సైనిక పాలకులపై ఉమ్మడి పోరు

మయన్మార్‌లో సైనిక నియంతృత్వ పాలనకు తెరదించడమే లక్ష్యంగా సాయుధ తిరుగుబాటు సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. తదనుగుణంగా తమ పోరాటాన్ని జోరెత్తిస్తున్నాయి. సంపూర్ణ సమన్వయంతో ముప్పేట దాడులు చేస్తూ మిలిటరీ పాలకులను బెంబేలెత్తిస్తున్నాయి.

Published : 07 Dec 2023 00:10 IST

మయన్మార్‌లో సైనిక నియంతృత్వ పాలనకు తెరదించడమే లక్ష్యంగా సాయుధ తిరుగుబాటు సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. తదనుగుణంగా తమ పోరాటాన్ని జోరెత్తిస్తున్నాయి. సంపూర్ణ సమన్వయంతో ముప్పేట దాడులు చేస్తూ మిలిటరీ పాలకులను బెంబేలెత్తిస్తున్నాయి.

బర్మాలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయడం ద్వారా సైన్యం పాలనా పగ్గాలు దక్కించుకొని దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఈ సైనిక సర్కారు (జుంటా) నియంతృత్వ పోకడలతో చెలరేగిన అంతర్యుద్ధం- దేశ ప్రజల జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తమ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పినవారిపై కొరడా ఝళిపిస్తూ సుమారు 25వేల మందిని సైన్యం కటకటాలపాలు చేసింది. 4,200 మంది ప్రాణాలను బలి తీసుకుంది. జుంటా తీరును చూస్తే మయన్మార్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ సమీప భవిష్యత్తులో అసాధ్యమన్న భావన ఓ దశలో అందరిలోనూ కలిగింది. అయితే, ఇటీవలి పరిణామాలతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది.

చాన్నాళ్లపాటు విడివిడిగా, అడపాదడపా దాడులతో సైనిక పాలకులకు చికాకు కలిగించిన ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థలు- ఇప్పుడు ఉమ్మడి పోరుతో వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ దాడుల్లో ‘త్రీబ్రదర్‌హుడ్‌ అలయన్స్‌ (టీబీఏ)’ది అత్యంత కీలక పాత్ర. ఇందులో మయన్మార్‌ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్‌డీఏఏ), టాంగ్‌ జాతీయ విమోచన సైన్యం(టీఎన్‌ఎల్‌ఏ), అరాకన్‌ ఆర్మీ(ఏఏ) భాగస్వామ్య పక్షాలు. దేశంలో అత్యంత శక్తిమంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలుగా వీటికి పేరుంది. తొలుత ఇవి జుంటాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొన్నప్పటికీ, ఇప్పుడు అంతర్యుద్ధంలో భాగమయ్యాయి. దాదాపు 10వేల మందితో ఉమ్మడి బలగాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ఏడాది అక్టోబరు 27న ‘ఆపరేషన్‌ 1027’ను ప్రారంభించిన టీబీఏ- జుంటా తేరుకునేలోపే 180కి పైగా సైనిక స్థావరాలతో పాటు ఇండియా, చైనా, థాయ్‌లాండ్‌లతో సరిహద్దుల్లోని కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. వీటిలో జుంటాకు ఆర్థికంగా చాలా కీలకమైన ప్రాంతాలు ఉన్నాయి. టీబీఏ జోరుతో చైనాతో సరిహద్దులోని షాన్‌ రాష్ట్రంలో, దక్షిణాన రఖైన్‌ రాష్ట్రంలో మిలిటరీ పట్టు కోల్పోయింది. పక్కా వ్యూహంతో టీబీఏ జరుపుతున్న దాడుల తీవ్రతకు చాలాచోట్ల సైనికులు పెద్దగా పోరాడకుండానే చేతులెత్తేస్తున్నారు. వారిలో కొంతమంది ఇండియాలోకి పలాయనం చిత్తగించారు. కచిన్‌ రాష్ట్రంలోని స్థానిక స్వాతంత్య్ర సైన్యం... మిలిటరీ స్థావరాలపై దాడులకు దిగడం ద్వారా టీబీఏకు సహకరించింది. తూర్పు రాష్ట్రం కరెన్నిలోనూ చిన్నపాటి సాయుధ సంస్థలు జుంటాపై సొంతంగా దాడులు ప్రారంభించాయి. ఇవన్నీ సైనిక పాలకులను ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. జుంటాతో పోలిస్తే తిరుగుబాటు సంస్థల వద్ద ఆయుధ సంపత్తి తక్కువ. దాంతో అవి ఎన్నాళ్లు పోరాటం కొనసాగించగలవన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే స్వప్రయోజనాల కోసం ఆయా సంస్థలకు బీజింగ్‌ పరోక్షంగా సహకారం అందజేస్తోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మయన్మార్‌ సరిహద్దుల నుంచి చైనాలోకి మత్తుపదార్థాల రవాణా జోరుగా జరుగుతోంది. ఆ దేశ సరిహద్దుల్లో వెలసిన కేంద్రాల నుంచి చైనీయులను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ మోసాలు పెరుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాలని డ్రాగన్‌ చాలాకాలంగా జుంటాను కోరుతోంది. అక్కడి నుంచి పెద్దగా స్పందన లేదని గుర్రుగా ఉన్న బీజింగ్‌- తిరుగుబాటు సంస్థలకు సాయం చేయడం ద్వారా డ్రగ్స్‌ రవాణాదారులు, సైబరాసురులను నిలువరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సైనిక స్థావరాల్లో పెద్దయెత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి తిరుగుబాటుదారులకు లభించినట్లు వార్తలొస్తున్నాయి. ఇవి ప్రజాస్వామ్య అనుకూలవాదులకు సంతోషాన్నిచ్చే విషయాలే. ప్రజల్లో తమపై వ్యతిరేకత పెరుగుతుండటంతో తీవ్ర అసహనంతో ఉన్న జుంటా- ఇప్పటికే పౌర స్థావరాలపై బాంబు దాడుల వంటి అకృత్యాలకు పాల్పడుతోంది. త్వరలోనే తీవ్రతను మరింతగా పెంచవచ్చు. చైనాతోనూ జుంటాకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. మయన్మార్‌ సైనిక పాలకులకు అత్యధికంగా ఆయుధాలు అందజేస్తున్నది బీజింగే. టీబీఏ దాడులతో సైనిక పాలకులు ఒత్తిడిలో ఉండటాన్ని అనుకూలంగా భావించి, ఆ దేశంపై తన ప్రభావాన్ని మరింత పెంచుకునేందుకు డ్రాగన్‌ ప్రయత్నించవచ్చు. బంగాళాఖాతంలోకి తమ ప్రవేశమార్గంగా బర్మాను అది చూస్తుంటుంది. ఈ పరిణామాలన్నింటినీ దిల్లీ గమనిస్తూ జుంటాతో సంబంధాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.

ఎం.నవీన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.