సమర్థులకు చోటు... అరాచకంపై వేటు... ఓటు!

సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి దశ పోలింగ్‌ ముగిసింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తలరాతను మార్చే విలువైన ఆయుధం ఓటు. ప్రస్తుతం యువతతో పాటు ఎందరో విద్యావంతులు బాధ్యతాయుతంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి విముఖత చూపుతున్నారు. మరెందరో డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగిపోయి ఓటును అమ్ముకొంటున్నారు.

Published : 25 Apr 2024 01:03 IST

సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి దశ పోలింగ్‌ ముగిసింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తలరాతను మార్చే విలువైన ఆయుధం ఓటు. ప్రస్తుతం యువతతో పాటు ఎందరో విద్యావంతులు బాధ్యతాయుతంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి విముఖత చూపుతున్నారు. మరెందరో డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగిపోయి ఓటును అమ్ముకొంటున్నారు. దీనివల్ల అంతిమంగా సమాజానికి తీవ్ర నష్టం తప్పదు.

తొంభై కోట్లకు పైగా ఓటర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ నిలుస్తోంది. రాజకీయాధికారంలో ప్రజలను భాగస్వాములుగా చేయడం ద్వారా తమను తాము పరిపాలించుకోవడానికి ఉద్దేశించిన ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక ఎన్నికలు. ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రభుత్వాన్ని ఎన్నుకొంటారు. అందువల్ల ప్రభుత్వ స్వరూపం, స్వభావం అంతిమంగా ప్రజలు విచక్షణతో వినియోగించిన ఓటుపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం మంచిదైనా, చెడ్డదైనా దాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రజలే బాధ్యత వహించాలి. మంచి నాయకత్వం లేకుండా మంచి ప్రభుత్వం, సమాజం సాకారం కావు. మంచి నాయకులు సమాజానికి సేవ చేస్తే, దుష్ట నేతలు సంఘాన్ని దోచుకుంటారు. సమాజమే తమకు సేవ చేసే విధంగా మలచుకుంటారు. మంచి నాయకులను ఎన్నుకోవడానికి, తద్వారా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలకు దక్కిన ఆయుధమే ఓటు. నేతలతో పాటు దేశం తలరాతనే మార్చే సత్తా ఓటుకు ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలంటే ప్రతి పౌరుడు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. డబ్బు, బహుమతుల ప్రలోభాలకు తలొగ్గి లేదా కుల, మత, ప్రాంతీయ అభిమానాలతో ఓటు వేయడమంటే భవిష్యత్తును స్వయంగా దెబ్బతీసుకోవడమే.

ఆందోళనకర నిర్లిప్తత

భారత్‌కు ప్రజాస్వామ్యం పనికిరాదని, పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడానికి తగిన సామాజిక పరిస్థితులు, ప్రజాస్వామ్య సంస్కృతి మన దగ్గర లేవని ప్రారంభంలో పలువురు పాశ్చాత్య మేధావులు, రాజనీతిజ్ఞులు అభిప్రాయపడ్డారు. తొలి ప్రధానిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ఆసియా ఖండంలోనే ఒక ఆదర్శవంతమైన ప్రజాస్వామిక వ్యవస్థగా ఇండియాను రూపొందించారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉన్నా ప్రతిపక్షాల సూచనలకు, నాయకుల అభిప్రాయాలకు నెహ్రూ తగిన విలువ ఇచ్చేవారు. తద్వారా భారత ప్రజాస్వామ్యం ప్రపంచ రాజనీతిజ్ఞులు, మేధావుల ప్రశంసలు పొందింది. ప్రపంచ ప్రఖ్యాత జీవ శాస్త్రవేత్త జె.బి.ఎస్‌.హాల్డేన్‌ బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తూర్పారబట్టి, ఇండియాకు వచ్చి ఇక్కడి పౌరసత్వం స్వీకరించారు. ‘పౌరులెప్పుడూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. నిరంతరం జవాబులు రాబడుతూ ప్రభుత్వాన్ని జాగృతం చేయాలి. ఇండియాలో నాకు ఆ స్వేచ్ఛ ఉంది’ అని భారత ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని హాల్డేన్‌ చాటి చెప్పారు. రాజకీయ స్వాతంత్య్రంతో పాటు సామాజిక సమానత్వం, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ, సంకుచితత్వానికి తావులేని ఆధునిక భారత నిర్మాణం దిశగా దేశం ప్రస్థానం సాగిస్తున్న కాలంలో హాల్డేన్‌ ఈ దేశంలో జీవించారు. చట్టసభల్లో, బయటా రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ప్రజల కోసం విభిన్న రాజకీయ పక్షాలు ఏకతాటిపై పనిచేసిన కాలమది. అటువంటి భారత ప్రజాస్వామ్యం 21వ శతాబ్దం వచ్చేసరికి నైతిక, సామాజిక విలువలకు తిలోదకాలిచ్చి ధనస్వామ్యంగా, నేరస్వామ్యంగా పరిణామం చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

కొన్నేళ్లుగా భారత రాజకీయ నాయకుల్లో అధికార దాహం, పదవుల కోసం ప్రజలను వర్గాలుగా చీల్చడం, వ్యక్తి పూజ పెరిగిపోయాయి. ప్రజాసేవలాగా కాకుండా రాజకీయాలను వృత్తిగా భావించే అవినీతిపరుల సంఖ్య అధికమైంది. ప్రజల నిర్లిప్తతకు తోడు అవినీతి వ్యవస్థీకృతం కావడంతో రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన చేయలేని స్థాయిలో భ్రష్టుపట్టి పోయింది. ఈ క్రమంలో ‘ఓటు’ వేయడం అనేది ప్రాధాన్యం కోల్పోయింది. తమ చేతిలో ఉన్న ఓటు శక్తిని గుర్తించని ఎంతోమంది నోటుకో, మందుకో ఇతర స్వార్థ ప్రయోజనానికో అమ్ముడుపోతున్నారు. దీన్ని సొమ్ము చేసుకుంటున్న స్వార్థశక్తులు అధికారాన్ని చేజిక్కించుకొని ఆ తరవాత అడ్డగోలుగా దోచుకొంటున్నాయి. ప్రజలను శాసించే చట్టాలు చేస్తున్నాయి. లోక్‌సభ ఎంపీల్లో 2004లో 30శాతంగా ఉన్న కోటీశ్వరుల సంఖ్య 2019 నాటికి 82శాతానికి పెరిగింది. నాడు 24 శాతంగా ఉన్న నేరచరితులు 44శాతానికి పెరిగారు. 2019లో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 29శాతం తీవ్ర అభియోగాలకు గురయ్యారు. పాలకుల దుర్విధానాల వల్ల ప్రజాస్వామిక సంస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు క్రమంగా నిర్వీర్యం అవుతున్నాయి. మరోవైపు రాజకీయాల పట్ల విద్యావంతులు, యువత నిర్లిప్తతతో వ్యవహరిస్తున్నారు. ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. పేదరికం, అవిద్య, నిరుద్యోగం, అనారోగ్యం సమాజాన్ని పెను భూతంలా పట్టి పీడిస్తున్నాయి.

ప్రజా చైతన్యం కీలకం

ప్రజలు, ముఖ్యంగా యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో ఓటు పట్ల అవగాహనను, యువ ఓటర్ల నమోదును పెంచడానికి 2011 నుంచి జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రజల్లో చైతన్యం రాకుంటే ప్రజాస్వామ్యం బలోపేతం కాదు. దేశ భవిష్యత్తు బాగుండాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందాలన్నా విలువలతో కూడిన సమర్థ ప్రభుత్వం ఏర్పాటవ్వాలి. అందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎన్నికలు జరిగే రోజును కేవలం ఒక సెలవు దినంగా భావించి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు దూరంగా ఉండిపోయినా, ప్రలోభాలకు ఓటును అమ్ముకున్నా సమాజ అభ్యున్నతికి అది గొడ్డలిపెట్టే!


అరకొరగా పోలింగ్‌

గత ఏడున్నర దశాబ్దాల కాలంలో జరిగిన 17 ఎన్నికల్లో పోలింగ్‌ సగటున 65శాతానికి మించలేదు. ఒక్క 2019 సార్వత్రిక ఎన్నికల్లోనే 67.40 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం పరిశీలన ప్రకారం అర్హులైన ఓటర్లలో 30 కోట్ల మంది ముఖ్యంగా పట్టణ ప్రాంత యువత, విద్యావంతులు, వలస కార్మికులు గత సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. దక్షిణ భారత్‌లో అత్యల్ప పోలింగ్‌ నమోదైన ప్రాంతాలుగా బెంగళూరు, హైదరాబాద్‌, విశాఖపట్నం నిలిచాయి. పౌరులు ఓటు వెయ్యకపోతే చట్టసభలు ఆలోచన లేనివాళ్లతో నిండిపోతాయి. మంచివారు ఓటింగుకు దూరంగా ఉండటం దుష్ట ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీస్తుందని భారత ఎన్నికల ప్రధానాధికారిగా టి.ఎన్‌.శేషన్‌ గతంలోనే హెచ్చరించిన విషయాన్ని అంతా గుర్తించాలి.


ఆచార్య ఇళ్ల దోసగిరిరావు
(విశ్రాంత ఆచార్యులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.