వ్యర్థాల శుద్ధితో అనర్థాల కట్టడి

వ్యర్థాల సమస్య మానవాళికి పెనుసవాళ్లు విసురుతోంది. విస్తరిస్తున్న పట్టణీకరణ, జీవనశైలి మార్పులు, వస్తు వినియోగం పెరగడం తదితర కారణాలతో ఘన వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్‌ నుంచి ఆహారం వరకు మనం పారేసే ఘనవ్యర్థాల సేకరణ, శుద్ధి, నిర్మూలన పూర్తిగా సాధ్యపడటం లేదు. వ్యర్థాలతో కాలుష్యం పెరిగి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది.

Published : 30 Mar 2024 00:38 IST

వ్యర్థాల సమస్య మానవాళికి పెనుసవాళ్లు విసురుతోంది. విస్తరిస్తున్న పట్టణీకరణ, జీవనశైలి మార్పులు, వస్తు వినియోగం పెరగడం తదితర కారణాలతో ఘన వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్‌ నుంచి ఆహారం వరకు మనం పారేసే ఘనవ్యర్థాల సేకరణ, శుద్ధి, నిర్మూలన పూర్తిగా సాధ్యపడటం లేదు. వ్యర్థాలతో కాలుష్యం పెరిగి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. నేడు అంతర్జాతీయ శూన్య వ్యర్థాల అవగాహన దినోత్సవం సందర్భంగా...

ప్రపంచవ్యాప్తంగా గృహాల్లో రోజూ భారీ మొత్తంలో ఆహారం వృథా అవుతోంది. మనదేశంలో తలసరి ఆహార వృథా ఏడాదికి 55 కిలోలుగా ఉంటోంది. మరోవైపు, ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. మరెంతోమందికి ఆహార భద్రత కొరవడింది. సరైన నిల్వ సౌకర్యాలు కొరవడటం వల్ల ఆహార పదార్థాల వృథా అధికమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆహార వృథా విషయంలో ధనిక దేశాలతోపాటు ఎగువ ఆదాయ, దిగువ ఆదాయ దేశాలదీ ఒకే తరహా పరిస్థితిగా ఉంది. వస్తువుల నుంచి ఆహార పదార్థాల వరకు వాటి ఉత్పత్తి, వినియోగంలో సుస్థిర పద్ధతులను అవలంబించడంపై శ్రద్ధ చూపడం లేదు. ఘన వ్యర్థాల నిర్వహణలో సుస్థిర యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంపొందించడం ద్వారా వ్యర్థాల ఉత్పత్తిని పరిమితం చేయడమే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి శూన్య వ్యర్థాల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ దేశాల్లో వస్తూత్పత్తి నుంచి వినియోగం వరకు వ్యర్థాల విడుదలను పరిమితం చేయడం ఇప్పుడు అందరి ఎదుటా ఉన్న ఘనతర లక్ష్యం.

పేరుకుపోతున్న చెత్త

భూగోళంపై మానవాళి విడుదల చేసే చెత్తలో 80శాతందాకా కాలువలు, చెరువులు, నదుల ద్వారా సముద్ర జలాల్లో కలిసిపోతున్నట్లు అంచనా. దీంతో జలవనరులు కాలుష్యం బారిన పడుతున్నాయి. జలచరాలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 230 కోట్ల టన్నుల ఘనవ్యర్థాలు పోగవుతున్నట్లు అంచనా. పరిశ్రమలు పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి. సగటున ప్రతి వ్యక్తి రోజుకు 0.74 కిలోగ్రాముల చెత్తను విడుదల చేస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ దేశాల్లో ఏటా పోగుపడే చెత్త 340 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా పోగుపడుతున్న వ్యర్థాల్లో కేవలం 13.5శాతాన్నే పునశ్శుద్ధి చేయగలుగుతున్నారు. దేశంలోని పురపాలక సంఘాల పరిధిలో రోజూ సుమారు లక్షన్నర టన్నుల ఘనవ్యర్థాలు పేరుకుంటున్నాయి. ఇందులో నలభై శాతం దాకా డంపింగ్‌ యార్డులకు చేరుతోంది. దేశంలో ఉత్పత్తయ్యే అన్ని రకాల ఘన వ్యర్థాలు 2031లో 16.5 కోట్ల టన్నులకు, 2050లో 43.6 కోట్ల టన్నులకు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో గృహాల నుంచి 88శాతం, పట్టణాల్లో 25శాతం ఘన వ్యర్థాలను సేకరించకపోవడం వల్ల ఎక్కడపడితే అక్కడ విడిచిపెడుతున్నారు. దేశంలో చెత్తను శుద్ధి చేసి, పునర్వినియోగానికి పనికొచ్చేలా మార్చే కర్మాగారాలు ఏర్పాటు చేసినా, వాటిని సజావుగా ఉపయోగించుకొనే పరిస్థితి కొరవడింది. ప్రమాదకర వ్యర్థాలను శుద్ధి చేసే కర్మాగారాల నుంచి గొట్టాల ద్వారా సముద్రాలు, నదుల్లోకి వదులుతున్నట్లు ఆరోపణలున్నాయి. కాలుష్య నియంత్రణ మండళ్లకు సరిపడా సిబ్బంది, నిధులు లేకపోవడంతో పర్యవేక్షణ సక్రమంగా సాగడం లేదు. దీంతో జలాలు, జలచరాలు కాలుష్యం బారిన పడుతున్నాయి. నిరుడు ఈ అంశంపై పరిశీలన చేసిన కాగ్‌ ప్రభుత్వ వ్యవస్థలను తీవ్రంగా ఆక్షేపించింది. మన దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణలో ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విధించిన జరిమానాలు ప్రతిబింబిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పురపాలక సంఘాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ నిబంధనలు అతిక్రమించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ట్రైబ్యునల్‌ 2022-23లో రూ.79 వేల కోట్ల జరిమానా విధించింది.

సరైన కార్యాచరణ అవసరం

వ్యర్థాల ఉత్పత్తి, నిర్వహణలో సరైన, సుస్థిర యాజమాన్య పద్ధతులను చిత్తశుద్ధితో అమలు చేయడం ద్వారా అనర్థాలను తగ్గించవచ్చు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాలు, నగరాల్లో వ్యర్థాలను ప్రాథమిక స్థాయిలోనే వందశాతం పునర్వినియోగానికి ఉపయోగపడే రీతిలో మలచుకునే సామర్థ్యం పెంచుకోవాలి. ప్రభుత్వపరంగా ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ నియమాలను కఠినంగా అమలు చేయడంతో పాటు పర్యవేక్షణను పటిష్ఠీకరించాలి. పురపాలక సంఘాల పరిధిలో వెలువడే ఘన వ్యర్థాల్లో 50శాతందాకా పునర్వినియోగం చేసేందుకు నిధుల కేటాయింపులు పెంచాల్సిన అవసరముంది. వ్యర్థాలను వంద శాతం శుద్ధిచేసే లక్ష్యాల దిశగా ప్రతి పురపాలక సంస్థా కార్యాచరణ చేపట్టాలి. ప్లాస్టిక్‌తో పాటు ఘనవ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాల విస్తృతిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పునర్వినియోగ పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఎక్కడపడితే అక్కడ పారేసే చెత్త కారణంగా విషపూరిత వాయువులు, హానికర రసాయనాలు నేలలోకి ఇంకిపోయి తీవ్ర కాలుష్యానికి దారితీస్తున్నాయి. ఈ అంశాలపై పౌర సమాజంలో అవగాహన పెరగాలి. వ్యర్థాల నిర్వహణ, నిర్మూలన, పునర్వినియోగం పెరిగేలా ప్రోత్సాహకాలు అందించాలి. వ్యర్థాల అనర్థాలపై పౌర సమాజంలో ప్రవర్తనపరమైన మార్పులు తీసుకురావాలి. తద్వారా సమాజ పురోగతికి అవరోధంగా పరిణమించిన ఘన వ్యర్థాల అనర్థాలను నిలువరించడం సాధ్యపడుతుంది.


ప్లాస్టిక్‌తో తీవ్ర ముప్పు

ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్‌లో సగందాకా ఒకసారి వాడి పారేసేదే. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి పది లక్షల ప్లాస్టిక్‌ సీసాల కొనుగోలు జరుగుతోంది. ఏటా అయిదు లక్షల కోట్ల ప్లాస్టిక్‌ సంచులను వినియోగిస్తున్నారు. భూమిలో త్వరగా కలిసిపోని ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి, ఆరోగ్యానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులు- చెత్త కుప్పలు, చెరువులు, నదులు, సముద్రాల్లో పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పారేసిన ప్రాంతాల్లో భూసారం క్షీణిస్తుంది. ప్లాస్టిక్‌లోని విష రసాయనాలు భూగర్భ జలాల్లో ఇంకడం వల్ల తాగునీరు కలుషితం అవుతుంది. తీరప్రాంతాన్ని కలిగిన దేశాల నుంచి లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లో చేరుతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పక్షులు, చేపలు, జంతుజాలం మనుగడపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతరించిపోతున్న జాతుల్లో రమారమి ఏడొందలదాకా ప్లాస్టిక్‌తో ప్రభావితమైనట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సముద్ర జలాల్లో మత్స్యసంపద ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ప్రభావితం కావడం వల్ల ఆహారంలోకి మైక్రోప్లాస్టిక్‌ అవశేషాలు చేరుతూ ప్రజారోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. ప్రస్తుత ప్లాస్టిక్‌ ఉత్పత్తి, వినియోగం, రీసైక్లింగ్‌ విధానాల్లో మార్పు రాకపోతే భారీస్థాయిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లో పేరుకుపోయే ప్రమాదం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.