అట్టుడుకుతున్న పశ్చిమాసియా

గాజాపై ఇజ్రాయెల్‌ దండయాత్రతో ఇప్పటికే పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. దీనివల్ల సంఘర్షణలు విస్తరిస్తే పశ్చిమాసియా అగ్నిగుండంలా మారుతుంది.  

Updated : 18 Apr 2024 05:23 IST

గాజాపై ఇజ్రాయెల్‌ దండయాత్రతో ఇప్పటికే పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. దీనివల్ల సంఘర్షణలు విస్తరిస్తే పశ్చిమాసియా అగ్నిగుండంలా మారుతుంది.

ఇజ్రాయెల్‌ ఈ నెల మొదట్లో డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై దాడి చేసింది. అందులో ఏడుగురు సైనికాధికారులతో పాటు ఖుద్స్‌ దళానికి చెందిన ఇద్దరు కమాండర్లు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో రగిలిపోయిన ఇరాన్‌- తాజాగా తన సొంత భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పై వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఫ్రాన్స్‌, జోర్డాన్‌, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా వాటిని కూల్చేశాయి. కొన్ని క్షిపణులు నెవాటిమ్‌ వాయుసేన స్థావరాన్ని తాకినా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ఇరాన్‌పై ప్రతిదాడి తప్పదని టెల్‌ అవీవ్‌ హెచ్చరించడం తీవ్ర భయాందోళనలు రేపుతోంది.

నెతన్యాహు చేతుల్లో...

ఈ ఏడాది జనవరిలో ఇరాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఆ రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. మొన్నటి ఇరాన్‌ దాడికి వాటితో పోలిక ఉంది. జనవరిలో తొలుత పాకిస్థాన్‌పై ఇరాన్‌ దాడికి దిగింది. అనంతరం పాక్‌ ప్రతీకారం తీర్చుకుంది. అయితే, ఆ దాడుల్లో రెండు దేశాల సాధారణ పౌరులెవరూ మరణించలేదు. కేవలం ముష్కర మూకలనే అవి లక్ష్యం చేసుకున్నాయి. అనంతరం దౌత్యస్థాయి సంప్రతింపులతో పరిస్థితులు కుదుటపడ్డాయి. ఇజ్రాయెల్‌పై దాడి సమాచారాన్ని 72 గంటల ముందే అమెరికాకు చెప్పామని ఇరాన్‌ అంటోంది. అగ్రరాజ్యం మాత్రం దాన్ని ఖండిస్తోంది. వాణిజ్య సముదాయాలు, జనసమూహాలను తాము లక్ష్యంగా చేసుకోలేదని, ఇజ్రాయెల్‌ను శిక్షించేందుకు, తమను రక్షించుకునేందుకే దాడి జరిపినట్లు టెహరాన్‌ వెల్లడించింది. తద్వారా ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లకుండా అది తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఇజ్రాయెల్‌ మళ్ళీ తప్పు చేస్తే, తీవ్రంగా స్పందిస్తామని టెహరాన్‌ హెచ్చరించింది. ఇది కేవలం ఇరాన్‌-ఇజ్రాయెల్‌ వివాదమని, అమెరికా ఇందులో జోక్యం చేసుకోకూడదని హెచ్చరించింది. అయితే, ఇజ్రాయెల్‌పైకి క్షిపణులు పంపడం ద్వారా ఇరాన్‌ తన సైనిక శక్తిని చాటుకోవడానికి అవకాశం దక్కింది. దాడి తరవాత ఇరాన్‌, పాలస్తీనా, లెబనాన్‌, సిరియా, ఇరాక్‌లలో సంబరాలు చేసుకున్నారు.

ఇరాన్‌లోని అణు స్థావరాలను నాశనం చేయాలని ఇజ్రాయెల్‌ ఎప్పటినుంచో కలలు కంటోంది. టెహరాన్‌ తాజా దాడితో అందుకు అవకాశం చిక్కింది. అయితే, సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్‌, కువైట్‌, ఖతార్‌లు తమ దేశాల్లోని స్థావరాలను, గగనతలాన్ని అమెరికా వినియోగించుకోకుండా నిషేధం విధించాయి. తద్వారా ఈ వివాదంలోకి తమను లాగకుండా అవి జాగ్రత్తపడ్డాయి. గగనతలంపై నిషేధంవల్ల ఇరాన్‌లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడిచేసే అవకాశం లేదు. ఒకవేళ అదే జరిగితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమంటాయి. ప్రస్తుతం అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు దండిగా ఆయుధాలు లభిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు ఇది కలిసివచ్చే అంశం. ఐరోపా దేశాలు సైతం టెల్‌అవీవ్‌కు మద్దతు పలుకుతున్నాయి. తాజా దాడి నేపథ్యంలో ఇరాన్‌పై ఆంక్షలు మరింతగా పెరగవచ్చు. మరోవైపు ప్రతిదాడి ద్వారా ఉద్రిక్తతలు పెంచవద్దని ఇజ్రాయెల్‌ మీదా ఒత్తిడి అధికమవుతుంది. ఇజ్రాయెల్‌ భద్రతకు తాను పూచీపడినా, ఇరాన్‌ మీద ఎలాంటి దాడిలో పాలుపంచుకోబోమని బైడెన్‌ సర్కారు తేల్చిచెప్పింది. దీనివల్ల టెల్‌అవీవ్‌ వెనకడుగు వేయవచ్చు. అయితే, సంఘర్షణలు రగులుతున్నంత కాలమే తన సర్కారు మనుగడలో ఉంటుందని నెతన్యాహుకు బాగా తెలుసు. అతడి రాజీనామాకు ఇంటా బయటా డిమాండ్లు పెరుగుతున్నాయి. నెతన్యాహు సలహాదారుల్లో యుద్ధోన్మాదులు ఇరాన్‌పై ప్రతిదాడికి దిగాలని సూచిస్తున్నారు. అందుకు టెహరాన్‌ ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని చెబుతున్నారు. ఒకవేళ ప్రతిదాడి జరపకపోతే- ఇజ్రాయెల్‌ మీదకు బాంబులు ప్రయోగించి ఆ తరవాత దాని నోరు మూయించిన ఏకైక అరబ్‌ దేశం తానేనని ఇరాన్‌ ఢంకా మోగించే అవకాశముంది. ప్రస్తుతానికి ఇజ్రాయెల్‌ ప్రాథమ్యాల విషయంలో నెతన్యాహుకు సరైన స్పష్టత అవసరం. గాజా మీద, హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న తమ పౌరులను విడిపించుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించాలా... లేదంటే పశ్చిమాసియాలో ఘర్షణలను మరింత పెంచాలా అనేది ఆయన చేతుల్లోనే ఉంది. ఒకవేళ ఉద్రిక్తతలు పెరిగితే, అందుకు కారణమైన ఇజ్రాయెల్‌ ఏకాకిగా మిగలవచ్చు. ఇప్పటిదాకా దానికి అండగా నిలుస్తున్న దేశాలు మొహం చాటేయవచ్చు. మరోవైపు అన్నివేళలా ఇజ్రాయెల్‌కు దన్నుగా ఉంటానని అమెరికా హామీ ఇచ్చింది. దాన్ని అనువుగా తీసుకొని టెల్‌అవీవ్‌ ప్రతిదాడికి పూనుకొంటే, అగ్రరాజ్యాన్నీ వివాదంలోకి లాగినట్లవుతుంది.

ప్రపంచ దేశాల కృషి

ఇరాన్‌ దాడి విషయమై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) అత్యవసర సమావేశం స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఒకవేళ యూఎన్‌ఎస్‌సీలో ఇరాన్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టినా రష్యా, చైనాలు అడ్డుకునే అవకాశముంది. మరోవైపు ఇరాన్‌ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దాడిని భద్రతా మండలి ఖండించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాలు, పశ్చిమాసియా మరో యుద్ధాన్ని భరించే స్థితిలో లేవని ఐరాస సెక్రటరీ జనరల్‌ వ్యాఖ్యానించారు. ఖతార్‌, పాకిస్థాన్‌, వెనెజువెలా, చైనాలు సైతం ఇరాన్‌ దాడిని ఖండించకుండానే శాంతి స్థాపనకు పిలుపిచ్చాయి. ఐరోపా సంఘం, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, మెక్సికో, చెక్‌ రిపబ్లిక్‌, డెన్మార్క్‌, నార్వే, నెదర్లాండ్‌లు మాత్రం ఇరాన్‌ చర్యను ఖండించాయి. జీ7 దేశాలు సైతం ఇరాన్‌, అది పెంచి పోషిస్తున్న వేర్పాటువాద మూకలు వెంటనే దాడులను ఆపాలని సంయుక్త ప్రకటనలో కోరాయి. ఇరు దేశాలు సంయమనం పాటించి, దౌత్యమార్గంలో వివాదాన్ని పరిష్కరించుకోవాలని భారత్‌ సూచించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య చర్చలు స్తంభించాయి. దానివల్ల గాజాలో విధ్వంసం మరింతకాలం కొనసాగుతుంది. మరోవైపు ఇరాన్‌పై ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్‌ హుంకరిస్తోంది. అదే జరిగితే పశ్చిమాసియాలో రావణకాష్ఠం రగులుతూనే ఉంటుంది. పరిస్థితి అంతవరకూ వెళ్ళకుండా ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.


పాక్‌కు కొత్త చిక్కు

తాజా పరిణామాలతో ఇరాన్‌, పాకిస్థాన్‌ల మధ్య గ్యాస్‌ పైప్‌లైన్‌ నిర్మాణ ఒప్పందం చిక్కుల్లో పడింది. దీన్ని ఆంక్షల నుంచి తొలగించాలని అమెరికాను పాకిస్థాన్‌ కోరుతోంది. ఇరాన్‌ దాడివల్ల ఇప్పుడు దానికి అంగీకారం లభించే అవకాశం లేదు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పైప్‌లైన్‌ నిర్మాణం పూర్తికాకుంటే పాక్‌ 1800 కోట్ల డాలర్ల జరిమానాను ఇరాన్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాక్‌కు అది మూలిగే నక్కపై తాటిపండు పడిన చందమే అవుతుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.