సరస్సుల్ని సంరక్షించుకుందాం!

ప్రపంచంలోని సగానికిసగం భారీ సరస్సుల్లో నీరు తగ్గిపోతోంది. వాతావరణ మార్పులతోపాటు, మానవ కార్యకలాపాలూ ఇందుకు కారణమవుతున్నాయి. మనుషులకు, పర్యావరణ వ్యవస్థకు ఇవే కీలకం.

Published : 26 May 2023 00:42 IST

ప్రపంచంలోని సగానికిసగం భారీ సరస్సుల్లో నీరు తగ్గిపోతోంది. వాతావరణ మార్పులతోపాటు, మానవ కార్యకలాపాలూ ఇందుకు కారణమవుతున్నాయి. మనుషులకు, పర్యావరణ వ్యవస్థకు ఇవే కీలకం.

ప్రపంచ భౌగోళిక విస్తీర్ణంలో మూడు శాతం సరస్సులు విస్తరించి ఉన్నాయి. ఉపరితల మంచినీటిలో గణనీయమైన వాటా వాటిదే. అవి తాగునీరు, నీటి పారుదల, విద్యుదుత్పత్తికి అవసరమైన నీటిని సమకూరుస్తాయి. జంతువులు, మొక్కల మనుగడకు తోడ్పడటమే కాకుండా, వాతావరణంలోని కర్బనాల నియంత్రణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, మానవ మనుగడలో కీలక భూమిక పోషించే సరస్సులు నానాటికీ క్షీణిస్తుండటం ఆందోళనకరం. ప్రపంచవ్యాప్తంగా 90 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర నీటి వనరులు క్షీణించినట్లు తాజా పరిశోధనల్లో గుర్తించారు. కొలరాడో బౌల్డర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు, ఇతర పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండువేల భారీ సరస్సులకు సంబంధించి వాతావరణ మార్పులు, నీటి నిల్వలో సహజ తేడాలు, మానవ వినియోగం తదితర అంశాలను ఉపగ్రహ వివరాలతో అనుసంధానించి సమగ్ర అధ్యయనం జరిపారు. ఈ పరిశోధన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1992 నుంచి 2020 మధ్యకాలంలో దాదాపు 53శాతం సరస్సులు, జలాశయాలు సరైన రీతిలో నీటి లభ్యత కరవై క్షీణస్థితికి చేరుకున్నట్లు వెల్లడైంది.

తీవ్ర నీటి కొరత

ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు, వాతావరణంలో తేడాలు, నీరు ఆవిరి కావడం, నీటి ప్రవాహాల్లో మార్పులు, మానవ వినియోగం వంటివి సరస్సుల్లో నీటి స్థాయులు తగ్గడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కజాక్‌స్థాన్‌ ఉజ్బెకిస్థాన్‌ మధ్య ఉండే అరల్‌ సముద్రం, మృత సముద్రం వంటివీ కుంచించుకుపోతున్నాయి. మరీ ముఖ్యంగా, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఈజిప్టు, మంగోలియా, అఫ్గానిస్థాన్‌లలోని సరస్సులు క్షీణిస్తున్నాయి. పెరూ-బొలీవియా మధ్య కాస్పియన్‌ సముద్రం, టిటికాకా సరస్సు కూడా ఎండిపోతున్నాయి. కెనడియన్‌ ఆర్కిటిక్‌ దీవులు, పశ్చిమ గ్రీన్‌ల్యాండ్‌ సమీపంలో ఉన్న ఆర్కిటిక్‌ సరస్సుల్లో నీరు ఎండిపోవడం మునుపటికన్నా పెరిగింది. భారత్‌లోని సుమారు 30కి పైగా పెద్ద సరస్సుల్లో 1992-2020 మధ్య కాలంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. వీటిలో తొమ్మిది సరస్సులు ఉత్తర, తూర్పు భారతదేశంలో ఉన్నాయి. అందులో ఉలర్‌ (కశ్మీర్‌), దాల్‌ (శ్రీనగర్‌), నైని (ఉత్తరాఖండ్‌), చిల్కా (ఒడిశా) సరస్సులు వంటివి ముఖ్యమైనవి. దక్షిణ భారతదేశంలో మెట్టూరు (తమిళనాడు), కృష్ణరాజసాగర్‌ (కర్ణాటక), నాగార్జున సాగర్‌, ఇడమలయార్‌ (కేరళ) లాంటి 16 ప్రధాన జలవనరులు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, నీటి ఆవిరి, మానవ కార్యకలాపాల ఒత్తిడితోపాటు, సహజంగా ప్రవాహాలు తగ్గడం వంటి పరిస్థితులన్నీ తోడై జలాశయాల నీటి నిల్వల్లో క్షీణత స్పష్టంగా కనపడుతోంది. మున్ముందూ పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే రానున్న రోజుల్లో తీవ్ర నీటి కొరత చవిచూడక తప్పదని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

అవసరానికి మించి వినియోగం

ప్రపంచవ్యాప్తంగా పరిశీలించిన మొత్తం పెద్ద సహజ జలవనరుల్లో ముఖ్యంగా 100 సరస్సులు కుంచించుకుపోవడానికి, నీటి పరిమాణం తగ్గడానికి వాతావరణ మార్పులు, మానవ వినియోగమే ప్రధాన కారణాలని పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి పోతుండటంతో జల వనరుల్లో నీటి స్థాయులు క్షీణిస్తున్నాయి. తాగునీటి లభ్యత తగ్గుతోంది. నీటిలో లవణీయత పెరుగుతోంది. తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల సరస్సుల్లో నీరు అధికంగా ఆవిరవుతోంది. అన్నిరకాల పరిస్థితులూ కలగలిసి వాతావరణంలో కర్బన ఉద్గారాలు మరింతగా పెరగడానికి దారి తీస్తున్నాయి. ఇవి వ్యవసాయ దిగుబడులు, జలవిద్యుత్తు ఉత్పత్తి, రవాణా తదితర కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. అందుకని, అవసరానికి మించిన నీటి వినియోగాన్ని, వృథాను అరికట్టాలి. మనుషులకు నీటిని సరఫరా చేయడంలో అత్యంత ముఖ్యమైన సరస్సుల వంటి జల వనరులపై పర్యవేక్షణ, నిర్వహణను పెంచాలి. ప్రధానంగా జల వనరుల్లోకి నీటి సరఫరా సులభరీతిలో జరిగేలా ప్రవాహ మార్గాలను మెరుగుపరచాలి. మానవ వినియోగం, వాతావరణ మార్పులు, పూడికతీత, సాగునీరు, జలవిద్యుదుత్పత్తి తదితర అంశాలపై దృష్టి సారించాలి. మెరుగైన నిర్వహణ చర్యల ద్వారా జల వనరుల్లో నీటి నిల్వలను పరిరక్షించడం, పునరుద్ధరించడం సాధ్యమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.