Afghanistan: అఫ్గాన్‌ ఆట... క్రికెట్‌ పాఠం!

ఒన్‌ డే ప్రపంచకప్‌లో అజేయ జట్టుగా భారత్‌ సెమీస్‌ చేరింది. సొంతగడ్డపై బలమైన జట్టుతో బరిలోకి దిగిన భారత్‌ నిలకడగా ఆడి ఆధిపత్యం చలాయించింది. టోర్నీలో సంచలన ప్రదర్శన అంటే అఫ్గానిస్థాన్‌దే. ఆ జట్టు ఆటతీరు, సాధించిన విజయాలు ప్రపంచకప్‌ చరిత్రలో నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.

Updated : 14 Nov 2023 08:04 IST

ఒన్‌ డే ప్రపంచకప్‌లో అజేయ జట్టుగా భారత్‌ సెమీస్‌ చేరింది. సొంతగడ్డపై బలమైన జట్టుతో బరిలోకి దిగిన భారత్‌ నిలకడగా ఆడి ఆధిపత్యం చలాయించింది. టోర్నీలో సంచలన ప్రదర్శన అంటే అఫ్గానిస్థాన్‌దే. ఆ జట్టు ఆటతీరు, సాధించిన విజయాలు ప్రపంచకప్‌ చరిత్రలో నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.

న్‌ డే ప్రపంచకప్‌ లీగ్‌ దశలో అఫ్గానిస్థాన్‌ లాంటి చిన్న జట్టు పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ లాంటి జట్ల కంటే పై స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. టోర్నీ ఆరంభ దశలోనే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌పై సంచలన విజయంతో ప్రకంపనలు సృష్టించింది ఆ జట్టు. ఏదో గాలివాటంగా కాకుండా ధాటిగా ఆడి ఇంగ్లిష్‌ జట్టును ఓడించింది. ఆ తరవాత పాకిస్థాన్‌, శ్రీలంక, నెదర్లాండ్స్‌పైనా పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్‌లు గెలిచింది. అయిదుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాను దాదాపు ఓడించినంత పని చేసింది. దక్షిణాఫ్రికాకూ గట్టి పోటీనిచ్చింది. దేశంలో క్రికెట్‌ సంస్కృతి లేకపోయినా, శిక్షణ సౌకర్యాలు అంతంతమాత్రమే అయినా అఫ్గాన్‌ క్రికెటర్లు ఎంతో వేగంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ప్రపంచ క్రికెట్‌పై తమదైన ముద్ర వేసిన తీరు స్ఫూర్తిదాయకం.

ఎవరికి వారై ఉంటూ...

అఫ్గానీయులు క్రికెట్‌పై పట్టు సాధించడం వెనక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 90వ దశకంలో పాకిస్థాన్‌లో శరణార్థి శిబిరాల్లో ఉంటూ క్రికెట్‌పై ఆ దేశస్థులు ఆసక్తి పెంచుకున్నారు. అక్కడ ఆట నేర్చుకున్నవారే యువ ఆటగాళ్లకు ఆ నైపుణ్యాన్ని అందించారు. క్రమబద్ధమైన శిక్షణ-సౌకర్యాలు లేకపోయినా, సహజ ప్రతిభకు మెరుగులు దిద్దుకుని యువ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ రెహ్మాన్‌ లాంటి స్పిన్నర్లు యూట్యూబ్‌ వీడియోలు చూసి స్పిన్‌ మీద పట్టు సాధించారు. టీ20 క్రికెట్‌ విస్తృతి వల్ల విదేశాల్లో లీగ్స్‌ ఆడటం ఆ జట్టు ఆటగాళ్లకు ఎంతో ఉపకరించింది. యువ ఆటగాళ్లకు సహజంగా అబ్బిన స్పిన్‌ కళ ఆ జట్టును ప్రత్యేకంగా నిలిపింది. భారత మాజీ ఆటగాడు లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ కోచ్‌ అయ్యాక అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గాన్‌ వేగంగా ఎదిగింది. జింబాబ్వే, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ లాంటి అసోసియేట్‌ దేశాలపై తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ పెద్ద జట్లకూ షాకిచ్చే స్థాయికి చేరింది. 2018లో ఆ దేశానికి టెస్టు హోదా దక్కింది. 2010లో టీ20 ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసిన అఫ్గాన్‌- 2015లో ఒన్‌ డే ప్రపంచకప్‌లో అడుగు పెట్టింది. ఒన్‌ డేల్లో ఆ జట్టు వెస్టిండీస్‌, శ్రీలంకలపై నాలుగు చొప్పున, బంగ్లాదేశ్‌పై ఆరు విజయాలు సాధించింది. టీ20ల్లో ఆయా జట్లపై ఇంకా మెరుగైన రికార్డున్న అఫ్గాన్‌- ఈ ఫార్మాట్లో పాకిస్థాన్‌ను మూడుసార్లు ఓడించింది. అయితే ఇప్పటిదాకా సాధించిన విజయాలన్నీ ఒక ఎత్తయితే, ప్రస్తుత ఒన్డే ప్రపంచకప్‌ ప్రదర్శన మరో ఎత్తు.

అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లు ఒకచోట ఉంటూ తరచూ కలిసి సాధన చేస్తుంటారు. అయితే, అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళాక పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక క్రికెట్‌ లీగ్స్‌లో ఆడుతుండటంతో అఫ్గాన్‌ జాతీయ క్రికెటర్లలో చాలామంది స్వదేశంలో ఉండటం తక్కువ. అక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లూ జరగవు. దాంతో దుబాయ్‌ లాంటి చోట్ల ఉంటూ, లీగ్స్‌ ఆడుతూ జీవనం సాగిస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సినప్పుడు అంతా ఒక్కటవుతారు. ఈసారి అఫ్గానిస్థాన్‌ జట్టు ప్రపంచకప్‌లో అడుగుపెట్టడానికి ముందు ఆ దేశంలో తీవ్ర భూకంపం వల్ల మూడు వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన అఫ్గాన్‌ ఆటగాళ్లు సమష్టిగా సత్తా చాటడం గొప్ప విషయం.

భారత్‌ అండతో...

క్రికెట్లో అఫ్గానిస్థాన్‌ ఎదుగుదల వెనక భారత్‌ పాత్ర కీలకమైంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎన్నో ఏళ్ల నుంచి ఆ జట్టుకు ఆర్థికంగా, సాంకేతికంగా సాయం అందిస్తోంది. అఫ్గాన్‌లో సరైన క్రికెట్‌ వసతులు లేకపోవడంతో గ్రేటర్‌ నొయిడా, దేహ్రాదూన్‌లలో స్థావరాలు ఏర్పాటు చేసింది. అఫ్గాన్‌ ఆటగాళ్లు కొన్నేళ్ల పాటు భారత్‌లోనే ఉంటూ శిక్షణ పొందారు. తాము ఆతిథ్యమివ్వాల్సిన కొన్ని మ్యాచ్‌లకు దేహ్రాదూన్‌నే అఫ్గాన్‌ వేదికగా చేసుకుంది. ఇండియా అందించిన నిధులతో అఫ్గానిస్థాన్‌లో ఒక క్రికెట్‌ స్టేడియం నిర్మించుకోవడంతో పాటు మరికొన్ని సౌకర్యాలు సమకూర్చుకున్నారు. ఇక ఐపీఎల్‌ ద్వారా రషీద్‌, ముజీబ్‌ సహా చాలామంది క్రికెటర్లు ఆర్థికంగా, ఆటపరంగా ప్రయోజనం పొందారు. గతంలో అఫ్గాన్‌కు కోచ్‌గా పని చేసిన లాల్‌చంద్‌ ఆ జట్టు ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో మార్గనిర్దేశకుడిగా అజయ్‌ జడేజా ఆ జట్టును నడిపించాడు. ఈ ప్రపంచకప్‌ ప్రదర్శన అఫ్గాన్‌ క్రికెట్‌ ముఖచిత్రాన్నే మార్చేసింది. పరిమిత వనరులు, అరకొర సౌకర్యాలతోనే అఫ్గాన్‌ ఈ స్థాయికి ఎదిగిన తీరు ఒక స్ఫూర్తి పాఠమే

చంద్రశేఖర్‌రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.