోపాలను సరిదిద్దడానికి కేంద్ర విద్యాశాఖ డాక్టర్‌ కె.రాధాకృష్ణన్‌ అధ్యక్షతన 2022లో విస్తృతస్థాయి కమిటీ ఏర్పాటైంది. నూతన విద్యావిధాన లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు, ర్యాంకింగ్‌ పద్ధతులను రూపొందించడం ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. గుర్తింపు ప్రక్రియలో తీసుకురావలసిన సంస్కరణలను సిఫారసు చేస్తూ 2024 జనవరిలో కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విశ్వసనీయత, హేతుబద్ధతతో కూడిన సులభతర గుర్తింపు, ర్యాంకింగ్‌ పద్ధతిని అది ప్రతిపాదించింది. గుర్తింపు ప్రక్రియలో అధిక సాంకేతికత, పరిమిత మానవ ప్రమేయం, పారదర్శకత ఉండాలని సూచించింది. ఉన్నత విద్యాసంస్థల్లో అవగాహన పెంచి, ప్రోత్సహించడం ద్వారా గుర్తింపు ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొని, ప్రమాణాల్ని పెంపొందించుకొని ప్రపంచస్థాయి ప్రశంసలు పొందేలా ఈ ప్రక్రియ ఉండాలని వివరించింది. ఉన్నత విద్యాసంస్థల గుర్తింపునకు సంబంధించి కమిటీ రెండు పద్ధతులను సిఫారసు చేసింది. మొదటి పద్ధతిలో విద్యాసంస్థలను గుర్తింపు పొందిన లేదా గుర్తింపు తిరస్కరణకు గురైన సంస్థలుగా వర్గీకరిస్తారు. ఈ విభజన ఉద్దేశం విద్యాసంస్థలన్నీ గుర్తింపు ప్రక్రియలో భాగస్వామ్యం పొందేలా ప్రోత్సహించడం, నాణ్యతను పెంపొందించడమే. ప్రపంచంలో పలు దేశాలు దీన్ని ఉత్తమ పద్ధతిగా ఆచరిస్తున్నాయి. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న విద్యాసంస్థలకు వాటి కోరిక మేరకు పాత లేదా నూతన పద్ధతుల ద్వారా మదింపు చేపట్టి గుర్తింపు ఇవ్వాలని న్యాక్‌ సంస్థ నిర్ణయించింది. ఉన్నత స్థితి ఆధారంగా గుర్తింపును ప్రకటించే రెండో పద్ధతిని 2024 డిసెంబరు నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో విద్యాసంస్థల ప్రమాణాలు, నాణ్యత స్థితిగతుల ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు అవి, జాతీయస్థాయి సామర్థ్యం కలిగిన ఉన్నత విద్యాసంస్థలు, అంతర్జాతీయ స్థాయి సామర్థ్యం కలిగిన బహుళ శాస్త్ర పరిశోధన విద్యాసంస్థలు. జాతీయ స్థాయి సంస్థలను, అవి బోధించే శాస్త్ర అంశాల విస్తృతిని బట్టి నాలుగు స్థాయులుగా వర్గీకరించి గుర్తింపు ప్రకటిస్తారు. అంతర్జాతీయ స్థాయి సామర్థ్యం కలిగిన బహుళ శాస్త్ర పరిశోధన విద్యాసంస్థలను అయిదో స్థాయిగా గుర్తిస్తారు. ఒక స్థాయి గుర్తింపు పొందిన విద్యాసంస్థ ప్రమాణాలను, నాణ్యతను పెంపొందించుకోవడం ద్వారా క్రమంగా తన గ్రేడును మెరుగుపరచుకోవచ్చు. విద్యాసంస్థలు ప్రమాణాలను, నాణ్యతను అభివృద్ధి పరచుకోవడం ద్వారా ప్రపంచ స్థాయి సంస్థలుగా ఎదగడానికి ఈ వర్గీకరణ సహాయ పడుతుంది. గ్రామీణ, దూర ప్రాంతాల్లో నెలకొల్పిన విద్యాసంస్థలు సైతం న్యాక్‌ గుర్తింపు ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు.

నాణ్యమైన విద్య

వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనలో భాగంగా ఉన్నత విద్యాసంస్థలు ప్రపంచస్థాయి ర్యాంకులను అందిపుచ్చుకోవాలి. ప్రసిద్ధ టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, క్యూ.ఎస్‌.వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్‌ వంటి సర్వేలలో దేశీయ విద్యాసంస్థలు ఉత్తమ ర్యాంకులు సాధించాలి. క్రమం తప్పకుండా మంచి ర్యాంకులను సాధించాలంటే విధాన, సంస్థాగత స్థాయుల్లో నిరంతరం మెరుగైన పద్ధతులను ఆచరించాలి. ఉన్నత విద్యాసంస్థల ర్యాంకులను మెరుగుపరచడానికి చేపట్టిన వివిధ చర్యల ఫలితంగా క్యూ.ఎస్‌.వరల్డ్‌ ర్యాంకింగ్‌-2023 సర్వేలో దేశంలోని పలు ఉన్నత విద్యాసంస్థలు మంచి స్థానాలను సాధించాయి. కొన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కూడా గణనీయ సంఖ్యలో ర్యాంకులను మెరుగుపరచుకోవడం శుభ పరిణామం. బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు అధికంగా చదివే ప్రైవేటు, గ్రామీణ ప్రాంతాల విద్యాసంస్థలు మౌలిక వసతులు, సిబ్బంది, నిధుల కొరత  కారణంగా ఆశించిన స్థాయిలో నాణ్యమైన విద్యను అందించడం లేదు. ఈ సంస్థల విద్యావాతావరణాన్ని మెరుగుపరచడం ద్వారా గుర్తింపు  ప్రక్రియలో వీటి భాగస్వామ్యాన్ని పెంపొందించి నాణ్యమైన ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి.


ఒకే వేదిక

విద్యాసంస్థల గుర్తింపు సమాచార సేకరణకు ‘ఒకే దేశం, ఒకే సమాచార వేదిక’ అనే పద్ధతిని డాక్టర్‌ కె.రాధాకృష్ణన్‌ కమిటీ ప్రతిపాదించింది. సమాచారంలో విశ్వసనీయత, పారదర్శకతను సాధించడం ఈ వేదిక ఉద్దేశం. విద్యాసంస్థలు ఈ వేదికకు సమర్పించిన సమాచార విశ్వసనీయతను భాగస్వామ్య పక్షాలైన విద్యార్థులు, బోధన సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల ద్వారా ధ్రువీకరిస్తారు. ఈ వేదికకు సమర్పించిన సమాచారం, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాల ఆధారంగా విద్యాసంస్థలకు ఆమోదం, గుర్తింపు, ర్యాంకులను ప్రకటిస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చిన సంస్థలపై అధిక జరిమానాలతోపాటు కఠిన చర్యలు ఉంటాయి.


డాక్టర్‌ సీహెచ్‌సీ ప్రసాద్‌
(విద్యారంగ నిపుణులు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.