అసమానతలు ఇంతలంతలు

అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్‌లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి.

Updated : 08 Apr 2024 10:56 IST

అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్‌లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి.

పారిస్‌కు చెందిన ప్రపంచ అసమానతా గణక సంస్థ (వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌) వెలువరించిన ఇటీవలి నివేదిక ఆందోళనకరమైన వాస్తవాలను వెల్లడించింది. నలుగురు విఖ్యాత ఆర్థిక    వేత్తలు కలిసి రూపొందించిన నివేదిక అది. దాని ప్రకారం, భారత్‌ ప్రపంచంలో తీవ్రమైన అసమానతలకు నెలవుగా మారింది. ఇండియా జనాభాలో అత్యున్నత అంచెలోని ఒక శాతం సంపన్నుల వద్ద 40శాతం జాతీయ సంపద, 22.6శాతం జాతీయాదాయం పోగుపడ్డాయి. స్వాతంత్య్రానికి పూర్వం 1922లో దేశీయంగా అత్యున్నత అంచెలోని ఒకశాతం సంపన్నుల చేతిలో 13శాతం జాతీయాదాయం ఉండేది. 1951లో అది 11.5శాతానికి తగ్గింది. ఆర్థిక సంస్కరణలకు ముందు, 1980ల్లో ఆ వాటా ఆరు శాతానికి దిగివచ్చింది. 1951లో భారతీయ సమాజంలో అత్యున్నత శ్రేణిలోని 10శాతం- 36.7శాతం జాతీయాదాయాన్ని చేజిక్కించుకున్నారు. 2022కు వచ్చేసరికి అది ఎకాయెకి 57.7శాతానికి పెరిగింది. కింది అంచెల్లోని సగం జనాభా వద్ద 1951లో 20.6శాతం జాతీయాదాయం ఉండేది. 2022 నాటికి అది 15శాతానికి తగ్గిపోయింది. దేశ జనాభాలో 40శాతంగా ఉన్న మధ్యతరగతి వాటా 1951నాటి 42.8శాతం నుంచి 2022లో 27.3శాతానికి పడిపోయింది. అమెరికా, బ్రిటన్‌లోనూ లేనంత ఆదాయపరమైన అసమానతలు భారత్‌లో నెలకొన్నాయి.

పేదరికం నిజంగానే తగ్గిందా?

బ్రిటిష్‌ వలస పాలనలోనూ లేనంతగా ఆర్థిక అసమానతలు నేడు భారత్‌లో రాజ్యమేలుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా 2014-2023 మధ్య కాలంలో ఆర్థిక అసమానతలు పేట్రేగాయని, కేంద్రం విధానాలే దీనికి కారణమని ఆరోపిస్తున్నాయి. మరోవైపు 1991 ఆర్థిక సంస్కరణల వల్ల సంపన్నులకు మాత్రమే మేలు జరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది. 2022లో భారత్‌ ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినా పేద, మధ్యతరగతికి ఎలాంటి లబ్ధీ చేకూరలేదన్న విమర్శలు రేగుతున్నాయి. భారత్‌లో బహుముఖ పేదరికం తగ్గిపోయిందంటూ నీతి ఆయోగ్‌ ఇటీవల వెలువరించిన నివేదికపైనా సందేహాలు తలెత్తాయి. 2013-14లో దేశీయంగా 27.17 శాతం ప్రజలు బహుముఖ పేదరికాన్ని ఎదుర్కొన్నారు. 2022-23నాటికి వారు 11.28 శాతానికి తగ్గినట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది. దేశంలో ఆకలి, పేదరికాలు నిజంగానే తగ్గాయని చెప్పలేమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి పేదరికం తగ్గితే ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

సంపన్న దేశాలతో పోలిస్తే వర్ధమాన దేశాల్లో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం బలీయ పాత్ర పోషిస్తుంది. అయినవాళ్లకు అన్నీ దోచిపెట్టే సంస్కృతి ఇది. ప్రభుత్వ ఆధీనంలోని రక్షణ, గనులు, రేవులు, ఇంధన రంగాల్లో అంతేవాసులకే అన్నీ సమకూర్చిపెట్టడం ఆనవాయితీ అయిపోయింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వాల నుంచి లబ్ధిపొందిన సంస్థలు ఎన్నికల బాండ్ల రూపేణా అధికార పక్షాలకు భారీగా నిధులు అందించాయని, ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా న్యాయంగా జరగడానికి ఎలెక్టోరల్‌ బాండ్లు అడ్డంకిగా నిలుస్తాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆశ్రిత పెట్టుబడిదారులకు లబ్ధి కలిగించడం కోసమే పలు చట్టాలకు సవరణలు చేశారన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి.

విశ్వసనీయత ప్రశ్నార్థకం

భారత్‌లో నీతి ఆయోగ్‌తో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలు ప్రచురించే ఆర్థిక సమాచార విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోంది. పేదరికం, నిరుద్యోగం, పోషకాహార లోపం గురించి నిజమైన సమాచారాన్ని ప్రభుత్వం అందించడం లేదన్న విమర్శలున్నాయి. వీటికి సంబంధించి అంతర్జాతీయ సంస్థలు వెలువరిస్తున్న సమాచారం సరైంది కాదంటూ ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. అసలు భారతదేశ జీడీపీ వివరాలే అనుమానాస్పదమని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ అంటున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా జీడీపీ పెరగడం లేదని ఆయన విశ్లేషిస్తున్నారు. ద్రవ్యోల్బణం మూడు నుంచి అయిదు శాతం పెరిగినా ప్రభుత్వం మాత్రం ఒక శాతం నుంచి 1.5శాతమే పెరిగినట్లు వాదిస్తోందని సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం 2021లో జనగణనను చేపట్టలేదు. కొవిడ్‌ విజృంభణ వల్ల వాయిదాపడిన జనగణన ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సరైన జనాభా లెక్కలు లేకపోవడం వల్ల చాలామంది అర్హులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారన్న వాదనలున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆదాయం కోసం వస్తుసేవల పన్ను వసూళ్లపై అతిగా ఆధారపడుతున్నారని, ఈ పన్ను వల్ల పేదల జీవితాలు మరింత ఇక్కట్లలోకి జారుకుంటాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పెరిగిన కోటీశ్వరులు

ప్రపంచవ్యాప్తంగా గడచిన పాతికేళ్లలో ఆశ్రిత పెట్టుబడిదారుల వద్ద పోగుపడిన సంపద 31,500 కోట్ల డాలర్ల నుంచి 2023లో మూడు లక్షల కోట్ల డాలర్లకు పెరిగిందని ఎకనామిస్ట్‌ పత్రిక అంచనా వేసింది. మరోవిధంగా చెప్పాలంటే- ప్రపంచ జీడీపీలో కుబేరుల వాటా 25 ఏళ్ల క్రితం ఒక శాతం ఉంటే, 2023లో అది మూడు శాతానికి పెరిగింది. ఈ పెరుగుదలలో 60శాతానికి పైగా అమెరికా, చైనా, రష్యా, భారతదేశాల్లోనే సంభవించింది. 43 దేశాల ఆశ్రిత పెట్టుబడిదారీ సూచీలో భారత్‌ పదో స్థానంలో నిలుస్తోంది. చైనా 21, అమెరికా 26 స్థానాల్లో ఉన్నాయి. జపాన్‌, జర్మనీలు 36, 37వ స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలో అత్యధిక పేదలకు నిలయమైన భారత్‌ కుబేరుల సంఖ్యలో మూడో స్థానం ఆక్రమిస్తోంది. ఇక్కడ 162 మంది శతకోటీశ్వరులున్నారని ఫోర్బ్స్‌ పత్రిక నిరుడు ప్రకటించింది. అమెరికాలో అత్యధికంగా 735 మంది, చైనాలో 562 మంది శతకోటీశ్వరులున్నారు. వాటి తరవాతి స్థానం ఇండియాదే. అంటే జర్మనీ, జపాన్‌, బ్రిటన్‌, స్విట్జర్లాండ్‌ వంటి సంపన్న దేశాలకన్నా భారత్‌లో ఎక్కువ మంది శతకోటీశ్వరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.