సమాచార నిధికి భారీగా విద్యుత్తు

అపార సమాచార రాశి ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థకు కీలక ఇంధనంగా పనిచేస్తోంది.  కాబట్టి డేటా నిల్వకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇవి భారీగా విద్యుత్తును ఉపయోగించుకుంటాయి.

Published : 29 Mar 2024 00:24 IST

కట్టడి చేసేదెలా?

అపార సమాచార రాశి ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థకు కీలక ఇంధనంగా పనిచేస్తోంది.  కాబట్టి డేటా నిల్వకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇవి భారీగా విద్యుత్తును ఉపయోగించుకుంటాయి. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

గాలిలో స్పెక్ట్రమ్‌ తరంగాల ద్వారా, సముద్ర గర్భంలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు, అంతరిక్షంలో ఉపగ్రహాల ద్వారా డిజిటల్‌ డేటా ప్రసారమవుతుంది. రకరకాల ఎలెక్ట్రానిక్‌ సాధనాల మధ్య ఈ డేటా తిరుగుతుంది. వేలాది ప్రభుత్వ, ప్రైవేటు డేటా సెంటర్లు లక్షలాది సర్వర్లలో ఈ డేటాను నిక్షిప్తం చేస్తూ స్థిరంగా, వేగంగా సమాచార వ్యాప్తికి తోడ్పడుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలి మూడు దశాబ్దాల్లో ల్యాండ్‌లైన్లు ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్లు లేనిదే రోజు గడవడం లేదు. డేటా అనేది 21వ శతాబ్దికి కీలక ఇంధనం వంటిదని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వ్యాఖ్యానించారు. నేడు వ్యక్తుల మధ్య సంభాషణలకే కాదు- స్విగ్గీ, జొమాటో వంటి ఆహార బట్వాడా సంస్థలు, ఉబర్‌, ఓలా వంటి రవాణా యాప్‌లు, అమెజాన్‌, బిగ్‌ బాస్కెట్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థలు, పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి చెల్లింపు యాప్‌లు... 24 గంటలు అందుబాటులో ఉండే డేటా ఆధారంగా పనిచేస్తున్నాయి.

పునరుత్పాదక పద్ధతుల్లో...

వ్యాపారాలు అనుక్షణం ఉత్పన్నం చేసే అపార సమాచార రాశిని బిగ్‌ డేటా అంటారు. ఈ సమాచారాన్ని విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడే ప్రక్రియే డేటా అనాలిసిస్‌. ప్రభుత్వాలు, వ్యాపార, స్వచ్ఛంద, విద్యావైద్య సంస్థలు, పత్రికలు, ఇతర సమాచార సాధనాలకు ఐటీ, డేటా ఎనలిటిక్స్‌ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఓపెన్‌ ఏఐ సంస్థ అందుబాటులోకి తెచ్చిన చాట్‌ జీపీటీ- కృత్రిమ మేధ (ఏఐ) వల్ల జీవనోపాధికి కలిగే ముప్పు అంశంపై చర్చ ప్రారంభించింది. భారత్‌, అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలు ఏఐ అందించే అవకాశాలు, దాని వల్ల తలెత్తే ప్రమాదాలపై దృష్టి సారించాయి. ఏఐ విషయంలో సరైన నియంత్రణ చట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను అవి గుర్తించాయి. ఏఐ భవిష్యత్తులో ఏయే రూపాలు ధరిస్తుందో, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో ఊహించడం కష్టంగానే ఉంది. ప్రస్తుత స్థితిగతులను ఏఐ సమూలంగా మార్చేస్తుందని ఎరిక్‌ డైమ్లర్‌ అనే నిపుణుడు తెలిపారు. ఏఐకి భారీ పెట్టుబడులు కావాలని, అది పెద్దయెత్తున విద్యుచ్ఛక్తిని ఉపయోగించుకొంటుందని విశ్లేషించారు. ఇండియాకు ఉన్న విస్తృత డిజిటల్‌ యంత్రాంగం ఏఐలో పురోగమించడానికి ఊతమిస్తుందని వ్యాఖ్యానించారు.

డేటా సెంటర్‌లో ప్రతి చదరపుటడుగు విస్తీర్ణం 150 నుంచి 300 వాట్ల విద్యుత్తును ఉపయోగించుకొంటుంది. ఒక గిగాబైట్‌ డేటాను నిల్వ చేయడానికి మూడు నుంచి ఏడు కిలోవాట్ల విద్యుత్‌ అవసరపడుతుంది. ఒక డేటా సెంటర్‌కు కావాల్సిన విద్యుత్‌ యాభై వేల ఇళ్లకు సరిపోతుంది. నిరుడు డిసెంబరు నాటికి ప్రపంచమంతటా దాదాపు పదకొండు వేల డేటా సెంటర్లు ఏర్పాటయ్యాయి. వాటన్నింటికీ భారీగా విద్యుత్తు అవసరమవుతుంది. భారత్‌లో 139 డేటా సెంటర్లు ఉన్నాయి. డేటా సెంటర్ల సంఖ్య పరంగా ఇండియా ప్రపంచంలో 13వ స్థానంలో నిలుస్తోంది. డేటా సెంటర్లకు శీతలీకరణ సదుపాయం కావాలి. ఈ కేంద్రాలకు కావాల్సిన విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరులతో ఉత్పత్తి చేయడం పర్యావరణహితంగా ఉంటుంది. డేటా సెంటర్‌ భవనాలను పర్యావరణ అనుకూలంగా నిర్మించాలి. భవిష్యత్తులో వాటి విస్తరణకు ముందునుంచే సరైన సన్నాహాలు చేసుకోవాలి.

5జీ నెట్‌వర్కుల కోసం మరింత నిల్వ సామర్థ్యం గల డేటా సెంటర్లను ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. వీటి కోసం డేటాను ఇప్పుడున్నదానికన్నా 10 రెట్లు వేగంగా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి వస్తుంది. ఓటీటీ వేదికలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, వీడియో స్ట్రీమింగ్‌, డిజిటల్‌ కామర్స్‌, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ సేవలకు మరిన్ని డేటా సెంటర్లు అవసరపడతాయి. డేటా సెంటర్లు, ఇంటర్నెట్‌ వినియోగం వల్ల ప్రపంచ కర్బన ఉద్గారాల్లో 3.7శాతం వెలువడుతున్నాయి. 2025కల్లా ఇది రెట్టింపు అవుతుందని అంచనా. ప్రస్తుతం వాణిజ్య విమాన సర్వీసుల వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు 2.4శాతమేనని ఇక్కడ గుర్తించాలి. 2025కల్లా ప్రపంచమంతటా డేటా నిల్వకు 200 జెటాబైట్ల ‘కంప్యూటర్‌ మెమొరీ’ అవసరపడుతుందని సైబర్‌ సెక్యూరిటీ వెంచర్స్‌ సంస్థ అంచనా వేసింది. స్మార్ట్‌ఫోన్లు, పర్సనల్‌ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఐఓటీ సాధనాలు మొదలుకొని ప్రభుత్వ, ప్రైవేటు డేటా సెంటర్ల వరకు అన్నింటికీ  కలిపి ఆ స్థాయిలో కంప్యూటర్‌ మెమొరీ అవసరమని పేర్కొంది.

నియంత్రణ చర్యలే కీలకం

డేటా వినియోగం నానాటికీ విస్తరిస్తున్నందువల్ల కొన్ని నియంత్రణ చర్యలు తప్పనిసరి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ఎలా ప్రచారం చేస్తున్నామో, బాధ్యతారహితంగా డేటాను వాడటమూ అంతే హానికరమని ప్రకటించాలి. సందేశాల రూపంలో కన్నా వీడియోలు, ఫొటోల రూపంలో డేటా పంపడానికి ఎక్కువ విద్యుత్తు అవసరమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో వందల కోట్ల చిత్రాలు, సందేశాలను పంపుతున్నారు. వినియోగదారులు ఫొటోలు, వీడియోలకు బదులు సంక్షిప్త, ఆడియో సందేశాలవైపు మొగ్గుచూపితే కర్బన ఉద్గారాల నిరోధానికి తోడ్పడుతుంది. ఏ సంస్థకు ఆ సంస్థ విడివిడిగా డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడంకన్నా సమష్టిగా క్లౌడ్‌ సర్వర్లను ఉపయోగిస్తే ఉద్గారాలను చాలావరకు నివారించవచ్చు. కృత్రిమ మేధ నియంత్రణకు ఉమ్మడి చట్రాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు భారతీయ వినియోగదారులు చాలా తక్కువ ఖర్చుకు డేటాను వినియోగించుకోగలుగుతున్నారు. ఈ ధరలను పెంచాలని ప్రైవేటు టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. ఇది వినియోగదారులకు భారం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి.


పెరుగుతున్న ప్రమాదాలు

సెల్‌ఫోన్ల వాడకం, డేటా వినియోగం పెరిగేకొద్దీ ప్రమాదాలూ అదే స్థాయిలో అధికమవుతున్నాయి. ప్రపంచమంతటా ఏటా 13 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాటిలో 23శాతం వాహనం నడిపేటప్పుడు డ్రైవర్లు సెల్‌ఫోన్‌ వాడటం వల్ల జరుగుతున్నవే! ఇలాంటి పరధ్యానం వల్ల భారత్‌లోనూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. 2021లో 1,997 రోడ్డు ప్రమాదాలు సెల్‌ఫోన్‌ వాడకం వల్ల సంభవించాయి. వాటిలో వెయ్యి మందికి పైగా మరణించారు. నిరుడు అక్టోబరులో విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం లోకోపైలట్లు సెల్‌ఫోన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ నడపడమేనని రైల్వే మంత్రి వెల్లడించారు. ఆ ప్రమాదంలో 14 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. వాహనాలు నడిపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవర్లు సెల్‌ఫోన్లను వాడకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.