మొక్కలే మందులు

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ రంగంలో సంప్రదాయ మందులకు విశేష ఆదరణ లభిస్తోంది. 2050 నాటికి వర్ధమాన దేశాల్లో 70-95శాతం ప్రజలు వ్యాధుల నివారణకు ఔషధ మొక్కలు, మూలికలతో చేసే చికిత్సలపై ఆధారపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

Updated : 08 Dec 2023 07:15 IST

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ రంగంలో సంప్రదాయ మందులకు విశేష ఆదరణ లభిస్తోంది. 2050 నాటికి వర్ధమాన దేశాల్లో 70-95శాతం ప్రజలు వ్యాధుల నివారణకు ఔషధ మొక్కలు, మూలికలతో చేసే చికిత్సలపై ఆధారపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

రోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణకు సంప్రదాయ ఔషధ మొక్కలను వినియోగించడం అనాదిగా వస్తోంది. 2006 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 70వేల జాతుల ఔషధ మొక్కలు వినియోగంలో ఉన్నట్లు అంచనా. అయితే, వీటికి తగిన ప్రాచుర్యం దక్కడం లేదు. జీవవైవిధ్య నష్టం, సంప్రదాయ పరిజ్ఞాన వ్యవస్థలు కనుమరుగవుతుండటం వల్ల శక్తిమంతమైన ఔషధ మొక్కల్లో ఉండే స్వస్థత గుణాలు తెలియరాకుండా పోతున్నాయి. బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (బీఎస్‌ఐ) నివేదిక ప్రకారం, భారత్‌లో ఎనిమిది వేలకు పైగా జాతులకు చెందిన ఔషధ మొక్కలు అందుబాటులో ఉన్నాయి.

దేశంలో అనేక చోట్ల ఔషధ మొక్కలను ఉపయోగించే చికిత్సా విధానాలను తరతరాలుగా అనుసరిస్తున్నారు. మలబారు తీర ప్రాంతంలో లభ్యమయ్యే ఔషధ మొక్కల గుణాల ఆధారంగా 17వ శతాబ్దంలోనే ‘హోర్టస్‌ మలబారికస్‌’ అనే గ్రంథాన్ని నాటి డచ్‌ గవర్నర్‌ నేతృత్వంలో గ్రంథస్థం చేశారు. ఆధునిక కాలంలోనూ ఔషధ మొక్కలు, వాటి వినియోగంపై విరివిగా పరిశోధనలు జరుగుతున్నాయి. అటవీ జాతులవారు అనాదిగా ఔషధ మొక్కలను వినియోగిస్తున్న తీరు వీటి ద్వారా వెలుగులోకి వస్తోంది. అండమాన్‌ నికోబర్‌ దీవుల్లో ఉండే నాలుగు తెగలవారు తమ ఆరోగ్య పరిరక్షణకు మనదేశంలో మాత్రమే లభ్యమయ్యే 39రకాల ఔషధ మొక్కలను వినియోగిస్తున్నారు. 2018లో జరిగిన అధ్యయనం- వాటిలోని 17రకాల మొక్కలు వివిధ వ్యాధుల నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయని తేల్చింది. కేరళలోని వాయనాడ్‌లో ఎం.ఎస్‌.స్వామినాథన్‌ ఫౌండేషన్‌కు అనుబంధంగా సామాజిక వ్యవసాయ జీవవైవిధ్య కేంద్రం పనిచేస్తోంది. ఆ సంస్థ సీనియర్‌ డైరెక్టర్‌ ఎన్‌.అనిల్‌కుమార్‌ దేశంలో పలు తెగలవారు ఆరోగ్య అవసరాల కోసం అనుసరించే సంప్రదాయ విధానాలపై పరిశీలన సాగించారు. ఔషధ మొక్కలకు సంబంధించిన పరిజ్ఞానం రాతపూర్వకంగా వారికి అందుబాటులో లేనప్పటికీ, ఆయా తెగల్లోని పెద్దలు చెప్పడం, చేసి చూపించడం ద్వారా తరవాతి తరాలు నేర్చుకొన్నట్లు ఆయన గుర్తించారు. ఔషధ మొక్కల ద్వారా తయారయ్యే మందులు సురక్షితమేనా, ఎంతవరకు పనిచేస్తాయి, అందుకు శాస్త్రీయ నిరూపణ ఏమిటన్న ప్రశ్నలు నేడు వినిపిస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. మొక్కల నుంచి తయారయ్యే ఔషధాల్లో కల్తీ జరిగితే, దాన్ని శాస్త్రీయంగా గుర్తించడం చాలా కష్టం. అటువంటి మందులను వినియోగించడంవల్ల వికారం తలెత్తడం మొదలు మూత్రపిండాలు వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది. మార్కెట్‌ పెరుగుతుండటంతో నకిలీ మూలికలు, పదార్థాలతో ఔషధాలను తయారు చేయడమూ ఎక్కువవుతోంది. ఔషధ తయారీలో గోప్యతను పాటిస్తుండటంవల్ల శాస్త్రీయత ఏమిటన్నది పరీక్షించడం వీలుకాదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ‘ఆయుష్‌’ విభాగం- ఔషధ తయారీలో నాణ్యతా ప్రమాణాలను లక్షించి మార్గదర్శకాలను సూచించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, దేశదేశాల్లో లభ్యమవుతున్న 25శాతం ఔషధాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఔషధ మొక్కల నుంచి తయారైనవే! అత్యంత ఖరీదైన ఔషధ మొక్కలు భారత్‌లో లభ్యమవుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న వాణిజ్యంలో 880 జాతుల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయని భారత ఎగుమతులు-దిగుమతుల (ఎగ్జిమ్‌) బ్యాంక్‌ అధ్యయనం పేర్కొంది. వీటిలో 48 జాతుల ఉత్పత్తులు భారత్‌ నుంచి ఎగుమతి అవుతుంటే, 42 జాతుల ఉత్పత్తులను దిగుమతి చేసుకొంటున్నామని అది విశ్లేషించింది.

ఔషధ మొక్కల పెంపకం, పరిరక్షణ కోసం కేంద్రం ఆయుష్‌ విభాగం కింద ‘ఔషధ మొక్కల జాతీయ కార్యక్రమం’ చేపడుతోంది. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ఏర్పాటైన మెడిసినల్‌ ప్లాంట్‌ బోర్డులు దీని అమలును పర్యవేక్షిస్తున్నాయి. అశ్వగంధ, కలబంద, తులసి, చందనం, అడవి నాభి, తిప్పతీగ వంటి ఔషధ మొక్కల సాగుకు 30-75శాతం రాయితీ కల్పిస్తున్నారు. జ్ఞాపకశక్తి పెరుగుదల, మానసిక సమస్యల నివారణ, చక్కెర వ్యాధి నియంత్రణకు అశ్వగంధను విరివిగా వినియోగిస్తున్నారు. ఇటువంటి మొక్కల సాగును మరింతగా ప్రోత్సహించడంతో పాటు నూతన ఔషధాల తయారీ దిశగా పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను జోరెత్తించాలి. మానవాళి ఎదుర్కొంటున్న అనేక వ్యాధులకు ఎటువంటి దుష్ప్రభావాలు ఉండని సమర్థవంతమైన సంప్రదాయ ఔషధాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలి.

 వి.వి.హరిప్రసాద్‌
(విశ్రాంత ఉప అటవీ సంరక్షణాధికారి)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.