సుస్థిర ఆర్థిక ప్రగతికి పేటెంట్లు

భారత్‌ వ్యవసాయం నుంచి పరిశ్రమలకు, విజ్ఞానాధారిత సమాజానికి పరిణామం చెందుతోంది. నవీకరణ, మేధా హక్కులు విజ్ఞానాధారిత సమాజ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. పోటీతత్వాన్ని, జీవన ప్రమాణాలను పెంపొందిస్తాయి.

Updated : 31 Mar 2024 01:32 IST

భారత్‌ వ్యవసాయం నుంచి పరిశ్రమలకు, విజ్ఞానాధారిత సమాజానికి పరిణామం చెందుతోంది. నవీకరణ, మేధా హక్కులు విజ్ఞానాధారిత సమాజ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. పోటీతత్వాన్ని, జీవన ప్రమాణాలను పెంపొందిస్తాయి. ఇండియాలో పేటెంట్ల దరఖాస్తుల సంఖ్య పెరుగుతుండటం శుభ పరిణామం.

వ్యక్తులు, సంస్థలు కనిపెట్టిన కొత్త అంశాలకు పేటెంట్లు ఇవ్వడం నవీకరణ సాధనను, పరిశోధన-అభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. అధునాతన సాంకేతికతల బదిలీకి, అంతర్జాతీయ వాణిజ్య వృద్ధికి పేటెంట్లు దోహదం చేస్తాయి. పేటెంట్లతో నవీకరణ పథంలో దూసుకెళ్ళే పరిశ్రమలు జీడీపీ, ఉపాధి అవకాశాల వృద్ధికి కీలకమవుతాయి. 2047కల్లా 35 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపాంతరం చెందాలంటే పేటెంట్లే కీలకం. ప్రపంచంలో ఆర్థికంగా అమెరికా, చైనాల తరవాత మూడో స్థానానికి భారత్‌ చేరడం నవీకరణ, పేటెంట్ల ద్వారానే సాధ్యమవుతుంది. అమెరికాలో పేటెంట్‌ రక్షణ కలిగిన పరిశ్రమల వల్ల ఆ దేశ జీడీపీకి 41శాతానికి పైగా వాటా సమకూరుతోంది. ఆ పరిశ్రమలు అమెరికా ఉపాధి అవకాశాల్లో మూడోవంతును కల్పిస్తున్నాయి. ఇండియా సైతం నవీకరణ, పేటెంట్ల ద్వారానే అజేయ ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. 2023-24లో లక్ష పేటెంట్‌ దరఖాస్తులను మంజూరు చేసినట్లు మార్చి 16న కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రకటించింది. 2024 అంతర్జాతీయ మేధా హక్కుల సూచీలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, భారత్‌ 42వ స్థానంలో నిలుస్తోంది.

పెరిగిన దరఖాస్తులు

అంతర్జాతీయంగా 2013-23 వరకు మేధాసంపత్తి హక్కుల (ఐపీఆర్‌) దరఖాస్తుల దాఖలులో ఏటా 60శాతం చక్రీయ వార్షిక వృద్ధిరేటు నమోదయ్యింది. 2014-23 మధ్య 4.65 లక్షల పేటెంట్లు మంజూరయ్యాయి. ఇది అంతకుముందు పదేళ్లకన్నా 44శాతం అధికం. ప్రపంచ మేధాహక్కుల సంస్థ (విపో) 2023 నివేదిక ప్రకారం 16.19 లక్షల పేటెంట్‌ దరఖాస్తులను దాఖలు చేసి చైనా అగ్రస్థానం ఆక్రమించింది. 5.94 లక్షల దరఖాస్తులతో అమెరికా రెండో స్థానంలో నిలిచింది. జపాన్‌ (2.89 లక్షలు), దక్షిణ కొరియా (2.37 లక్షలు) మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. ఐరోపా దేశాల నుంచి 1.93 లక్షల పేటెంట్‌ దరఖాస్తులు దాఖలయ్యాయి. భారత్‌ ఆరో స్థానం ఆక్రమిస్తోంది. గడచిన పదేళ్లలో భారత్‌ నుంచి పేటెంట్‌ దరఖాస్తులు ఏటా 25.2శాతం చొప్పున పెరుగుతున్నాయి. 2013-14లో ఇండియా నుంచి దాఖలైన మొత్తం పేటెంట్‌ దరఖాస్తులు 42,591. వాటిలో 10,941 మాత్రమే భారతీయులవి. మిగతావి బహుళజాతి సంస్థలు, విదేశీయులు దాఖలు చేసినవే. 2022-23 వచ్చేసరికి భారత్‌ నుంచి దాఖలైన పేటెంట్‌ దరఖాస్తులు 82,811కు పెరిగాయి. అందులో భారతీయుల దరఖాస్తులు 43,301కు చేరాయి. దరఖాస్తు చేసిన పేటెంట్లలో ఆమోదం పొందినవాటి సంఖ్యా అధికమవుతోంది. భారత్‌లో 2023 డిసెంబరు వరకు మొత్తం 8.40 లక్షల పేటెంట్లు ప్రచురితమయ్యాయి. వాటిలో 2.30 లక్షలు భారతీయులవి. మెకానికల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో వరసగా 20శాతం, 16శాతం పేటెంట్‌ దరఖాస్తులు మంజూరయ్యాయి. కంప్యూటర్లు, ఎలెక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ రంగాల్లో వరసగా పదకొండు, పది, తొమ్మిది శాతం లభించాయి. జౌళి, ఆహారం, ఇతర పౌర రంగాల్లో ఒక శాతం నవీకరణే సాధ్యమైంది.

సంస్కరణలకు ప్రాధాన్యం

మేధాహక్కుల మంజూరు ద్వారా నవీకరణను వేగవంతం చేయడానికి మోదీ ప్రభుత్వం శాసన సంబంధ చర్యలూ తీసుకుంది. 2016 పేటెంట్‌ (సవరణ) నిబంధనల్లో అంకుర దరఖాస్తుదారులకు ప్రోత్సాహకాలు కల్పించారు. పేటెంట్ల దరఖాస్తు రుసుములో అంకుర సంస్థలకు 80శాతం రాయితీ ఇచ్చారు. వాటి దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేశారు. 2019 నాటి పేటెంట్‌ సవరణ నిబంధనలు చిన్న సంస్థలకు పేటెంట్‌ పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశాయి. 2020, 2021 సంవత్సరాల్లో తెచ్చిన సవరణ నిబంధనల కింద చిన్న పరిశ్రమలు, విద్యాసంస్థలకు 80శాతం రుసుము తగ్గించారు. పేటెంట్‌ సవరణ నిబంధనావళిని కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవల ప్రకటించింది. అందులో నవీకరణకు సత్వర బాటలు పరచింది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వికసిత భారతాన్ని సాధించడానికి అనువుగా పేటెంట్‌ విధానాన్ని సంస్కరించింది. మేధాహక్కుల మంజూరుకు తెచ్చిన పాలన, శాసనపరమైన సంస్కరణలు- నవీకరణ, సృజనాత్మకత సాధనకు భారత్‌ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. అయితే 2021లో తెచ్చిన ట్రైబ్యునల్‌ సంస్కరణల చట్టం కింద రద్దయిన ట్రైబ్యునళ్లలో భారత మేధాహక్కుల అప్పిలేట్‌ బోర్డు సైతం ఉంది. ఈ బోర్డు బాధ్యతలను వాణిజ్య కోర్టులు, హైకోర్టులకు అప్పగించారు. ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్న న్యాయవ్యవస్థకు ఇది అదనపు బరువే! మేధా హక్కులను ఈ పద్ధతి ఎంతవరకు సంరక్షించగలదనేది కీలక ప్రశ్న.


  • భారత్‌ 2013 వరకు మేధా హక్కుల రంగంలో ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోయింది. 2014 తరవాత పాలన, శాసనపరంగా తీసుకున్న చొరవతో మేధాహక్కుల రంగం పురోగతి సాధిస్తోంది. 2013 వరకు దేశీయంగా ఒక పేటెంట్‌ మంజూరుకు సగటున 68.4 నెలలు పడితే ఇప్పుడది 15 నెలల్లోనే మంజూరవుతోంది.

  • పేటెంట్‌ దరఖాస్తు దాఖలు నుంచి మంజూరు దశ వరకు అన్నీ వేగంగా జరిగేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ ప్రక్రియ ఒక్కో రంగంలో ఒక్కో విధంగా కొనసాగుతోంది. రసాయన పరిశ్రమలో 2013 వరకు పేటెంట్‌ దాఖలు- మంజూరు ప్రక్రియకు 64.3 నెలలు పడితే, ఇప్పుడది సగానికి తగ్గింది. పాలిమర్‌ సంబంధ పేటెంట్లకు గడువు 35.5 నెలలకు దిగి వచ్చింది.

  • భారత్‌లో 2013-14 నుంచి 2022-23 మధ్య కాలంలో మంజూరైన పేటెంట్లలో 7.2శాతం వాటాతో ఉత్తర్‌ ప్రదేశ్‌ అగ్రస్థానం ఆక్రమించింది. 5.8శాతం వాటాతో పంజాబ్‌ సైతం ముందడుగు వేసింది. గుజరాత్‌ 4.6శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచింది.

  • తెలంగాణ 2004-13 మధ్య కాలంలో పేటెంట్లలో ఒక శాతం వాటాతో సరిపెట్టుకుంది. 2014-23లో తన వాటాను నాలుగు శాతానికి పెంచుకుంది. ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. కేవలం 0.3శాతం వాటాతో హిమాచల్‌ ప్రదేశ్‌ అట్టడుగున ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు అసలు పేటెంట్ల జాబితాలో స్థానం దక్కలేదు.

 డాక్టర్‌ ఎం.వెంకటేశ్వర్లు
(ఐఐఎం-ముంబయిలో ఆర్థికశాస్త్ర ఆచార్యులు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.