పర్యావరణ పరిరక్షణతో భద్రమైన ధరిత్రి

విశ్వంలో జీవం మనుగడకు మూలం పర్యావరణం. భూమి, నీరు, గాలి, వేడి, చలి, వెలుతురు, ఆహారం వంటివి జీవం అభివృద్ధికి దోహదపడుతున్నాయి. వీటి మధ్య సమతౌల్యం దెబ్బతింటే జీవకోటికి ముప్పు తప్పదు.

Published : 12 Jun 2024 02:44 IST

విశ్వంలో జీవం మనుగడకు మూలం పర్యావరణం. భూమి, నీరు, గాలి, వేడి, చలి, వెలుతురు, ఆహారం వంటివి జీవం అభివృద్ధికి దోహదపడుతున్నాయి. వీటి మధ్య సమతౌల్యం దెబ్బతింటే జీవకోటికి ముప్పు తప్పదు. మానవ చర్యలవల్ల పెద్దయెత్తున పర్యావరణ విధ్వంసం చోటుచేసుకుంటోంది.

భివృద్ధి పేరుతో మానవుడు పెద్దయెత్తున పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నాడు. దాంతో ప్రకృతి వనరులు కుంచించుకుపోవడం, కలుషితం కావడం పరిపాటిగా మారింది. ఈ విధ్వంసానికి ముగింపు పలకాల్సిందే. భూమిపై విస్తరించిన అడవులు, వ్యవసాయ భూములు, పచ్చిక బయళ్లు, చిత్తడి నేలలు, పర్వతాలు... మానవుడితో పాటు ఇతర జీవుల మనుగడకు అవసరమైన ఆహారం, నీటిని అందిస్తున్నాయి. ఈ వనరులను అతిగా వినియోగించడం, విధ్వంసాలు, కాలుష్యం, విపత్తులవల్ల భూములు అంతకంతకు సారం కోల్పోతున్నాయి. దాంతో అనేక ప్రాంతాలు ఎడారులను తలపిస్తున్నాయి.

ఎన్నో కారణాలు...

భూతాపం అంతకంతకు పెరుగుతుండటంవల్ల వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కరవు పరిస్థితులవల్ల ఆహార లభ్యత తగ్గిపోతోంది. జల వనరులు కుంచించుకుపోతున్నాయి. ముందుచూపు లేని చర్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల హెక్టార్ల మేర భూమి నిర్జీవంగా మారిపోయిందని ఐరాస పర్యావరణ కార్యక్రమ సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ఎడారీకరణను ఎదుర్కొనే లక్ష్యంతో ఏర్పడిన ఐరాస కన్వెన్షన్‌ (యూఎన్‌సీసీడీ) నివేదిక ప్రకారం, 2015-19 మధ్య కాలంలో ఏటా 10 కోట్ల హెక్టార్ల మేర భూములు జీవం కోల్పోయాయి. ఆఫ్రికా, ఉజ్బెకిస్థాన్, కజక్‌స్థాన్, బ్రెజిల్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కొన్ని చోట్ల భూములు వేగంగా ఎడారులుగా మారుతున్నాయని ‘యునైటెడ్‌ ఫోరమ్‌ ఆన్‌ ఫారెస్ట్‌’ సంస్థ వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి నేలల విధ్వంసం, ఎడారీకరణ, కరవుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోతోందని యూఎన్‌సీసీడీ హెచ్చరించింది. మన దేశంలోనూ ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. భారత్‌లో సుమారు 30శాతం భూములు వ్యవసాయం, ఉత్పత్తికి పనికిరాకుండా పోయాయని ఇస్రోకి చెందిన స్పేస్‌ అప్లికేషన్‌ కేంద్రం అధ్యయనంలో తేలింది. ఐరాస ఆధ్వర్యాన 2015లో జరిగిన న్యూయార్క్‌ పర్యావరణ సదస్సు- ప్రపంచ దేశాలన్నీ 2015-30 మధ్య సాధించాల్సిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించింది. ఇందులో 15వ అంశం- నేలపై జీవులను రక్షించుకోవడం. ఆ క్రమంలో 2030 నాటికి వంద కోట్ల హెక్టార్ల మేర భూములను పునరుజ్జీవంలోకి తీసుకొస్తామని ప్రపంచ దేశాలు తీర్మానించాయి. భారత్‌ కూడా 2.6 కోట్ల హెక్టార్ల భూములను మళ్ళీ వాడుకలోకి తీసుకురావడానికి కృషి చేస్తోంది. భూములు నిస్సారంగా మారి ఆపై ఎడారీకరణ చెందడానికి పలు కారణాలున్నాయి. పంటలు పండటానికి భూమి పైభాగంలో ఉండే మట్టి చాలా కీలకం. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక అంచనా ప్రకారం, నేలలపై సహజంగా మూడు సెంటీమీటర్ల మందంలో పైమట్టి సమకూరడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుంది. అయితే వ్యవసాయంలో ప్రణాళికల లేమి, చెట్ల నరికివేత, అడవుల విధ్వంసంవల్ల ఏటా 2,400 కోట్ల టన్నుల మేర పైమట్టి తరలిపోతోంది. వరదలు, తీవ్రమైన గాలులు సైతం ఇందుకు కారణమవుతున్నాయి. పైగా అధిక దిగుబడుల కోసం చాలామంది అన్నదాతలు అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగు మందులను వాడుతుండటంతో పంట భూములు సారం కోల్పోతున్నాయి. అడవుల విధ్వంసంతో బంజరు భూముల విస్తీర్ణం పెరుగుతోంది. గడచిన పాతికేళ్లలో 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని అడవులను నరికివేశారు. 2019-22 మధ్య భారత్‌లోని వ్యవసాయ భూముల్లో 58 లక్షల వృక్షాలను నరికివేసినట్లు తాజా అధ్యయనం లెక్కగట్టింది. మధ్య భారతంలో, ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణల్లో ఈ కోత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 2010-11 మధ్య ఉపగ్రహ చిత్రాల ఆధారంగా 60 కోట్ల చెట్లను గుర్తించారు. ఇప్పుడు వాటిలో 11శాతం కనుమరుగయ్యాయని పరిశోధకులు చెబుతున్నారు. రైతులు ఒకే తరహా పంటలను సాగు చేస్తుండటం, ఇందుకోసం జల వనరులను అధికంగా వినియోగించడం, నేలకోత నివారణకు తగిన చర్యలు తీసుకోకపోవడం, వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల, పట్టణీకరణ వంటి అంశాలు సైతం నేలలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నష్టం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఉష్ణోగ్రతల పెరుగుదల, కరవు పరిస్థితులు, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లు మించుతుందంటున్నారు. అప్పుడు వారి అందరి ఆకలి తీర్చాలంటే- ప్రస్తుతమున్న ఆహార ఉత్పత్తులను 60-70శాతం మేర పెంచాల్సి ఉంటుంది. ఏటికేడు సాగు భూములు తగ్గిపోతున్న తరుణంలో ఈ అంచనాలను అందుకోవడం సవాలే!

భవిష్యత్తు ఆశావహం...

నిర్జీవంగా మారిన నేలల్లో 15శాతాన్ని పునరుద్ధరించినా, కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న జీవజాతుల్లో 60శాతాన్ని కాపాడుకోవచ్చని నిపుణుల అంచనా. ఇటువంటి చిన్న మార్పు ఎన్నో జీవులకు ఊపిరిపోసి జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది. నేలలు నీర్జవంగా మారకుండా ఉండేందుకు ప్రభుత్వాలు వ్యవసాయ విధానాలు, అభివృద్ధి నమూనాల్లో తగిన మార్పులు తీసుకురావాలి. వీటికితోడు పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని పెంచాలి. పర్యావరణ పరిరక్షణతోనే భావి తరాలకు భద్రమైన ధరిత్రిని అందించగలం.


సమస్య పరిష్కారానికి సప్త విధానాలు

భూముల పునరుద్ధరణ, ఎడారీకరణ నియంత్రణ, కరవులను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఏడు విధానాలను ఆచరించాలి.

1. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలి. ఇందుకు వెచ్చిస్తున్న సొమ్మును సుస్థిర సాగువైపు మళ్ళించాలి.
2. సేంద్రియ విధానాల్లో మట్టిని సంరక్షించుకోవడంపై సామాన్యులకు, రైతులకు అవగాహన పెంచాలి. బిందు సేద్యం వంటి విధానాలతో తేమను కాపాడటం, మట్టిని పచ్చదనంతో కప్పి ఉంచడంవల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ వివరించాలి.
3. పండ్ల ఉత్పత్తిలో పాలినేషన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. తేనెటీగలు కీలకం కాబట్టి, వాటి సంతతిని పెంచే చర్యలు చేపట్టాలి.
4. మంచినీటి వనరులు ఉన్నచోట భూములు సారవంతంగా వర్ధిల్లుతాయి. చెరువులు, నదులను కాపాడుకోవాలి. వాననీటి సంరక్షణకు తీసుకునే చర్యలు భూముల పునరుద్ధరణకు ఉపకరిస్తాయి.
5. తీర ప్రాంతాలు, పడగపు దీవులు, సముద్ర మొక్కల రక్షణకు చర్యలు ఆవశ్యకం. తద్వారా చుట్టుపక్కల భూములు దెబ్బతినకుండా కాపాడుకోగలం.
6. నగరాలు, పట్టణాల్లో మిద్దె, పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా జీవవైవిధ్యాన్ని పెంచవచ్చు.
7. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధన, ఆవిష్కరణలకు వెచ్చిస్తున్న మొత్తాన్ని భారీగా పెంచాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు