సముద్ర దొంగల ఆటకట్టు!

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం, ఎర్ర సముద్రం, ఏడెన్‌ సింధుశాఖల్లో రవాణా నౌకలపై హూతీల దాడులతో ప్రపంచం సతమతమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సందట్లో సడేమియాలాగా సోమాలియా సముద్ర దొంగలు చెలరేగిపోతున్నారు. వీరి ఆట కట్టించడానికి భారత్‌ రంగంలోకి దిగింది.

Published : 02 Apr 2024 00:43 IST

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం, ఎర్ర సముద్రం, ఏడెన్‌ సింధుశాఖల్లో రవాణా నౌకలపై హూతీల దాడులతో ప్రపంచం సతమతమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సందట్లో సడేమియాలాగా సోమాలియా సముద్ర దొంగలు చెలరేగిపోతున్నారు. వీరి ఆట కట్టించడానికి భారత్‌ రంగంలోకి దిగింది.

మెరికా, బ్రిటన్‌, ఇతర ఐరోపా దేశాలు పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్ల 2018-2023 మధ్య కాలంలో సోమాలియా సముద్ర దొంగల అరాచకాలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే, ప్రస్తుత ఇజ్రాయెల్‌-హమాస్‌ సంక్షోభం, హూతీల దాడులపై అమెరికా కూటమి ప్రధానంగా దృష్టిపెట్టడంతో సోమాలియా దొంగలకు అడ్డూ ఆపూ లేకుండా పోయింది. ప్రస్తుతం వీరి పనిపట్టే బాధ్యతను భారత నౌకాదళం తీసుకుంది. సముద్ర దోపిడులను అరికట్టడంలో మన నౌకాదళానికి 20 ఏళ్ల అనుభవం ఉంది. అందుకు కావాల్సిన సాధనసంపత్తి, సామర్థ్యాలను సంతరించుకుంది. అసలు 2008 నుంచే భారత నౌకాదళం ఎర్ర సముద్రంలో పహరా కాస్తోంది. ఇక్కడి జలాల్లో అమెరికా, ఫ్రాన్స్‌, చైనాలకన్నా ఎక్కువ సంఖ్యలో భారతీయ యుద్ధ నౌకలు సంచరిస్తున్నాయి.

రవాణా నౌకలకు అండ

ఏడెన్‌ సింధుశాఖ, ఆఫ్రికా సముద్ర తీరంలో 2008 నుంచే 106 యుద్ధ నౌకలతో ఇండియా పహరా కాస్తోంది. 3,440 రవాణా నౌకలకు భారత్‌ రక్షణగా వెళ్ళింది. 25,000 మంది రవాణా నౌకల సిబ్బందికి అండగా నిలిచింది. 2019 జూన్‌లో ఒమన్‌ సింధుశాఖలో రవాణా నౌకలపై దాడులు పెచ్చుమీరడంతో భారత నౌకాదళం ఆపరేషన్‌ సంకల్ప్‌ను చేపట్టింది. హోర్ముజ్‌ సింధుశాఖ ద్వారా పర్షియన్‌, ఒమన్‌ సింధుశాఖల మీదుగా హిందూ మహాసముద్రంలోకి వచ్చే భారతీయ రవాణా నౌకలకు అండగా నిలిచింది. ప్రస్తుతం ఎర్రసముద్రం మీదుగా వచ్చిపోయే రవాణా నౌకలపై యెమెన్‌ నుంచి హూతీ తిరుగుబాటుదారులు డ్రోన్లతో, క్షిపణులతో దాడులు చేస్తున్నారు. వీరిపై అమెరికా, బ్రిటన్‌లు నిర్వహిస్తున్న విమాన దాడుల్లో భారత్‌ పాలుపంచుకోవడం లేదు. సముద్ర దొంగల ఆటకట్టించే బాధ్యతను మాత్రం భుజాన వేసుకుంది. జిబూటీ, ఏడెన్‌ సింధుశాఖ, అరేబియా సముద్రం, సోమాలియా సముద్ర తీరంలో భారత నౌకాదళం పహరా కాస్తోంది. సముద్ర చౌర్యం, క్షిపణి, డ్రోన్‌ దాడులను నిలువరించడానికి అరేబియా సముద్రంలో 10 యుద్ధ నౌకలను ఇండియా మోహరించినట్లు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ హరికుమార్‌ ఇటీవల వెల్లడించారు. 11 జలాంతర్గాములు, 30 యుద్ధనౌకలు మిగిలిన ప్రాంతంలో గస్తీ తిరుగుతున్నాయి. కడలిలో దోపిడి దొంగల పనిపట్టడానికి సముద్ర చౌర్య నిరోధక చట్టం ఎంతగానో తోడ్పడుతున్నట్లు అడ్మిరల్‌   హరికుమార్‌ వ్యాఖ్యానించారు. సుదూరంగా ఉన్న జలాల్లో నిఘా వేసే విమానాలు, డ్రోన్లు, ప్రత్యేక కమాండో దళాలనూ భారత్‌ బరిలోకి దించింది. అరేబియా సముద్రంలో 40 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రవాణా నౌకలకు అండగా నిలుస్తోంది. గడచిన 100 రోజుల్లో 1000 రవాణా నౌకలను, పడవలను సోదా చేసింది. ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టం, 2022నాటి సముద్ర చౌర్య నిరోధ చట్టం కింద ఈ చర్యలు తీసుకుంది. తాజాగా అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన ఇరాన్‌ చేపల పడవను ఇండియా నౌకాదళం రక్షించింది. దాదాపు 12 గంటల పాటు సాగిన ప్రత్యేక ఆపరేషన్‌లో నౌకలోని 23 మంది పాకిస్థాన్‌ సిబ్బందిని సురక్షితంగా కాపాడింది. తొమ్మిది మంది సముద్ర దొంగలను అదుపులోకి తీసుకుంది.

క్రియాశీల పాత్ర

హిందూ మహాసముద్రంలో సముద్ర దొంగల ఆటకట్టించడంలో ప్రదర్శిస్తున్న నేర్పు భారత నౌకదళానికి అంతర్జాతీయ ప్రాముఖ్యం తెచ్చిపెడుతోంది. సోమాలియా సముద్ర తీరాన రుయెన్‌ నౌకలో మన నౌకాదళం రక్షించిన సిబ్బందిలో బల్గేరియాకు చెందిన నావికులూ ఉన్నారు. వారిని కాపాడినందుకు బల్గేరియా అధ్యక్షుడు రుమెన్‌ రాదెవ్‌ భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన కార్యనిర్వహణ స్వేచ్ఛ, ప్రోత్సాహాల వల్ల భారత సైన్యం, నౌకాదళం దూకుడుగా ముందుకెళ్ళి గొప్ప విజయాలు సాధిస్తున్నాయని రక్షణ నిపుణుడు యోగేశ్‌ జోషీ వ్యాఖ్యానించారు. ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రాలలో భారత నౌకాదళం క్రియాశీల పాత్ర పోషిస్తోందని బ్రిటన్‌ నౌకాదళాధిపతి అడ్మిరల్‌  బెన్‌ కీ ఫిబ్రవరిలో అభినందించారు. సముద్రంలో సవాళ్లను ఎదుర్కోవడంలో భారత నౌకాదళం అజేయ శక్తి అని నిరూపితమవుతోంది. హిందూ మహాసముద్రంలో అవసరమైతే పెద్ద నౌకా బలగాన్ని దించి శత్రువును చిత్తు చేయగలననే సందేశాన్ని చైనాకు పరోక్షంగా ఇండియా పంపుతోంది. భారత నౌకాదళం ప్రాంతీయ శక్తి స్థాయి నుంచి అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోంది.


అద్భుత విజయం

నిరుడు డిసెంబరులో, ఈ ఏడాది జనవరి, మార్చిలో దాదాపు పది నౌకలపై సముద్ర దొంగలు దాడులు చేశారు. భారతీయ యుద్ధ నౌకలు వెంటనే రంగంలోకి దిగి వాటిని రక్షించాయి. సోమాలియా సముద్ర తీరంలో రుయెన్‌ నౌకపై దాడిని ఎదుర్కోవడంలో భారత నౌకాదళ విజయం ప్రపంచం ప్రశంసలు అందుకుంది. నిరుడు డిసెంబరు 14న రుయెన్‌ నౌకను సోమాలియా దొంగలు హైజాక్‌ చేశారు. దాన్ని మార్చి 15న భారత్‌కు చెందిన కలకత్తా యుద్ధ నౌక అడ్డుకుంది. మార్చి 16న నౌకలోకి ఎక్కి సముద్ర దొంగలను అరెస్టు చేసింది. 17 మంది నౌకా సిబ్బందిని, 37,800 టన్నుల సరకును కాపాడింది. భారత నౌకాదళం అత్యంత లాఘవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మొదట సి-17 రవాణా విమానం ద్వారా రెండు రబ్బరు బోట్లను, మెరైన్‌ కమాండో (మార్కోస్‌) దళ సభ్యులను సముద్రంలో జారవిడిచింది. సి-17 రవాణా విమానం భారత్‌ నుంచి బయలుదేరి 2,600 కిలోమీటర్ల దూరం పయనించి మరీ బోట్లను, కమాండోలను అరేబియా సముద్రంలో దించింది. కమాండోలు గుట్టుగా రబ్బరు బోట్లలో రుయెన్‌ నౌక వద్దకు చేరి, అందులోకి ప్రవేశించి సముద్ర దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఇలా రవాణా విమానం, యుద్ధ నౌక, డ్రోన్లు, కమాండోలను పకడ్బందీ ప్రణాళిక ప్రకారం నియోగించి లక్ష్యం సాధించడం గొప్ప విషయమని అమెరికాకు చెందిన కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ సంస్థ నిపుణుడు జాన్‌ బ్రాడ్‌ ఫోర్డ్‌ ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.