అప్పుల కుప్పలు... దేశానికి తిప్పలు!

మన దేశంలో రాజకీయ పార్టీలు సామాజిక సంక్షేమం పేరిట ఓటర్లకు అనేక ఉచిత వరాలు ప్రకటిస్తున్నాయి. వాటిని అమలు చేయడానికయ్యే ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచే భరించాల్సి ఉంటుంది.

Published : 17 Apr 2024 01:24 IST

మన దేశంలో రాజకీయ పార్టీలు సామాజిక సంక్షేమం పేరిట ఓటర్లకు అనేక ఉచిత వరాలు ప్రకటిస్తున్నాయి. వాటిని అమలు చేయడానికయ్యే ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచే భరించాల్సి ఉంటుంది. దానివల్ల పడే ఆర్థిక భారాన్ని తట్టుకోవడానికి తలకు మించి అప్పులు చేయవలసి వస్తుందనే వాస్తవాన్ని రాజకీయ పక్షాలు విస్మరిస్తున్నాయి.

రుణ భారాన్ని తీర్చడం అభివృద్ధి ద్వారానే సాధ్యం. ఉత్పత్తిని, ఉపాధి అవకాశాలను పెంచినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పెరిగి రుణాలను తీర్చివేసే స్తోమత లభిస్తుంది. అందుకే అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేయాలి. అలాకాకుండా ఉచిత వరాల కోసం అదేపనిగా అప్పులు చేస్తూ అభివృద్ధిని అలక్ష్యం చేస్తే రుణ ఊబి నుంచి బయటపడలేని దుస్థితి నెలకొంటుంది. దాంతో ప్రజలపై అధిక పన్నులు వేసి ఆదాయాన్ని పెంచుకోవడం ప్రభుత్వానికి అనివార్యంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వ రుణ భారం గురించి లోతుగా విశ్లేషించి దాన్ని అధిగమించడం గురించి ఆలోచన చేయవలసి ఉంది.

అప్పుల ఊబిలో...

భారత్‌లో 2023 సెప్టెంబరు చివరకు రూ.157.84 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం ప్రభుత్వ రుణభారం, డిసెంబరు చివరికల్లా రూ.160.69 లక్షల కోట్లకు పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజా నివేదిక వెల్లడించింది. 2023-24 మూడో త్రైమాసికంలో భారతదేశ మొత్తం రుణ భారంలో 90 శాతం ప్రభుత్వ రుణాలేనని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్వదేశీ, విదేశీ రుణాలను కలిపి ప్రభుత్వ రుణ భారంగా పరిగణిస్తారు. పాత రుణాలపై వడ్డీ, అసలు చెల్లింపులు కూడా దీనిలో భాగమే. ఇంకా భవిష్య నిధి, చిన్న పొదుపు మొత్తాల చెల్లింపులు, భారత ఆహార సంస్థ, చమురు కంపెనీలు జారీ చేసిన ప్రత్యేక సెక్యూరిటీలకు జరపాల్సిన చెల్లింపులు కూడా ప్రభుత్వ రుణ భారంలో అంతర్భాగమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతమేరకు రుణాలు తీసుకోవచ్చో నిర్దేశించే ద్రవ్యపరమైన బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టాన్ని 2003లో ప్రభుత్వం తెచ్చింది. 2024-25కల్లా స్థూల ప్రభుత్వ రుణాన్ని దేశ జీడీపీలో 60 శాతానికి పరిమితం చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. అందులో కేంద్ర ప్రభుత్వ రుణాలు 40 శాతానికి మించరాదు. కానీ, ప్రభుత్వ రుణ తగ్గింపు లక్ష్యం ఇంతవరకు నెరవేరలేదు. 2020నాటి కొవిడ్‌ సంక్షోభం ఆర్థికపరమైన అస్తవ్యస్తతకు దారితీయడమే దీనికి ప్రధాన కారణం.

కొవిడ్‌ కాలంలో ప్రభుత్వానికి పన్ను ఆదాయం తగ్గిపోవడంతో ప్రభుత్వాలు కొత్త రుణాలు తీసుకోవలసి వచ్చింది. అందుకే 2018-19 జీడీపీలో 48.1 శాతంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రుణభారం 2019-20లో 50.7 శాతానికి, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 60.8 శాతానికి పెరిగి పోయింది. 2022-23లో అది స్వల్పంగా 55.9 శాతానికి తగ్గినా 2023-24లో మళ్ళీ 56.9 శాతానికి పెరిగింది. 2024-25లో రుణ భారం జీడీపీలో 56 శాతంగా ఉంటుందని అంచనా. దీన్ని యుద్ధ ప్రాతిపదికపై తగ్గించాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ రుణాన్ని జీడీపీలో నిర్దిష్ట శాతంగా లెక్కిస్తున్నారు. రుణాన్ని నేరుగా తగ్గించడం ఒక పద్ధతి అయితే, జీడీపీని పెంచడం మరో పద్ధతి. వ్యయంకన్నా ఆదాయం ఎక్కువగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. జీడీపీ పెరిగినప్పుడు జీడీపీ-రుణ నిష్పత్తిలో సానుకూలమైన మార్పు వస్తుంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఈ వాస్తవాన్ని కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలూ గుర్తించాలి. ఎన్నికల్లో లబ్ధి కోసం ఎడాపెడా అప్పులు చేయడం మానాలి. ఉత్పత్తి కార్యకలాపాల కోసమే రుణాలు తెచ్చి, పెట్టుబడులను పెంచి అభివృద్ధి సాధించడం ద్వారా వాటిని తీర్చివేయాలి. ఇలా ఆచితూచి ఖర్చు చేస్తూ పెట్టుబడులను పెద్దయెత్తున ఆకర్షించినప్పుడు రాష్ట్రాలు ఆర్థికంగా పురోగమించగలుగుతాయి. మౌలిక వసతుల అభివృద్ధి, నిపుణ మానవ వనరుల సృష్టి, హరిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి చేసే ఖర్చు నాణ్యమైనది అవుతుంది. దానివల్ల ప్రభుత్వాలకు ఆదాయం పెరిగి అప్పుల తిప్పలు తప్పుతాయి. సామాజిక రంగంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహించడం ద్వారా కూడా ప్రభుత్వాలు భారం తగ్గించుకోవచ్చు.

స్థిరమైన అభివృద్ధి

కేంద్రం, రాష్ట్రాలు అనుత్పాదక వ్యయాన్ని తగ్గించి అదనపు పన్ను వసూళ్లను సాధించడం ద్వారా రుణ భారాన్ని తగ్గించగలుగుతాయి. లేదా జీడీపీని పెంచడం ద్వారా రుణాల స్థాయిని అదుపులో ఉంచగలుగుతాయి. ఈ రెండు మార్గాలను వేర్వేరుగా లేదా కలగలిపిగాని అవలంబించడం ద్వారా కేంద్రం, రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితిని పటిష్ఠం చేసుకోవాలి. అదే జరిగినప్పుడు స్వదేశీ, విదేశీ పెట్టుబడులు తరలి వస్తాయి. అభివృద్ధి, దానితోపాటే ఆదాయాలూ పెరుగుతాయి. రుణాలపై ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుంది. దీర్ఘకాలంలో సుస్థిర ప్రగతి సుసాధ్యమవుతుంది. ప్రజలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు తద్వారా ఆదాయాలు పెరిగినప్పుడు వారు ఉచిత వరాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. స్వశక్తితో వృద్ధి చెందగలుగుతారు. అది కుటుంబాలతో పాటు ప్రభుత్వ రుణభారాన్ని కూడా తగ్గిస్తుంది. రేపు ఎన్నికలు ముగిసి కొత్త కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడగానే రుణాలకు పగ్గాలు వేయడంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఉచిత వరాల మీద కాకుండా అభివృద్ధి ఫలాలను పంచడం ద్వారా స్థిరమైన పురోగతి సాధించడం సముచితం.


రుణ విమోచనకు ప్రాధాన్యం

భారత్‌ ప్రగతి పథంలో పరుగులు తీయాలంటే రుణభారాన్ని తగ్గించి అభివృద్ధి సాధనకు ఎక్కువ నిధులు వెచ్చించడం అనివార్యం. రుణ భారంలో రెండు భాగాలుంటాయి. ఒకటి ప్రైవేటు రుణభారం, రెండోది ప్రభుత్వ రుణభారం. భారతదేశంలో కుటుంబాల రుణ భారం 2023 డిసెంబరు నాటికి జీడీపీలో 40 శాతానికి చేరిందని ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇటీవల వెల్లడించింది. దీన్ని నియంత్రించడం అవసరం. ఆదాయ వ్యయాలు, రుణాల మధ్య సమతూకం ఉండేలా కుటుంబాలు, ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి. దీనికి సరైన ఆర్థిక నిర్వహణ చట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వాలు అనుత్పాదక వ్యయాన్ని తగ్గించుకొని అదనపు పన్నుల ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా రుణ భారాన్ని తగ్గించాలి. పన్ను వసూళ్లు సక్రమంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలి. ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి జీఎస్టీ, ఆదాయ పన్ను చెల్లింపుల్లో తేడాలను అరికట్టాలి. తద్వారా పన్ను ఎగవేతలను నివారించాలి. ఇలా ఆదాయం పెంచుకుంటూ అప్పుల మీద ఆధారపడాల్సిన అగత్యాన్ని తగ్గించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.