పెచ్చుమీరుతున్న పట్టణ నిరుద్యోగం

కొవిడ్‌ విజృంభణతో గతంలో దేశీయంగా నిరుద్యోగిత రేటు రెండంకెలకు ఎగబాకింది. పరిస్థితులు కుదుటపడ్డాక క్రమంగా అది దిగివచ్చింది.

Published : 27 Jan 2023 00:50 IST

కొవిడ్‌ విజృంభణతో గతంలో దేశీయంగా నిరుద్యోగిత రేటు రెండంకెలకు ఎగబాకింది. పరిస్థితులు కుదుటపడ్డాక క్రమంగా అది దిగివచ్చింది. అయితే, నిరుద్యోగ సమస్య ఇంకా కొవిడ్‌ పూర్వ స్థితికి చేరుకోలేదు. ఇటీవల అది మళ్ళీ విజృంభిస్తోంది.

దేశంలో 2020 జనవరితో పోలిస్తే నిరుడు అక్టోబరులో ఉపాధి దక్కినవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అశోకా విశ్వవిద్యాలయ అధ్యయన నివేదిక వెల్లడించిన యథార్థమిది. దీన్నిబట్టి దేశీయంగా కొవిడ్‌ కల్లోలం ఉపశమించినా, ఉపాధి వృద్ధి మాత్రం ఊపందుకోలేదని అర్థమవుతోంది. గత మూడేళ్లుగా 15-39 ఏళ్లలోపు వారిని ఉపాధి లేమి వేధిస్తోంది. ఈ వయోవర్గంలోనివారు అధికంగా ఉద్యోగ వేటలోకి వస్తుండటమే దీనికి కారణం. గత డిసెంబరులో ఇండియాలో నిరుద్యోగిత రేటు 8.3శాతానికి చేరి పదహారు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. పల్లెపట్టులతో పోలిస్తే పట్టణాల్లో నిరుద్యోగం మరింతగా పెచ్చుమీరినట్లు భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షక కేంద్రం (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. 

ఖాళీల మేట

శ్రామిక భాగస్వామ్యంలో ఆరోగ్యకరమైన పెరుగుదలే నిరుద్యోగం అధికం కావడానికి కారణమన్నది సీఎంఐఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహేశ్‌ వ్యాస్‌ విశ్లేషణ. అంటే, కష్టపడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా, పని దొరకని పరిస్థితులు నెలకొన్నాయని అర్థం. హరియాణా, రాజస్థాన్‌, బిహార్‌, త్రిపుర, దిల్లీ వంటి చోట్ల నిరుద్యోగిత రేటు రెండంకెల సంఖ్యలో కోరలు చాస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, కేరళల్లోనూ అది ఏడు శాతానికి మించి ఉంది. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అధికారపక్షాన్ని ఇరుకునపెట్టే అంశాలే. నిరుద్యోగ సమస్య దిగిరావాలంటే ఉపాధి కల్పనపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలి. యువ నైపుణ్యాలకు సానపట్టి మేటి మానవ వనరులుగా వారిని తీర్చిదిద్దాలి. ముఖ్యంగా తయారీ రంగంలో ఇండియా సామర్థ్యాన్ని మరింతగా ఇనుమడింపజేయాలి.

అభివృద్ధి చెందిన దేశాల్లో యాభై శాతానికి పైగా యువత చదువుతోపాటే కొలువులకు అవసరమైన నైపుణ్యాలను సొంతం చేసుకుంటోంది. భారత్‌లో పరిశ్రమ అవసరాలకు, తరగతి గది పాఠాలకు మధ్య అంతరం కొనసాగుతోంది. దీన్ని పరిమార్చేందుకు ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ కార్యాచరణకు పూనుకోవాలి. దేశీయంగా నిపుణ శ్రామిక సైన్యాన్ని తీర్చిదిద్ది ఉపాధిని అందించే లక్ష్యంతో కేంద్ర సర్కారు ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (పీఎంకేవీవై)ను తెచ్చింది. అందులో భాగంగా 2015 నుంచి మూడు విడతల్లో 1.42 కోట్ల మంది నైపుణ్య శిక్షణకు పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో నాలుగింట మూడు వంతుల మంది శిక్షణ పూర్తిచేసుకున్నా, కేవలం 24 లక్షల మందికే ఉపాధి దక్కినట్లు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు నానాటికీ తెగ్గోసుకుపోతుండటం నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ నింపుతోంది. 1993-2020 మధ్య కాలంలో సంఘటిత రంగంలో కేంద్ర ప్రభుత్వ కొలువుల వాటా 12.4శాతం నుంచి అయిదు శాతానికి పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2015-20 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు 19శాతం నుంచి 37శాతానికి పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఏడాది అంతానికి కేంద్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకొంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో మంజూరైన పోస్టుల్లో అరవై లక్షల మేర ఖాళీగా పడి ఉన్నట్లు పరిశీలనలు చాటుతున్నాయి. వీటన్నింటినీ త్వరితగతిన భర్తీ చేయాలి. దేశీయంగా మొత్తం 56.3 కోట్ల శ్రామికశక్తిలో 82శాతం అసంఘటిత రంగంలోనే కొనసాగుతోంది. ఆధునిక కాలానికి అనుగుణంగా ఇటీవల గిగ్‌ వర్కర్ల సంఖ్య పెరుగుతోంది. ఇవి తాత్కాలిక కొలువులు. ఇలాంటి వారికి ఉద్యోగ భద్రత కొరవడుతోంది. అనారోగ్య సెలవులు, బీమా సౌకర్యం, కనీస వేతనాలు, అధిక పని గంటలకు చెల్లింపులు వంటివి దక్కడంలేదు.

ఎంఎస్‌ఎంఈలకు దన్ను

గ్రామాల్లో సాగు సంక్షోభం కారణంగా పట్టణాలు, నగరాలకు వలసలు నానాటికీ ఊపందుకొంటున్నాయి. దానికి అనుగుణంగా సరైన మౌలిక వసతులు కొరవడి నగరాలు మానవ సంక్షోభ కేంద్రాలుగా కునారిల్లుతున్నాయి. ఈ దుస్థితికి అడ్డుకట్ట వేసేలా పల్లెపట్టులే ప్రధాన కార్యక్షేత్రంగా కొనసాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లకు ఆర్థిక దన్నును కేంద్రం ఇతోధికం చేయాలి. కొవిడ్‌ ముష్టిఘాతాలకు దేశీయంగా 14శాతం ఎంఎస్‌ఎంఈలు శాశ్వతంగా మూతపడినట్లు ఇటీవలి అధ్యయనం చాటుతోంది. అలాంటి వాటన్నింటికీ కొత్త ఊపిరులు ఊదాలి. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ను రూపొందించుకోవడంలో సవాళ్లుగా మారిన మౌలిక వసతుల లేమి, ఉత్పత్తిలో మందకొడితనం, అవినీతి తదితరాలపై తక్షణమే సరైన దృష్టి సారించాలి. స్వయం ఉపాధికి ముందుకొచ్చే వారికీ ఆర్థిక దన్నును అందించాలి. అప్పుడే దేశీయంగా నిరుద్యోగ సమస్యను నిలువరించడం సాధ్యమవుతుంది.

 దివ్యాన్షశ్రీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.