కోతల్లేని విద్యుత్‌ సరఫరా కోసం...

నేడు మానవాళి ప్రాథమిక అవసరాలలో విద్యుత్‌ పాత్ర కీలకం. జనాభా పెరగడం, కొనుగోలు శక్తి అధికం కావడం, కరెంటు లైన్లు మూలమూలకు విస్తరించడంతో అన్ని రంగాల్లో వినియోగం పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఏసీలు వంటి విద్యుత్‌ ఉపకరణాల వాడకం జోరందుకుంది. ఫలితంగా, ఏటా వేసవిలో గరిష్ఠ డిమాండ్‌, వినియోగం ఎప్పడికప్పుడు పాత రికార్డులను అధిగమిస్తున్నాయి.

Updated : 24 Apr 2024 06:42 IST

నేడు మానవాళి ప్రాథమిక అవసరాలలో విద్యుత్‌ పాత్ర కీలకం. జనాభా పెరగడం, కొనుగోలు శక్తి అధికం కావడం, కరెంటు లైన్లు మూలమూలకు విస్తరించడంతో అన్ని రంగాల్లో వినియోగం పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఏసీలు వంటి విద్యుత్‌ ఉపకరణాల వాడకం జోరందుకుంది. ఫలితంగా, ఏటా వేసవిలో గరిష్ఠ డిమాండ్‌, వినియోగం ఎప్పడికప్పుడు పాత రికార్డులను అధిగమిస్తున్నాయి.

త దశాబ్ద కాలంలో భారతదేశ గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 135 నుంచి 243 గిగావాట్లకు చేరుకుంది. తలసరి విద్యుత్‌ వినియోగం 890 నుంచి 1327 యూనిట్లకు ఎగబాకింది. వేగంగా పురోగమిస్తున్న భారత్‌లో విద్యుత్‌ వినియోగం నిలకడైన పెరుగుదలతో 2030 చివరికి గరిష్ఠ డిమాండు, వినియోగం మరో 50శాతం పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం పలురాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో విద్యుత్‌ డిమాండ్‌ నమోదు అవుతోంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని సాధించడం ఒక సవాలు. సరళీకరించిన విద్యుత్‌ చట్టం-2003తో ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి.  ప్రైవేట్‌ రంగ స్థాపిత సామర్థ్యం 23శాతం నుంచి 51శాతం చేరుకోగా, మొత్తం సామర్థ్యం 434 గిగావాట్లకు, ఉత్పత్తి 1624 బిలియన్‌ యూనిట్లకు చేరింది. అందుకని, నేడు గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ రెండింతలు అయినప్పటికీ (మొత్తం ఉత్పత్తిలో మూడో వంతు ప్రైవేట్‌ రంగం నుంచి తీసుకొని) లోటు/కోతలు లేకుండా సరఫరా చేయగలిగే పరిస్థితి నెలకొంది. గత దశాబ్దంలో విద్యుత్‌ ఉత్పత్తి లోటు కొనసాగినా, ప్రస్తుతం సరిపడా అందించగలుగుతున్నాం.

స్వచ్ఛ ఇంధనాలు

ప్రపంచ దేశాలు వాతావరణ కాలుష్య కారక థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను తగ్గించాలని, స్వచ్ఛ ఇంధనాలను వినియోగించాలని తలపెట్టాయి. మన దేశం 2030 నాటికి స్వచ్ఛ ఇంధనాల ద్వారా 50శాతం ఉత్పత్తిని సాధించే యత్నంలో భాగంగానే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల స్థాపనను నియంత్రిస్తూ సౌర, పవన వనరులవంటి సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పత్తిని విశేషంగా ప్రోత్సహిస్తోంది. అయినప్పటికీ నేటికీ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి వాటా 70శాతంపైగానే ఉండగా, స్వచ్ఛ ఇంధనాల ఉత్పత్తి వాటా 21శాతం మాత్రమే. నూతనంగా జల, అణు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను స్థాపించడానికి పర్యావరణ ఉద్యమకారుల నుంచి గట్టి వ్యతిరేకత ఎదురవుతోంది. మిగతా ప్రత్యామ్నాయ ఇంధనాలైన బయోమాస్‌, వ్యర్థాల నుంచి విద్యుత్తు తదితర విధానాల్లో కొద్ది మొత్తంలోనే ఉత్పత్తికి అవకాశం ఉంది. థర్మల్‌ విద్యుత్తును తగ్గించాలంటే ఆ మేరకు సౌర, పవన విద్యుదుత్పత్తి కేంద్రాలను విరివిగా స్థాపించాలి. ఈ క్రమంలో వీటిలో సులభంగా, నమ్మకంగా లభ్యమయ్యే సౌర విద్యుత్తును 2030 నాటికి 350 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ సౌర మిషన్‌ లాంటి కార్యక్రమం ద్వారా పెద్దయెత్తున విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను స్థాపిస్తున్నారు. వివిధ పథకాల ద్వారా వ్యవసాయంలో, భవనాలపై వినియోగదారులే స్వయంగా సౌర విద్యుత్‌ ఫలకలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. తెలంగాణలో సౌర విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 15,497 మెగావాట్లు. ప్రభుత్వ కార్యాలయ భవనాలపైన, గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలను స్థాపించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సౌర విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 3755 మెగావాట్లు. పవన విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 3638 మెగావాట్లు. మరిన్ని కేంద్రాల ఏర్పాటు దిశగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. సౌర విద్యుత్‌ కేవలం పగటి వేళల్లోనే సాధ్యంకావడం, పవన విద్యుత్తు గాలి తీవ్రతపై ఆధారపడి ఉండటం వల్ల రాత్రిపూట అనూహ్యంగా వచ్చే డిమాండ్‌ను తట్టుకోలేవు. ముఖ్యంగా వేసవికాలంలో జల విద్యుత్తుకు అవకాశం ఉండదు. కాబట్టి, గ్రిడ్‌ నిర్వహణ కష్టతరం అవుతుంది. ఒక్కోసారి పతనమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో సరఫరాలో కోత విధించాల్సి వస్తుంది. ఇలాంటి చర్యల వల్ల పరిస్థితి మళ్ళీ తిరోగమనం చెందినట్లే. పగటిపూట ఉత్పత్తి అయిన సౌర విద్యుత్తును బ్యాటరీలలో నిల్వ చేయడం, పంపుచేయగల జల విద్యుత్‌ కేంద్రాలు, అణు విద్యుత్‌ కేంద్రాలు, హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్స్‌ వంటివి కొంతమేర పరిష్కారం చూపించే అవకాశం ఉంది.

వినియోగంలో ఆదా...

విద్యుత్‌ వినియోగంలో ఒక యూనిట్‌ను నియంత్రిస్తే, ఒకటిన్నర యూనిట్ల ఉత్పత్తిని తగ్గించవచ్చు. పారిశ్రామిక, వ్యవసాయ, గృహ తదితర రంగాలలో అత్యంత సామర్థ్యంగల వస్తువులు, వాహనాలు, ఎల్‌ఈడీ లైట్లు, ఫ్యాన్లు, విద్యుత్‌ సామర్థ్య విభాగం ధ్రువీకరించిన మోటార్లు, ఉపకరణాలు వాడాలి. తద్వారా మొత్తం వినియోగంలో వృథాను అరికట్టడం వల్ల 15 నుంచి 25శాతం వినియోగం తగ్గే అవకాశం ఉంటుంది. విద్యుత్‌ సంస్థల ప్రసార, పంపిణీ నష్టాలు 15శాతందాకా ఉంటున్నాయి. లైన్లను పటిష్ఠీకరిస్తే ఇలాంటి నష్టాలను, వృథాను అరికట్టవచ్చు. ఆ మేరకు కర్బన ఉద్గారాల విడుదలను నివారించడమే కాకుండా, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల సరఫరా లైన్లపై పెట్టుబడి అవసరం ఉండదు. రోజులో విద్యుత్‌ వినియోగ సమయాన్ని బట్టి ఛార్జీలు నిర్ణయిస్తే- వినియోగదారులు ఛార్జీలు తక్కువ ఉండే సమయంలో వాడుకోవడంవల్ల గ్రిడ్‌పై ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు తగినట్లుగా, పారిస్‌ ఒడంబడికకు అనుగుణంగా ఉత్పత్తి సాధించాలంటే సౌర, పవన విద్యుత్తు కేంద్రాలను స్థాపించాలి. ఇందుకోసం పెద్దయెత్తున నిధులను వెచ్చించాల్సిన అవసరముంది. పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి లైన్లలో నష్టాలను నియంత్రించాలి. దేశంలోని ప్రతి ఉత్పత్తి కేంద్రాన్నీ గ్రిడ్‌కు అనుసంధానించేలా సరఫరా లైన్లను విస్తరించాలి. బ్యాటరీ నిల్వ కేంద్రాలను, జల విద్యుత్‌ కేంద్రాలను విస్తృతంగా స్థాపించినప్పుడే దేశంలో అందరికీ నిరంతరాయంగా నాణ్యమైన కరెంటును అందించడం సుసాధ్యం.


నిధులూ... కేటాయింపులూ...

భారతదేశం 2005 నుంచే అయిదేళ్ల స్వల్పకాలిక జాతీయ విద్యుత్‌ విధానాన్ని రూపొందిస్తూ, ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ విభాగాలలో చేపట్టాల్సిన ప్రాజెక్టు నిర్మాణాలకు రూపకల్పన చేసి అమలు చేస్తోంది. స్వచ్ఛ ఇంధనాల ద్వారా ఉత్పత్తి పెంచినా, నమ్మకమైన, నిరంతర విద్యుత్‌ అందజేయాలంటే 2050 వరకు థర్మల్‌ కేంద్రాలను కొనసాగించాల్సి ఉంటుందని విద్యుత్‌ రంగ నిపుణుల అంచనా. పాతికేళ్ల పైబడిన కాలంచెల్లిన థర్మల్‌ కేంద్రాలను మూసివేస్తూనే, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న 25 గిగావాట్ల కేంద్రాలతోపాటు అదనంగా మరో 28 గిగావాట్‌ ఉత్పత్తి కేంద్రాలను 2031-32 నాటికి స్థాపించాల్సిన అవసరం ఉంటుందని అంచనా. పెరుగుతున్న సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తిని సమర్థంగా వినియోగించుకోవాలంటే, బ్యాటరీ నిల్వ విధానం కొంతమేర పరిష్కారం చూపుతుంది. ఇందుకు భారీగా నిధులూ అవసరమవుతాయి. ఆ మేరకు కేటాయింపులూ చేపట్టాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.