రైసీ మరణంతో రాజకీయ అనిశ్చితి

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందడం ప్రపంచదేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రైసీ మరణంతో పశ్చిమాసియాలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? ఇరాన్‌ పంథాలో ఏమైనా మార్పు వస్తుందా?  

Updated : 23 May 2024 10:16 IST

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందడం ప్రపంచదేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రైసీ మరణంతో పశ్చిమాసియాలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? ఇరాన్‌ పంథాలో ఏమైనా మార్పు వస్తుందా?

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుసేన్‌ అమీర్‌ అబ్దొల్లాహియన్‌లు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంపై రకరకాల కుట్ర కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఈ దుర్ఘటన వెనక ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌ హస్తం ఉందని మొదట్లో ఊహాగానాలు వ్యాపించినా ఇరాన్‌ అధికారికంగా టెల్‌అవీవ్‌ను వేలెత్తి చూపలేదు. రైసీ మృతితో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్‌ అధికారులు సైతం రాయిటర్స్‌ వార్తా సంస్థకు తెలిపారు. అమెరికా ఆంక్షల వల్ల తమ హెలికాప్టర్లకు విడిభాగాలు దొరక్కపోవడం వల్లే రైసీ హెలికాప్టర్‌ కూలిపోయిందని ఇరాన్‌ మాజీ విదేశాంగ మంత్రి మహమ్మద్‌ జారిఫ్‌ విమర్శించారు. రైసీ పయనించిన హెలికాప్టర్‌ను అమెరికాకు చెందిన బెల్‌ కంపెనీయే తయారు చేసిందని గమనించాలి.

ప్రజల్లో వ్యతిరేకత

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా తనను కాకుండా రైసీని సిద్ధం చేయడం ఖమేనీ కుమారుడు ముజ్తబాకు నచ్చలేదని, వారసత్వ పోరు రైసీని బలిగొని ఉండవచ్చని మరో కుట్ర కోణం వినవచ్చింది. మొజ్తబాకు రివల్యూషనరీ గార్డ్స్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన బయట కనిపించడం, మాట్లాడటం అరుదే. అసలు రైసీ అధ్యక్ష పదవికే పరిమితమై, మొజ్తబాయే ఖమేనీ వారసుడిగా అధినాయకత్వం చేపడతారనేవారున్నారు. అయితే, రాచరికానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ మళ్ళీ రాజవంశాల మాదిరిగా ఆనువంశిక పాలనలోకి జారిపోవడాన్ని ఇరాన్‌ ప్రజలు స్వాగతించకపోవచ్చు. వారు ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, నిరంకుశత్వానికి చిరునామాగా మారిందని భావిస్తున్నారు. అందుకే, రైసీ మరణవార్త వినగానే ఇరాన్‌లో పలుచోట్ల జనం సంబరాలు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

రైసీని మెచ్చి మరీ అధినాయకుడు ఖమేనీ ఆయన్ను అధ్యక్ష పీఠమెక్కించారు. 2017 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా రైసీ నాలుగేళ్ల తరవాత 2021లో విజయం సాధించారు. దీని వెనక ఖమేనీ హస్తం ఉందన్న విశ్లేషణలున్నాయి. స్వదేశంలో రైసీ కరకు పంథాను అనుసరించి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు. నిజానికి, ఇరాన్‌లో అధ్యక్షుడు ఎవరైనా అసలు సిసలు అధికారం మతపరమైన అధినాయకుడు ఖమేనీ చేతిలోనే ఉంటుంది. ఆయనే విధానకర్త, సర్వసైన్యాధ్యక్షుడు, రివల్యూషనరీ గార్డ్స్‌ సారథి. స్వదేశీ, విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఖమేనీ విధానాలనే రైసీ అమలుచేసేవారు. అధ్యక్షుడు మరణించిన 50 రోజుల్లో (ప్రస్తుత పరిస్థితుల్లో జూన్‌ 28న) కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఇరాన్‌ రాజ్యాంగం నిర్దేశిస్తోంది. అప్పటివరకు ఉపాధ్యక్షుడు మహమ్మద్‌ మొఖ్బర్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. రైసీ మరణించి ఉండకపోతే సంవత్సరం తరవాత అధ్యక్ష ఎన్నిక జరిగి ఉండేది. రైసీ ప్రభుత్వ విధానాలపై విసిగి వేసారిన ఇరాన్‌ ప్రజలు వచ్చే నెలలో జరిగే అధ్యక్ష ఎన్నికలో ఉత్సాహంగా పాల్గొనకపోవచ్చు. ఇటీవలి పార్లమెంటరీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం చాలా తక్కువగా ఉండటమే దీనికి నిదర్శనం. ఓటర్ల ఉదాసీనత ఇరాన్‌ కొత్త అధ్యక్షుడి ఆమోదనీయతను తగ్గించినా, ఇరాన్‌ అధినాయకుడు ఖమేనీ దాన్ని ఖాతరు చేయరు.

ప్రభుత్వాధిపతి ఎన్నిక విషయంలో ఖమేనీకి ఎదురు లేకపోయినా, తన వారసుడిగా మతపరమైన అధినాయకుడి ఎంపిక మాత్రం అంత సులువు కాదు. ఖమేనీ వారసుడి ఎంపికపై అంతర్గత సంఘర్షణ నెలకొంటే అది విస్తృత ప్రభావం చూపవచ్చు. రైసీ మరణం తరవాత ఇరాన్‌ దేశీయాంగ విధానంలో కొద్దిపాటి మార్పులు వచ్చినా విదేశాంగ విధానం మాత్రం మారకపోవచ్చు. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు డ్రోన్లు సరఫరా చేయడం, చైనాతో మైత్రిని పటిష్ఠం చేసుకోవడం రైసీ హయాములో ఇరాన్‌లో జరిగిన కీలక పరిణామాలు. సౌదీ అరేబియాతో ఏడేళ్లుగా తెగతెంపులైన సంబంధాలను చైనా మధ్యవర్తిత్వంతో పునరుద్ధరించారు. అయితే, ఇజ్రాయెల్‌ పట్ల శత్రు వైఖరి అవలంబించాలన్న రైసీ విధానాన్ని సౌదీ గట్టిగా వ్యతిరేకించింది. అయినా, రైసీ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు బద్ధశత్రువులైన హమాస్, హెజ్బొల్లాలకు పూర్తి అండదండలిచ్చింది. ఇరాక్‌లో ఇస్లామిక్‌ తిరుగుబాటు బృందాలు, యెమెన్‌లో హూతీలూ ఇరాన్‌ చెప్పుచేతల్లో పనిచేస్తున్నారు. ఇరాన్‌ ప్రోద్బలంతోనే హమాస్‌ నిరుడు అక్టోబరులో ఇజ్రాయెల్‌పై దాడికి సాహసించిందన్న భాష్యాలు వినవస్తున్నాయి.

సమీకరణాలు మారతాయా?

ఇజ్రాయెల్‌ గత నెలలో సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై విమాన దాడి జరిపింది. అందులో ఇస్లామిక్‌ రిపబ్లికన్‌ గార్డ్స్‌ ఉన్నతాధికారులు హతమయ్యారు. దాంతో రైసీ ప్రభుత్వంపై ఇరాన్‌లోని అతివాదులు బహిరంగంగానే విమర్శలకు దిగారు. పరువు కాపాడుకోవడానికి ఏప్రిల్‌ 14న ఇరాన్‌ పెద్దయెత్తున క్షిపణులు, డ్రోన్లను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించింది. అమెరికా, అరబ్‌ మిత్రదేశాల సహాయంతో ఇజ్రాయెల్‌ వాటిని సమర్థంగా కూల్చివేసింది. అయితే, పాలస్తీనీయుల ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడిన ఇస్లామిక్‌ దేశంగా ఇరాన్‌ పేరుతెచ్చుకుంది. ఇది సౌదీ తదితర అరబ్‌ దేశాలకు మింగుడుపడని విషయమే. గాజాలో ఎడతెగని దమనకాండ వల్ల ఇజ్రాయెల్‌ ప్రపంచంలో ఏకాకి అవుతుందని ఇరాన్‌ అంచనా వేస్తోంది. రష్యా, చైనా, భారత్‌ సైతం పశ్చిమాసియాలో పలుకుబడి పెంచుకొంటున్నందువల్ల అక్కడ అమెరికా ఆధిపత్యం తగ్గుతుందనీ భావిస్తోంది. ఇరాన్‌ అణుబాంబును సమకూర్చుకుంటే పశ్చిమాసియాలో రాజకీయ సమీకరణలు మారిపోతాయి. అలా జరుగుతుందా లేదా అన్నది రైసీ తరవాత అధ్యక్షుడిగా, ఖమేనీ అనంతరం మతపరమైన అధినాయకుడిగా ఎన్నికయ్యే వ్యక్తుల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.


ఇండియాతో ఒప్పందం

రైసీకి ముందు అధ్యక్షుడిగా ఉన్న హసన్‌ రౌహానీ పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలకు ప్రాధాన్యమిచ్చి అణు సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దాన్ని తుంగలో తొక్కారు. రైసీ అధ్యక్ష పదవిని చేపట్టాక పాశ్చాత్య దేశాలకన్నా రష్యా, చైనాలతో, పశ్చిమాసియా దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రాధాన్యమిచ్చారు. భారత్‌తోనూ సంబంధాలను పటిష్ఠం చేసుకున్నారు. బ్రిక్స్, షాంఘై సహకార మండలిలో ఇరాన్‌ సభ్యదేశం కావడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ తోడ్పడ్డారని ధన్యవాదాలు తెలిపారు. చాబహార్‌ రేవు నిర్వహణకు ఇటీవలే ఇండియాతో పదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నారు.


ఏఏవీ ప్రసాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.